తెలంగాణ

telangana

Land Grabbing: ఆలయ భూముల ఆక్రమణ.. దేవుడికి ఆధార్‌ కార్డు లేకపోవడమే కారణం!

By

Published : Sep 6, 2021, 10:16 AM IST

Land Grabbing: ఆలయ భూముల ఆక్రమణ.. దేవుడికి ఆధార్‌ కార్డు లేకపోవడమే కారణం!

ఆలయాల నిర్వహణకు పూర్వమెప్పుడో దాతలు ఇచ్చిన భూములను అక్రమార్కుల నుంచి విడిపించాలని దేవుడే కోర్టు చుట్టూ తిరగాల్సిన దుస్థితి నెలకొంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఆలయాల భూములను ఆక్రమించుకున్న అనేక మంది పెద్దలుగా చలామణి అవుతున్నారు. ఆ భూములు దేవుడికి చెందినవి, ఆలయానికి అప్పగించాలని భక్తులు కోరినా ఎవరూ పట్టించుకోవడంలేదు. అధికారులు కేసులు పెట్టి కోర్టు చుట్టూ తిరుగుతున్నా భూములను అక్రమార్కుల నుంచి స్వాధీనం చేసుకోవడంలో కాలయాపన జరుగుతూనే ఉంది. దేవాదాయ, ధర్మాదాయ శాఖ కమిషనర్‌ ప్రత్యేక అధికారులను నియమించినా ఎక్కడి ఆక్రమణలు అక్కడే ఉన్నాయి. ధరణి పోర్టల్‌ ఏర్పడిన తరువాత ఆలయ భూములకు పట్టాదారు పాసుబుక్కులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినా దేవునికి ఆధార్‌ కార్డు లేక ఆ ప్రక్రియ ఆగిపోయింది.

రాష్ట్రంలోనే దేవాలయాల భూములు అధికంగా ఉన్న జిల్లాల్లో ఉమ్మడి నల్గొండ జిల్లా ఒకటి. చాలా కాలం భూముల పర్యవేక్షణతో పాటు దేవాలయాల నిర్వహణ సైతం రెవెన్యూశాఖ పర్యవేక్షణలో ఉంది. ప్రత్యేకంగా దేవాదాయ శాఖ ఏర్పాటు చేసినా భూముల రికార్డుల పూర్తి వివరాలు దేవాదాయ శాఖ వద్ద లేవు. ప్రతి పురాతన దేవాలయం వారీగా భూముల రికార్డులపై విచారణ చేపట్టాలని భక్తులు కోరుతున్నా రెండు శాఖల మధ్య సమన్వయంలేక అనేక చోట్ల ఆక్రమణదారుల చేతిలోనే భూములు ఉన్నాయి.రికార్డులను మార్చి అనేక మంది ఇతరులకు అమ్ముకున్నారు.

భూముల స్వాధీనానికి ప్రత్యేక అధికారులు:

ఉమ్మడి జిల్లాలో ఆక్రమణలకు గురైన దేవుని భూములను స్వాధీనం చేసుకోవడానికి విజిలెన్స్‌ అధికారిగా అదనపు కమిషనర్‌ కృష్ణవేణి, రెవెన్యూ సమస్యలు పరిశీలించడానికి ఒక తహసీల్దారును నియమించారు. దేవుని భూముల వివరాలు అన్ని మండలాలకు ఇవ్వాలని లేఖలు రాసినా వివరాలు అందడం లేదని సమాచారం.

ఆక్రమణలు మచ్చుకు కొన్ని

  • జిల్లా కేంద్రంలోని ఛాయా సోమేశ్వరాలయానికి 16 ఎకరాల భూమి ఉందని భక్తులు చెబుతున్నా ఆరు ఎకరాల్లో ఆలయం, కోనేరు మాత్రం మిగిలాయి. మిగిలిన భూమి రికార్డు మారిందని గుర్తించినా సరిచేయడంలేదు. కనీసం సర్వే చేయడానికి ముందుకు రావడంలేదు.
  • నల్గొండలోని బ్రహ్మంగారి గుడికి చెందిన 12 ఎకరాల భూమిని ఓ స్థిరాస్తి వ్యాపారి రికార్డుల్లో మార్పులు చేయించి నివాస స్థలాలుగా మార్చి రిజిస్ట్రేషన్‌ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. భక్తుల ఒత్తిడితో అధికారులు ట్రైబ్యునల్‌కు వెళ్లి కేసు గెలిచారు. అది దేవాలయ భూమి అని అక్కడ బోర్డు ఏర్పాటు చేశారు. దీనిపై వ్యాపారి హైకోర్టు నుంచి స్టే పొందారు. అధికారులు స్టే తొలగించే ప్రక్రియ చేపట్టాల్సి ఉంది.
  • యాదగిరిగుట్ట ఆలయ సమీపంలో దాతలు భక్తులు సేద తీరడానికి ఏర్పాటు చేసిన సత్రాలు, ఇతర భవనాలు తమవేనంటూ వారి వారసులు కొందరు కోర్టుకెక్కారు.

ఉమ్మడి నల్గొండ జిల్లాలో..

ఉమ్మడి జిల్లాలో ప్రభుత్వం గుర్తించిన దేవాలయాలు 8 వేల వరకు ఉన్నాయి. 501 దేవాలయాలకు 15,712 ఎకరాల భూములు ఉన్నాయని ఇప్పటివరకు అధికారులు గుర్తించారు. ఇంకా వెలుగులోకి రాకుండా పట్టా మార్పిడి జరిగిన భూములు అనేకం ఉన్నాయని భక్తులు ఆరోపిస్తున్నారు. అర్చకుల స్వాధీనంలో 2,540 ఎకరాల భూములు ఉన్నాయి. అధికారులు 6,400 ఎకరాల భూములను రైతులకు కౌలుకు ఇచ్చి రూ.3 కోట్ల వరకు ఆదాయం పొందుతున్నారు. 1,557 ఎకరాలు సాగు యోగ్యం కాని భూములు ఉన్నాయని గుర్తించారు. 600 ఎకరాలకు పైగా భూములు ఆక్రమించారని దేవాదాయ, ధర్మాదాయశాఖ ఫిర్యాదులపై ట్రైబ్యునల్‌లో 60 కేసులు, హైకోర్టులో 48 కేసులు విచారణలో ఉన్నాయి.

భూములు స్వాధీనం చేసుకుంటాం

-మహేంద్రకుమార్‌, సహాయ కమిషనర్‌, దేవాదాయ, ధర్మాదాయశాఖ

దేవుని భూమిగా ఉండి పట్టా మార్పిడి జరిగిన ఆస్తులను స్వాధీనం చేసుకుంటాం. అనేక చోట్ల భూములు గుర్తించి సర్వే చేయించి స్వాధీనం చేసుకున్నాం. కొన్ని చోట్ల రికార్డులు మార్చి రిజిస్ట్రేషన్‌ చేసినా, భవనాలు నిర్మించినా స్వాధీనం తప్పదు. కోర్టు కేసులలో ఉన్నవి త్వరగా తెమల్చడానికి ప్రయత్నిస్తున్నాం. దేవుని భూమి ఆక్రమణకు గురైనట్లు గుర్తిస్తే సమాచారం ఇవ్వాలి. ప్రభుత్వ సూచనల ప్రకారం కోర్టు కేసులు అధిగమిస్తూ భూములు కాపాడుతున్నాం.


ఇదీ చూడండి:

KBC: కేబీసీలో దాదా, సెహ్వాగ్​లకు కేటీఆర్​​పై ప్రశ్న.. అదేంటంటే..?

ABOUT THE AUTHOR

...view details