తెలంగాణ

telangana

సాగర్ గండి పూడ్చేందుకు అడ్డంకిగా మారిన నీటి ప్రవాహం

By

Published : Sep 8, 2022, 7:37 PM IST

Updated : Sep 8, 2022, 7:57 PM IST

నాగార్జునసాగర్
నాగార్జునసాగర్

నాగార్జునసాగర్ ఎడమ కాల్వకు పడిన గండిని పూడ్చటం అధికారులకు కత్తిమీద సాముగా మారింది. ఇవాళ గండిని పూడ్చేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఎగువ నుంచి ప్రవాహం పూర్తిగా నిలిచిపోకపోవడంతో.. గండి పూడ్చటం వీలుకాలేదు. వరద ప్రవాహంతో నీటమునిగిన గ్రామాల వాసులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

నాగార్జునసాగర్ ఎడమ కాల్వకు పడిన గండి పూడ్చేందుకు మరికొంత సమయం పట్టే అవకాశముంది. ఎగువ నుంచి వస్తున్న ప్రవాహం పూర్తిగా తగ్గకపోవడంతో.. ఇవాళ గండి పూడ్చటం కష్టమని అధికారులు తెలిపారు. వరద ఉధృతిని దృష్టిలో ఉంచుకొని నర్సింహుల గూడెం, నిడమనూరులోని లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించామని చెప్పారు.

ఇప్పటికే వరదనీటితో నిడమనూరు మండల కేంద్రంలోని గిరిజన బాలికల గురుకుల పాఠశాల వరద నీటితో నిండిపోయింది. రాత్రే అందులో ఉన్న 87 మంది విద్యార్థులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అర్ధరాత్రి వరకు ప్రవాహం స్థానికంగా ఉన్న పలు దుకాణాల్లోకి చేరింది. ఉదయానికి కాస్త వరద తగ్గుముఖం పట్టిన తరువాత గండి పడిన ప్రాంతాన్ని, సాగర్ జలాశయం సీఈ శ్రీకాంత్​రావు, ఎస్ఈ ధర్మ, జిల్లా సబ్ కలెక్టర్ రాహుల్ శర్మ, ఆర్డీఓ రోహిత్ సింగ్​, జిల్లా వ్యవసాయ అధికారి సుచరిత పరిశీలించారు.

3వేల ఎకరాల్లో పంటనష్టం: యుద్ధ ప్రాతిపదికన గండి పూడ్చి మళ్లీ సాగు నీరు విడుదల చేస్తామని అధికారులు తెలిపారు. వ్యవసాయ శాఖ ప్రాధమిక అంచనా ప్రకారం దాదాపు 3వేల ఎకరాల్లో వరి పంట నీట మునిగినట్లు అంచనా వేస్తున్నారు. లోతట్టు ప్రాంతాల్లోని సహాయక చర్యలను నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోములభగత్ పరిశీలించారు. వరదల్లో కట్టు బట్టలు తప్ప ఏమీ మిగలలేదని బాధితులు ఆయనకు తెలిపారు. ప్రభుత్వం తరపున ఆదుకునేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నామని ఎమ్మెల్యే వారికి భరోసా ఇచ్చారు. నీటి విడుదలకు ముందే కాల్వ గట్లను పరిశీలించి ఉంటే ఇంత నష్టం వాటిల్లేది కాదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సాగర్ గండి పూడ్చేందుకు అడ్డంకిగా మారిన నీటి ప్రవాహం

అసలేం జరిగిదంటే:నాగార్జునసాగర్ ఎడమ కాల్వకు ముప్పారం సమీపంలో నిన్న గండి పడింది. సాగర్ కాల్వకు నీటి విడుదల గత నెల జులై 28 నుంచి కొనసాగుతుంది. అయితే కాల్వలో నీటి ప్రవాహం అధికంగా ఉండడంతో పాటు మట్టికట్ట బలహీనం కావడంతో ఈ గండి పడినట్లు తెలుస్తుంది. ఆ సమయంలో కాల్వలోకి 7వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. అటుగా వచ్చిన రైతులు గండి పడడం చూసి ఇరిగేషన్ అధికారులకు సమాచారం ఇచ్చారు. వారు జలాశయ అధికారులకు సమాచారం ఇవ్వడంతో నీటి విడుదల ఆపేశారు.

ఇవీ చదవండి:సాగర్​ ఎడమ కాల్వకు గండి.. విజువల్స్ చూస్తే ఆశ్చర్యపోతారు..

భారత్​-చైనా సైన్యాల సంయుక్త ప్రకటన.. అక్కడి నుంచి బలగాల ఉపసంహరణ..

Last Updated :Sep 8, 2022, 7:57 PM IST

ABOUT THE AUTHOR

...view details