తెలంగాణ

telangana

Illegal soil transport: రెచ్చిపోతున్న అక్రమ మట్టి మాఫియా... హెచ్చరిస్తున్న అధికారులు

By

Published : Nov 11, 2021, 10:47 AM IST

అసైన్డ్ భూములు, ప్రభుత్వ భూముల నుంచి అక్రమంగా తరలించవద్దని అధికారులు హెచ్చరించినా మట్టి రవాణా దందా ఆగడం లేదు. మైనింగ్, రెవెన్యూ సహా ప్రభుత్వశాఖల అనుమతులు లేకుండానే గుట్టు చప్పుడు కాకుండా మట్టి తరలించి అక్రమార్కులు కోట్లు గడిస్తున్నారు. నిబంధనలు పాటించకుండా ప్రభుత్వాదాయానికి గండికొడుతున్నారు. నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండలంలో వెంచర్లను చదును చేసేందుకు అక్రమ మట్టి రవాణా దందా జోరుగా సాగుతోంది.

Illegal soil transport
Illegal soil transport

నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండలంలో జోరుగా సాగుతున్న అక్రమ మట్టి రవాణా దందా

నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి, వెల్దండ మండలాలు కేంద్రాలుగా మట్టి అక్రమ రవాణా దందా యధేచ్ఛగా సాగుతోంది. హైదరాబాద్- శ్రీశైలం జాతీయ రహదారిని ఆనుకుని స్థిరాస్తి వ్యాపారం జోరుందుకుంది. వందల ఎకరాల్లో వ్యవసాయ భూముల్ని కొనుగోలు చేసి ఇండ్లస్థలాలుగా మార్చి అమ్మేందుకు కుప్పులుగా వెంచర్లు వెలిశాయి. వాటిని చదును చేసేందుకు మట్టి అవసరం. దాన్ని ఆసరాగా చేసుకుని మట్టి మాఫియా రెచ్చిపోతోంది. ఎలాంటి అనుమతులు లేకుండానే ఇష్టానుసారం మట్టి తరలిస్తోంది.

Illegal soil transport

అసైన్డ్ భూములు, ప్రభుత్వ భూములు, పట్టాభూముల్ని వెతికి అక్కన్నుంచి మట్టి తరలించి అక్రమార్కులు కోట్లు దండుకుంటున్నారు. వెల్దండ మండలం రామాయపల్లి, నారాయణపూర్ తండా, పెద్దాపూర్, చెర్కూరు, వెల్దండ, కొట్ర, కల్వకుర్తి శివారు కొట్రతండా, జేపీనగర్ తదితర ప్రాంతాల్లో మట్టి దందా జోరందుకుంది. నారాయణపూర్ తండాలోని 303 సర్వే నెంబర్లో 18ఎకరాల ప్రభుత్వ భూమి ఉండగా అక్కన్నుంచి సైతం మట్టిని తలించారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ భూముల కబ్జా, పేదలకిచ్చిన భూములపై క్రయవిక్రయాలు ఇలా చట్ట విరుద్ధ కార్యకలాపాలకు స్థిరాస్తి వ్యాపారం కేంద్రంగా మారుతుండటంతో అధికారులు తగుచర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

కలెక్టర్​కు సిఫారసు చేస్తామన్న కల్వకుర్తి ఆర్డీవో..

అసైన్డ్ భూముల్లో మట్టి అక్రమ రవాణా గతంలోనే బయటపడగా.. సంబంధిత రైతులకు నోటీసులిచ్చి అధికారులు హెచ్చరించారు. అయినా దందా ఆగలేదు. పట్టాభూముల నుంచి మట్టి తరలించాలన్నా మైనింగ్ శాఖ అనుమతి తప్పనిసరి. ఎలాంటి అనుమతులు లేకుండానే వ్యవహారం సాగడంతో ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతోంది. చర్యలు తీసుకోవాల్సిన అధికారులు సైతం చూసిచూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వం పేదలకిచ్చే భూముల్లో సాగు చేసుకుని ఉపాధి పొందాలే తప్ప... అక్రమంగా మట్టి తరలిస్తే చర్యలు తప్పవని కల్వకుర్తి ఆర్డీవో రాజేశ్​ కుమార్ హెచ్చరించారు. క్షేత్రస్థాయిలో మట్టి తరలింపు నిజమైతే సంబంధిత రైతుల నుంచి పీఓటీ చట్టం కింద భూముల్ని తిరిగి తీసుకునేలా కలెక్టర్​కు సిఫారసు చేస్తామని తెలిపారు. మట్టి మాఫియాపైనా కఠిన చర్యలకు దిగుతామని తెలిపారు.

మా గ్రామంలో గైరన్​గుట్టలను అక్రమంగా తవ్వి వెంచర్లకు తరలిస్తున్నారు. ఎన్ని సార్లు పైఅధికారులకు చెప్పినా వాళ్లు పట్టించుకోవడం లేదు. ఎమ్మార్వోకు ఇప్పటివరకు నాలుగుసార్లు ఫిర్యాదు చేశాము. ఆర్డీవోకు సైతం మట్టి అక్రమరవాణా గురించి చెప్పాము -స్థానికుడు

రాత్రిపూట అక్రమంగా మట్టి తరలిస్తున్నట్లు మాకు ఫిర్యాదులు వచ్చాయి. ఈ విషయాన్ని ఎట్టిపరిస్థితుల్లో ఉపేక్షించేది లేదు. ఇప్పటికే అప్రమంగా మట్టి తరలించిన వారికి ఎమ్మార్వో నోటీసులు జారీ చేశారు. వారి భూములను కూడా తీసుకోవడంలో మేము వెనుకాడము. సంబంధిత రైతుల నుంచి పీఓటీ చట్టం కింద భూముల్ని తిరిగి తీసుకునేలా కలెక్టర్​కు సిఫారసు చేస్తాము. మట్టి మాఫియాపైనా కఠిన చర్యలు చేపడుతాము.-రాజేశ్​ కుమార్, కల్వకుర్తి ఆర్డీవో

ఇదీ చదవండి:Grain Purchase Issues: వణుకుతున్న రైతులు.. నిద్దరోతున్న అధికారులు

ABOUT THE AUTHOR

...view details