తెలంగాణ

telangana

కోట్ల విలువ చేసే స్థలాలున్నా.. ఆదాయం సున్నా

By

Published : Dec 20, 2020, 1:50 PM IST

నారాయణపేట జిల్లా కేంద్రంలో ఆర్టీసీకి కోట్ల రూపాయల విలువ చేసే ఖాళీ స్థలాలున్నాయి. వీటిని ఆదాయ మార్గాలుగా మలుచుకోవడంలో మాత్రం అధికారులు విఫలమవుతున్నారు. ఫలితంగా ఆ స్థలాలన్ని పిచ్చిమొక్కలతో నిండిపోయి.. నిరుపయోగంగా దర్శనమిస్తున్నాయి.

special story on rtc Empty places in narayanapet district
కోట్ల విలువ చేసే స్థలాలున్నా.. ఆదాయం సున్నా

ఉమ్మడి మహబూబ్​నగర్ జిల్లా నుంచి నూతనంగా ఏర్పాటైన నారాయణపేట జిల్లాలో ఆర్టీసీకి కోట్ల రూపాయల విలువ చేసే భూములున్నాయి. జిల్లా కేంద్రం కావడం వల్ల హోటళ్లు, చిన్న చిన్న దుకాణ సముదాయాలు ఏర్పాటు చేసుకునేందుకు ఎంతో మంది ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే జిల్లా కేంద్రంలో అద్దెలు భారీగా పెంచేశారు. చిన్న షట్టర్​ అద్దెకు తీసుకోవాలన్నా.. రూ.15 నుంచి 20 వేల వరకు అద్దె చెల్లించాల్సి వస్తోంది. ఫలితంగా చిన్న చిన్న వ్యాపారాలు చేద్దామనుకునే ఎంతో మంది అద్దె భారం భరించలేక వెనకడుగు వేస్తున్నారు.

స్థలాలున్నా.. నిరుపయోగం..

జిల్లా కేంద్రం నడిబొడ్డున పాత బస్టాండ్ దగ్గర ప్రధాన రహదారికి ఆనుకొని ఆర్టీసీకి సంబంధించిన 0.52 ఎకరాలు, కొత్త బస్టాండ్ వద్ద డిపో ముందు హైదరాబాద్ రోడ్డుకు ఆనుకుని 2.20 ఎకరాలు, ఊట్కూరు మండల కేంద్రం ప్రధాన రహదారి స్టేజీ వద్ద 0.83 ఎకరాల ఖాళీ స్థలాలు ఉన్నాయి. ప్రధాన రహదారులకు ఆనుకొని ఉన్నా.. వాటిని సక్రమంగా ఉపయోగించుకోవడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఫలితంగా ఆ స్థలాల్లో పిచ్చి మొక్కలు పెరిగి.. డంపింగ్ యార్డులుగా దర్శనమిస్తున్నాయి.

వినియోగంలోకి తేవాలి..

ఈ క్రమంలోనే జిల్లా కేంద్రంలోని ఖాళీ స్థలాలను వినియోగంలోకి తీసుకువస్తే.. ఆర్టీసీకి ఆదాయంతో పాటు నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి.. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

మరోవైపు జిల్లా కేంద్రంలో వ్యవసాయ శాఖకు సంబంధించిన 32 దుకాణ సముదాయాలు ఉన్నాయి. వీటిని అద్దెకు ఇవ్వడంలోనూ అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారు.

ఇదీ చూడండి: నేటి తూర్పు నగరం.. రేపటి ఐటీ హారం!

ABOUT THE AUTHOR

...view details