తెలంగాణ

telangana

సాగర్​ పోలింగ్​కు ఏర్పాట్లు.. పక్కాగా కొవిడ్​ నిబంధనల అమలు

By

Published : Apr 16, 2021, 1:28 PM IST

నాగార్జునసాగర్​ ఉపఎన్నిక పోలింగ్​కు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఎన్నికల సామగ్రి కేంద్రం నుంచి ఈ సాయంత్రం.. కేటాయించిన పోలింగ్​ కేంద్రాలకు సిబ్బంది చేరుకోనున్నారు. శనివారం ఉదయం 7 నుంచి సాయంత్రం 7 గంటల వరకు పోలింగ్​ జరగనుంది. ఈ ఉపఎన్నికలో 41 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు.

nagarjuna sagar by poll news
నాగార్జునసాగర్​ ఉపఎన్నిక పోలింగ్​కు ఏర్పాట్లు

నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ ఉపఎన్నిక పోలింగ్​కు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా మొత్తం 346 పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేశారు.

2,400 మంది పోలీసులు

2,20,300 మంది ఓటర్లున్న నాగార్జునసాగర్ నియోజకవర్గంలో... 1,09,228 లక్ష 9 వేల 228 మంది పురుషులు, 1,11,072 మంది మహిళలున్నారు. 41 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. 3,145 మందిని నియమించారు. ఇందులో సూక్ష్మ పరిశీలకులు 130, వెబ్​కాస్టింగ్ 210, బీఎల్​వోలు 293, ఆరోగ్య సిబ్బంది 710 మంది ఉన్నారు. కొవిడ్ నిబంధనల మేరకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తంగా 2,400 మంది పోలీసులను మోహరిస్తున్నారు.

ఓటు వేసేందుకు ప్రత్యేక గ్లవ్స్​..

పోలింగ్ కేంద్రానికి 200 మీటర్ల వరకు.. ఏ పార్టీ టెంట్లు వేయకుండా ఈసీ జాగ్రత్తలు తీసుకుంటోంది. నిబంధనలు అతిక్రమించి ఓటరు స్లిప్పులు పంచినా చర్యలు తీసుకుంటారు. ఒకవేళ ఎవరికైనా ఓటరు పత్రాలు అందకపోతే.. ఎన్నికల సిబ్బందిని అడిగి తీసుకోవాలి. కొవిడ్ విజృంభిస్తున్న దృష్ట్యా.. శనివారం ఉదయం 7 నుంచి సాయంత్రం 7 గంటల వరకు పోలింగ్​ నిర్వహించనున్నారు. ఈవీఎంలపై ఓట్లు వేసేటప్పుడు.. ప్రత్యేకమైన గ్లవ్స్ ఇవ్వనున్నారు. పోలింగ్ కేంద్రంలోని సిబ్బంది, ఓటర్లు.. మాస్కులు ధరించడం సహా శానిటైజర్లు అందుబాటులో ఉంచుతున్నారు.

అనుములలో పంపిణీ కేంద్రం..

అనుముల ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రానికి సిబ్బంది చేరుకున్నారు. ఇక్కడ నుంచి 346 కేంద్రాలకు సామగ్రి తరలించేందుకు వాహనాలను సిద్ధం చేశారు. పంపిణీ కేంద్రంలో అన్ని చోట్ల కరోనా నిబంధనలను అమలుచేస్తున్నారు. ఇవాళ సాయంత్రం అన్ని పోలింగ్​ కేంద్రాలకు సిబ్బంది చేరుకోనున్నారు.

నోముల నర్సింహయ్య మృతితో..

నాగార్జునసాగర్​లో తెరాస ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య అకాల మరణంతో.. ఇక్కడ ఉపఎన్నికల అనివార్యమైంది. నోముల కుమారుడికే తెరాస అధిష్ఠానం టికెట్​ కేటాయించింది. కాంగ్రెస్​ తరఫున సీనియర్​ నేత జానారెడ్డి బరిలో నిలుచున్నారు. భాజపా అభ్యర్థిగా రవికుమార్​ పోటీచేస్తున్నారు. మొత్తం 41 మంది బరిలో నిలిచారు. శనివారం పోలింగ్​ జరగనుండగా.. మే 2న ఫలితాలు వెలువడనున్నాయి.

ఇవీచూడండి:సాగర్ ఉప ఎన్నికకు అన్ని ఏర్పాట్లు చేశాం: శశాంక్‌ గోయల్‌

ABOUT THE AUTHOR

...view details