తెలంగాణ

telangana

'కరోనా కట్టడికి అధికారులందరూ కలిసి పనిచేయాలి'

By

Published : Jun 5, 2021, 11:18 AM IST

review on corona, corona situations
కరోనా పరిస్థితులపై సమీక్ష, నారాయణ పేట ()

కరోనా కట్టడికి అధికారులందరూ కలిసి పనిచేయాలని నారాయణపేట జిల్లా అధికారులకు వైద్యారోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రిజ్వి ఆదేశించారు. ఫీవర్ సర్వే, లాక్​డౌన్​ను మరింత పటిష్ఠంగా అమలు చేయాలని సూచించారు. జిల్లాలోని కొవిడ్ పరిస్థితులపై అధికారులతో కలిసి సమీక్షించారు.

నారాయణపేట జిల్లాలో కొవిడ్ నియంత్రణకు ఫీవర్ సర్వే మరింత పటిష్ఠంగా నిర్వహించాల్సిన అవసరం ఉందని వైద్యారోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రిజ్వి అన్నారు. శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్​లో రాష్ట్ర వైద్యారోగ్య సంచాలకులు శ్రీనివాస రావు, కలెక్టర్ డి.హరిచందనతో కలిసి కరోనా పరిస్థితులపై సమీక్షించారు. కొవిడ్ కట్టడికి జిల్లాలో తీసుకున్న చర్యలు, ఇంటింటి సర్వే, పరీక్షలపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం పలు సూచనలు చేశారు.

పాజిటివ్ కేసులు అధికంగా ప్రాంతాలను గుర్తించి వాటిపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. పరీక్షల సంఖ్యను పెంచాల్సిన అవసరం ఉందన్నారు. లక్షణాలు ఉన్న వారిని గుర్తించి మందుల కిట్ అందించి రోజూ పర్యవేక్షించాలని సూచించారు. లాక్​డౌన్​ను పటిష్ఠంగా అమలు చేయాలని ఆదేశించారు. అధికారులందరూ సమన్వయంతో పని చేసి కరోనా నియంత్రణకు కృషి చేయాలని అన్నారు. కొవిడ్ నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

జిల్లాలోని మూడు మండలాలు కర్ణాటకతో సరిహద్దులు కలిగి ఉండడం వల్ల కేసులు పెరుగుతున్నాయని కలెక్టర్ తెలిపారు. మూడు కరోనా కేర్ సెంటర్లను ఏర్పాటు చేసి మెరుగైన వైద్యం అందిస్తున్నామని చెప్పారు. ఇప్పటి వరకు నిర్వహించిన ఫీవర్ సర్వే, పంపిణీ చేసిన కిట్ల వివరాలు వెల్లడించారు. ఈ సమావేశంలో డా.కరుణాకర్, డా.గంగాధర్, అదనపు కలెక్టర్ కె. చంద్రా రెడ్డి, ఆర్డీవో వెంకటేశ్వర్లు, జిల్లా వైద్యాధికారి జయ చంద్ర మోహన్, అన్ని మండలాల ప్రత్యేక అధికారులు తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:రైతుకష్టం నేలపాలు కాకుండా చూసే దారేది?

ABOUT THE AUTHOR

...view details