తెలంగాణ

telangana

అట్టహాసంగా నామినేషన్​ దాఖలు చేసిన తెరాస అభ్యర్థి కూసుకుంట్ల

By

Published : Oct 13, 2022, 3:42 PM IST

Koosukuntla Prabhakar Reddy Nomination: మునుగోడులో తెరాస అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. బంగారిగడ్డ నుంచి చండూరు వరకు భారీ ర్యాలీగా వచ్చిన కూసుకుంట్ల రిటర్నింగ్​ అధికారికి నామపత్రాలు సమర్పించారు. కూసుకుంట్ల వెంట మంత్రి కేటీఆర్, ఎర్రబెల్లి దయాకర్‌రావు, పలువురు ఎమ్మెల్యేలు తదితరులు ఉన్నారు.

నామినేషన్​ దాఖలు చేసిన తెరాస అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్​రెడ్డి
నామినేషన్​ దాఖలు చేసిన తెరాస అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్​రెడ్డి

Koosukuntla Prabhakar Reddy Nomination: మునుగోడు ఉప ఎన్నికకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. ఈ నెల 7న ప్రారంభమైన నామినేషన్ల ప్రక్రియ రేపటితో ముగియనుంది. ఇప్పటికే భాజపా తరఫున కోమటిరెడ్డి రాజగోపాల్​రెడ్డి తన నామినేషన్​ దాఖలు చేశారు. తాజాగా తెరాస అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్​రెడ్డి నేడు​ భారీ ర్యాలీగా వెళ్లి రిటర్నింగ్​ అధికారికి నామపత్రాలు సమర్పించారు. నామినేషన్లకు రేపే చివరి రోజు కావడంతో కాంగ్రెస్​ అభ్యర్థి పాల్వాయి స్రవంతి రేపు నామినేషన్​ వేసే అవకాశం ఉంది. చివరి రోజు కావడంతో రేపు నామినేషన్ల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.

అంతకుముందు కూసుకుంట్ల ప్రభాకర్​రెడ్డి నామినేషన్‌ కోసం బంగారిగడ్డ నుంచి చండూరు వరకు తెరాస భారీ ర్యాలీ చేపట్టింది. ఈ ర్యాలీలో తెరాస అభ్యర్థి కూసుకుంట్ల వెంట మంత్రులు కేటీఆర్, ఎర్రబెల్లి దయాకర్‌రావు, పలువురు ఎమ్మెల్యేలు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన మంత్రి కేటీఆర్‌కు పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. జాతీయ రహదారిపై చౌటుప్పల్‌లో తెరాస పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు భాస్కరరావు, సుదీర్‌రెడ్డి, బేతి సుభాష్ రెడ్డి, వివేకానంద గౌడ్, డాక్టర్‌ సంజయ్‌కుమార్‌తో పాటు స్థానిక నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. డ్రోన్‌పై నుంచి గులాబీ పూలు చల్లారు.

32 మంది.. 52 సెట్ల నామినేషన్లు..: మునుగోడు ఉప ఎన్నికలో ఇప్పటి వరకు 32 మంది అభ్యర్థులు.. 52 సెట్ల నామినేషన్లు దాఖలు చేసినట్లు అధికారులు వెల్లడించారు. నిన్న తెలంగాణ జన సమితి పార్టీ తరఫున పల్లె వినియ్‌కుమార్‌, బహుజన సమాజ్‌ పార్టీ నుంచి ఆందోజు శ్రీనివాస చారి నామపత్రాలు సమర్పించారు. ఉపఎన్నికల్లో పలువురు స్వతంత్ర అభ్యర్థులుగా పోటీలో నిలుస్తున్నారు. రైతు పక్షాన ప్రముఖ చిన్నపిల్లల వైద్యులు కోమటిరెడ్డి సాయితేజ్ రెడ్డి చండూర్ బస్టాండ్ నుంచి ఎద్దులబండితో ర్యాలీగా వచ్చి రిటర్నింగ్‌ అధికారికి నామపత్రం సమర్పించారు.

ABOUT THE AUTHOR

...view details