తెలంగాణ

telangana

అమ్రాబాద్‌ అభయారణ్యంలోని జంతువులపై వేటగాళ్ల పంజా

By

Published : Jun 23, 2021, 4:50 AM IST

ప్రకృతి ఒడిలో స్వేచ్ఛగా విహరించే వన్యప్రాణులు... కొందరికి విందు భోజనంగా మారుతున్నాయి. చట్టాలు ఎన్ని తెచ్చినా... నిఘా ఎంత పెంచినా.... కీకారణ్యంలో మూగజీవాల మృత్యుఘోష మాత్రం ఆగటంలేదు. ఒకవైపు తగ్గిపోతున్న అడవుల విస్తీర్ణం.... మరోవైపు వేటగాళ్ల దెబ్బతో... అటవీ జంతువుల మనుగడే ప్రశ్నార్థకంగా మారే పరిస్థితులు నెలకొంటున్నాయి. నాగర్‌కర్నూల్‌ జిల్లా అమ్రాబాద్‌ పులుల అభయారణ్యంలో ఈ తరహా ఘటనలు ఇటీవల పెరిగిపోతుండటం ఆందోళన కలిగిస్తున్నాయి.

animal
అమ్రాబాద్‌

అడవి జంతువులను వేటాడమే వృత్తిగా భావిస్తారు. తుపాకులు, ఉచ్చులతో వన్యప్రాణులను వేటాడుతారు. నిఘా, నిరంతర పర్యవేక్షణ ఉన్నా.... అధికారుల కళ్లు గప్పి అడవుల్లోకి ప్రవేశిస్తూ... మూగజీవాలను వెంటాడి మట్టుబెడుతున్నారు. నాగర్‌కర్నూల్ జిల్లా ఆమ్రాబాద్ పులల అభయారణ్యంలో వణ్యప్రాణులను వేటాడుతున్న ఘటనలు తరచూ వెలుగులోకి వస్తున్నాయి. 3 నెలల వ్యవధిలోనే 5 కేసులు నమోదు కాగా.... నిందితులను అటవీశాఖ అధికారులు జైలుకు పంపారు. పదర మండలం మద్దిమడుగు సమీపంలో 2 చుక్కల దుప్పులను చంపిన ముగ్గురు వేటగాళ్లను అటవీశాఖ అధికారులు అరెస్టు చేశారు. మే 15న ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కొందరు మద్దిమడుగు సమీపంలో 2జింకలను వేటాడి... అధికారులకు పట్టుబడ్డారు. చౌటపల్లి గ్రామ సమీపంలోని మశమ్మ మడుగు అటవీ ప్రాంతంలోకి ప్రవేశించిన వేటగాళ్లు... చుక్కలదుప్పి వంటి జంతువులను ముక్కలు ముక్కలుగా నరికి తీసుకెళ్లారు. ఈ దృశ్యాలు అక్కడే ఉన్న రహస్య కెమెరాల్లో రికార్డయ్యాయి. వీటి ఆధారంగా మే 29న ముగ్గురు, జూన్ 3న ఏడుగురిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు పంపారు. అమ్రాబాద్ మండలంలో ముగ్గురు నిందితులు ఉడుము మాంసాన్ని ఆటోలో తరలిస్తుండగా పట్టుకున్నారు.

పెరిగిన నిఘా

అమ్రాబాద్‌ పరిధిలో 2019-20లో కేవలం ఒక కేసు నమోదు కాగా..... గత ఏడాది ఐదు, గడిచిన మూడు నెలల్లోనే మరో 5 కేసులు నమోదవడం పరిస్థితికి అద్దంపడుతోంది. అటవీ ప్రాంతంలో నిఘా, గస్తీ పెంచిన కారణంగానే వేటగాళ్లను గుర్తించగలుగుతున్నామని అటవీశాఖ అధికారులు చెబుతున్నారు. అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌లో 800లకు పైగా కెమెరా ట్రాప్‌లు ఉన్నాయి. ఈ కెమెరాలే నిందితుల్ని పట్టించాయి. వారానికొకసారి అధికారులు ఆ దృశ్యాలను సమీక్షిస్తూ ఉంటారు. ఇవి కాకుండా 20 బేస్ క్యాంపుల్లో... నిఘా ప్రాంతాలను పెంచారు. వీటితోపాటు కొత్తగా 100 మంది బీట్‌ ఆఫీసర్లు విధుల్లో చేరటంతో.... మొత్తం 300 మందికిపైగా సిబ్బంది పనిచేస్తున్నారు. అత్యాధునిక సాంకేతికతతో సెల్‌ఫోన్లు సిబ్బందికి అందించారు. కృష్ణానదిలో మరబోట్ల ద్వారా అటవీ ప్రాంతాల్లోకి ప్రవేశించే వాళ్లపై అధికారులు ప్రధానంగా దృష్టి కేంద్రీకరించారు. శ్రీశైలం-హైదరాబాద్ రహదారిపై పగలు,రాత్రి గస్తీ పెంచారు. కొత్తగా సర్వేలెన్స్ టవర్లు సైతం ఏర్పాటు చేయనున్నందున.... వేటగాళ్లు తమ నుంచి తప్పించుకోలేరని అధికారులు హెచ్చరిస్తున్నారు.

చెంచులకు అవగాహన

అటవీ ఉత్పత్తుల కోసమే అడవిలోకి వెళ్లేవారు అధికంగా ఉన్నందున... చెంచు పెంటలు, మారుమూల ప్రాంతాల్లోని వారికి అవగాహన కల్పిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. కొందరు వేటగాళ్లు వన్యప్రాణుల మాంసమని చెప్పి... దూడ మాంసాన్ని విక్రయిస్తున్న ఘటనలు సైతం వెలుగులోకి వస్తున్నట్లు... అలాంటి వారిపట్ల అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.

ఇదీ చదవండి:KARANAM MALLESWARI: దిల్లీ క్రీడా విశ్వవిద్యాలయం వీసీగా కరణం మల్లీశ్వరి

ABOUT THE AUTHOR

...view details