తెలంగాణ

telangana

పల్లెలో తందూరీ బట్టీ... దేశవిదేశాలకు ఎగుమతి

By

Published : Feb 22, 2021, 4:16 AM IST

నారాయణపేట జిల్లా... కరవు, వలసలకు మారుపేరు. అలాంటి జిల్లాలోని మారుమూల గ్రామంలో తయారైన తందూరీ బట్టీలు ఇప్పుడు ఇతర రాష్ట్రాలతోపాటు దేశవిదేశాలకు ఎగుమతి అవుతున్నాయి. 20ఏళ్లుగా కుమ్మరులు వీటిని తయారు చేస్తూ ఉపాధి పొందుతున్నారు. దామరగిద్ద మండలం నర్సాపూర్‌లో తయారవుతున్న తందూరీ బట్టీలపై కథనం.

Tandoori kiln in the countryside ... Exported to foreign countries
Tandoori kiln in the countryside ... Exported to foreign countries

రెస్టారెంట్లు, దాబాలు, స్టార్ హోటళ్లలో తందూరీ రోటి లేకుండా వంటకాల జాబితా ఉండదు. క్యాటరింగ్ సహా ఇళ్లలోనూ తందూరీరోటిని తయారు చేస్తారు. వీటి తయారీకి తందూరీ బట్టీ తప్పనిసరి. అలాంటి బట్టీలు తయారుచేసి ఇతర రాష్ట్రాలకు, విదేశాలకూ పంపుతున్నారు నర్సాపూర్ గ్రామ కుమ్మరులు. మట్టితో తయారు చేసే బట్టీలు పలు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలకు ఎగుమతి అవుతున్నాయి. ఏటా 800లకు పైగా బట్టీలను సిద్ధం చేసి పంపుతున్నారు. మరికొందరు ఇక్కడ హోల్‌సేల్‌గా కొనుగోలు చేసి ఇతర ప్రాంతాల్లో విక్రయిస్తుంటారు. ఇక్కడ కొనుగోలు చేసిన బట్టీలను కొన్నిసంస్థలు ముంబయి, హైదరాబాద్ నుంచి వివిధ దేశాలకు ఎగుమతి చేస్తూ ఉంటాయని తయారీదారులు చెబుతున్నారు. ఆన్‌లైన్ మార్కెట‌్‌లోనూ తందూరీ బట్టీలకు డిమాండ్ ఎక్కువే ఉంటుందని తెలిపారు.


అవసరాలకు తగ్గట్లుగా వివిధ పరిమాణాల్లో ఈ బట్టీలను తయారు చేస్తారు. పెద్ద, మధ్య సైజు బట్టీలను స్టార్ హోటళ్లు, రెస్టారెంట్లలో ఉపయోగిస్తారు. చిన్నసైజు బట్టీలను క్యాటరింగ్, గృహావసరాల కోసం వినియోగిస్తారు. విదేశాలకు అవసరమైన సైజుతో బట్టీలు తయారు చేసి ఎగుమతి చేస్తారు. బ‌ట్టీల్లో వేడి బయటకు రాకుండా గాజు, ఇసుక, ఉప్పు మిశ్రమాలతో నింపుతారు. దానిపై ఉక్కు, ఇనుము, రాగి, ఇటుక, సిమెంట్‌తో కప్పిఉంచుతారు. మట్టిబట్టీ 300 నుంచి 5వేల వరకు ధర పలికితే, స్టీల్, ఇనుము, రాగి, సిమెంట్ కాంక్రీట్ బట్టీలు 15 వేల నుంచి 50వేల రూపాయల వరకు ధర ఉంటాయి. కేవలం మట్టి బట్టీలపైనే నర్సాపూర్‌లో ఏటా 5 నుంచి 10 లక్షల వ్యాపారం సాగుతోంది.


నర్సాపూర్‌లో కేవలం మట్టిబట్టీలే రూపొందిస్తారు. స్టీల్, ఇనుము, రాగి తొడుగుల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లి అక్కడ ప్రత్యేకంగా తయారు చేయిస్తారు. వాటిని సైతం నర్సాపూర్‌లోనే సిద్ధం చేసేలా పరిశ్రమ ఏర్పాటుచేస్తే మరింత ఉపాధి దొరికే అవకాశం ఉందని తయారీదారులు చెబుతున్నారు. తందూరీ బట్టీలను ఏడాది, రెండేళ్లకోసారి తప్పకుండా మార్చాల్సిరావటంతో డిమాండ్ ఎప్పుడూ ఉంటుంది.

అంతర్జాతీయ ప్రమాణాలతో నాణ్యమైన బట్టీలు తయారు చేసేలా శిక్షణ అందించడంతో పాటు పరిశ్రమ ఏర్పాటు చేస్తే వృత్తిదారులకు మేలు జరుగుతుందని కుమ్మరులు కోరుతున్నారు.

ఇదీ చదవండి:నడ్డా సమక్షంలో భాజపాలో చేరిన శ్రీశైలం గౌడ్‌

ABOUT THE AUTHOR

...view details