తెలంగాణ

telangana

నిలువ నీడలేక ఓ కుటుంబం... చూస్తోంది ఓ చిన్న సాయం కోసం

By

Published : Mar 27, 2021, 3:13 PM IST

Updated : Mar 27, 2021, 5:10 PM IST

కష్టం ఆ ఇంటిని చుట్టుముట్టింది. ఏనాటికైనా మంచి రోజులొస్తాయని ఎదురు చూస్తున్న వారి బతుకుల్లో ఒకటి వెనుకొకటి ముంచెత్తిన ఇబ్బందులు వారి జీవితాల్లో ఆనందాన్ని లాగేశాయి. విధి తమపై ఎంత చిన్న చూపు చూసినా.. ఏ నాటికైనా తమ బతుకులు మారకపోతాయా అని ఎదురు చూస్తోంది నారాయణపేట జిల్లా మక్తల్​ పట్టణానికి చెందిన మరిన్​ బీ కుటుంబం.

human interest story, sad story
narayanapet, marin b family, family financial struggles

నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణానికి చెందిన మరిన్ బీ కథ వింటే... కన్నీటికి కూడా కనికరం కలగకమానదు. ఒకటా రెండా కష్టాలకు ఎంతో ఇష్టమైనట్టు ఒకదానివెనుకొకటి ఆమె కుటుంబాన్ని అడుగడుగునా కుంగదీశాయి. కటిక గెరికి చెందిన మరిన్ బీ భర్త హుస్సేన్ 20 ఏళ్ల కిందట కామెర్ల వ్యాధితో మృతి చెందాడు. అప్పటి నుంచి ముగ్గురు కుమార్తెలను రెక్కల కష్టంతోనే పెంచుతోంది. రెండో కుమార్తెతో కలిసి మాంసం దుకాణంలోని మేక తలకాయలు తీసుకొచ్చి కాల్చి... ఆ కూలితోనే ఆ కుటుంబం బతుకుతోంది.

పెద్ద కుమార్తె ఆశా బీకి పెళ్లి చేయగా... ఆమె భర్త గుండెజబ్బుతో మృతిచెందడం వల్ల ఇద్దరు పిల్లలతో ఆమె పుట్టింటికి వచ్చింది. 2008లో రెండో కుమార్తెకు రాయచూర్​కు చెందిన వ్యక్తికిచ్చి వివాహం చేయగా... అతనికి మతిస్థిమితం లేకపోవడం వల్ల ఆమె పుట్టింటికి వచ్చేసింది. ఇక పెళ్లీడుకొచ్చిన మూడో కుమార్తె షాబిదా బేగం ఐదేళ్ల క్రితం మతిస్థిమితం కోల్పోయింది. ఆమెకు వైద్యం చేయించినా నయం కాలేదు.

అదే వారి జీవనాధారం

రెండో కుమార్తెతో కలిసి పట్టణంలోని మాంసం దుకాణాల వద్ద మేక తలకాయలు తీసుకొచ్చి వాటిని కాల్చి కూలీ తీసుకుంటుంది మరిన్​ బీ. ఆ ఆదాయంతోనే ఆ కుటుంబాన్ని నెట్టుకొస్తుంది. 65 ఏళ్ల వృద్ధురాలైన తల్లి ముగ్గురు కూతుళ్లకు పెద్దదిక్కుగా మారింది. వారిద్దరి కూలితోనే బతుకు బండిని నడిపిస్తోంది.

వర్షమొస్తే దర్గానే దిక్కు

అద్దె ఇంటిలో నెట్టుకొస్తున్న ఆ కుటుంబానికి వర్షమొస్తే దర్గానే దిక్కు. కొద్దిపాటి వర్షానికే ఇంట్లో వాన కురుస్తుంది. అందరూ దర్గాలోనే తలదాచుకుంటారు. అధికారులు, ప్రభుత్వం స్పందించి తమకొక డబుల్​బెడ్​రూం ఇల్లు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేస్తోంది... ఆ నీడలేని కుటుంబం.

నిలువ నీడలేక ఓ కుటుంబం... చూస్తోంది ఓ చిన్న సాయం కోసం

ఇదీ చూడండి:గిరిజన మహిళలపై ఫారెస్ట్ సిబ్బంది దాష్టీకం.. నలుగురి పరిస్థితి విషమం

Last Updated :Mar 27, 2021, 5:10 PM IST

ABOUT THE AUTHOR

...view details