తెలంగాణ

telangana

Kalankari handicraft: కలంకారీ హస్తకళకు పూర్వవైభవం.. మహిళలకు ఉచిత శిక్షణ

By

Published : Mar 7, 2022, 5:52 AM IST

Kalankari

Kalankari handicraft: అంతరించిపోతున్న ప్రాచీన హస్తకళ కలంకారీ. అలాంటి కళకు పునరుజ్జీవనం పోయడంతో పాటు, మహిళలకు ఉపాధి కల్పించేందుకు కృషి చేస్తోంది నారాయణపేట జిల్లా యంత్రాంగం. నాబార్డు సాయంతో జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ కలంకారిలో మహిళలకు ఉచిత శిక్షణ అందిస్తోంది. అంతరించిపోతున్న కళకు, ఆధునిక పోకడను జతచేస్తూ తర్ఫీదునిస్తోంది. రాష్ట్రంలోనే తొలిసారి నారాయణపేటలో ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్న కలంకారీ శిక్షణపై ప్రత్యేక కథనం.

కలంకారీ హస్తకళకు పూర్వవైభవం.. మహిళలకు ఉచిత శిక్షణ

Kalankari handicraft: కలంకారీ.. 3వేల ఏళ్ల కిందటి ప్రాచీన హస్తకళ. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాళహస్తి, ఇరాన్‌లాంటి దేశాల్లో పేరుగాంచింది. ఆనాటి సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబిస్తూ సహజ వర్ణాలతో దుస్తులపై బొమ్మలు గీయడమే కలంకారీ ప్రత్యేకత. వేలఏళ్ల చరిత్ర ఉన్న కలంకారీ ప్రస్తుతం అంతరించే దశలో ఉంది. అలాంటి అరుదైన కళకు పునరుజ్జీవనం పోయడంతో పాటు ఆ కళను మహిళలకు నేర్పడం ద్వారా ఉపాధి కల్పించేదుకు కృషి చేస్తోంది నారాయణపేట జిల్లా యంత్రాంగం. 50మంది మహిళలకు 80రోజుల పాటు నారాయణపేటలో ఉచిత శిక్షణ సాగనుంది.

అభిరుచిని బట్టి...

కలంకారీలో నైపుణ్యం సాధించడం సులువైన పనేం కాదు. అందులో ప్రతిప్రక్రియ కీలకమైందే. నైపుణ్యాలు ఒక్కొక్కటిగా నేర్చుకుంటూ అన్ని దశల్ని పూర్తి చేయాలి. ముందుగా రంగులు వేయాల్సిన వస్త్రానికి కరక్కాయ ప్రక్రియ జాగ్రత్తగా పూర్తి చేయాలి. కరక్కాయ ప్రకియ పూర్తైన వస్త్రంపై గ్లాస్ పెన్సిల్‌తో డిజైన్ వేస్తారు. పూలు, దేవుడి ప్రతిమలు, జంతువులు ఇలా ఎలాంటి డిజైనైనా సరే... వేయడాన్ని శిక్షణలో నేర్పుతున్నారు. వినియోగదారుని అభిరుచిని బట్టి చాలా డిజైన్లలో తర్పీదు పొందుతున్నారు. …

సహజ రంగులు...

పెన్సిల్‌తో వేసిన డిజైన్‌కు ముందుగా కసీంతో బార్డర్ లైన్ వేస్తారు. దీన్నికసీం అంటారు. కసీం అంటే సహజంగా తయారైన నల్లనిరంగు. రంగు వేయడానికి వెదురుతో చేసిన ప్రత్యేకమైన కలాన్ని వినియోగిస్తారు. మొత్తం ప్రక్రియలో ప్రకృతిసిద్ధంగా లభించే సహజ రంగులనే వినియోగిస్తారు. కసీంతో బార్డర్ లైన్ వేసిన తర్వాత రంగులు నింపుతారు. సహజంగా దొరికే పదార్థాలతోనే ఈ రంగులు తయారు చేస్తారు. కలంకారీలో రంగులు వేయడం సమయంతో కూడుకున్న పని. డిజైన్, రంగులను బట్టి అవి వేసేందుకు వారం నుంచి నెల వరకు కూడా పటొచ్చు.

భవిష్యత్​లో డిమాండ్...

వినియోగదారుల అభిరుచికి తగ్గట్టు కావాల్సిన డిజైన్‌ను కావాల్సిన రంగులతో వేయగలగడం కలంకారీ ప్రత్యేకత. సహజ ఉత్పత్తులతో తయారయ్యే నూలు, పట్టు,లెనిన్, మల్‌మల్, జూట్ వస్త్రాలపై ఈ కలంకారీ చిత్రాలు వేసుకోవచ్చు. చీరలు, దుపట్టాలు, వాల్‌హాంగిగ్స్ దేనిపైనైనా కలంకారీ చిత్రాలు అద్దవచ్చు. కలంకారీ వస్త్రాలకు భవిష్యత్తులో డిమాండ్ ఉంటుందని, శిక్షణతో ఆర్థికంగా భరోసా కలుగుతుందనే ధీమాతో శిక్షణ పొందుతున్న మహిళలు ఉన్నారు.

చేనేత కార్మికులకు ఉపాధి...

శిక్షణ పూర్తైన తర్వాత తమవద్దే ఉపాధి కల్పిస్తామని చెబుతున్నారు శిక్షకురాలు దీపికా సరోదే. లేదంటే సొంతంగా వాళ్లే వ్యాపారం పెట్టుకుని వ్యాపారులుగా ఎదగవచ్చని సూచిస్తున్నారు. రాష్ట్రంలోనే మొదటిసారిగా నారాయణపేటలో కలంకారీ శిక్షణ ప్రయోగాత్మకంగా విజయవంతమైందని ఆమె అభిప్రాయపడ్డారు. ఆదరణ లేక ఆదాయం కోల్పోతున్న నారాయణపేట చేనేత రంగానికి కలంకారీ శిక్షణ కళ తీసుకువస్తోంది. అదనపు విలువను జోడించేలా అధికారులు చర్యలు తీసుకుంటే చేనేత కార్మికులకు సైతం ఉపాధి దొరికే అవకాశముంది.

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details