తెలంగాణ

telangana

Laknavaram: లక్నవరం ఓ స్వర్గధామం... అక్కడ ప్రతిదీ ఓ దృశ్య కావ్యం

By

Published : Aug 2, 2021, 2:43 PM IST

Laknavaram
లక్నవరం

పర్యాటకుల స్వర్గధామంగా పేరొందిన ములుగు జిల్లా లక్నవరం సరస్సుకు పర్యాటకులు పోటెత్తుతున్నారు. వారాంతాలు, సెలువుదినాలే కాదు.... మూమూలు రోజుల్లోనూ సందర్శకులు తరలివస్తున్నారు. సరస్సు అందాలను తనివితీరా వీక్షిస్తున్నారు. బోటింగ్ చేసి..ఆహ్లాదంగా గడుపుతున్నారు.

ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం లక్నవరం సరస్సు అందాలను మాటల్లో వర్ణించతరం కాదు. దట్టమైన చెట్లను దాటుకుంటూ సాగే ప్రయాణమే ఆహ్లాదకరంగా ఉంటుంది. పచ్చని చెట్లు.. చుట్టూ గుట్టలు.. మధ్యలో వంపులు తిరిగిన సరస్సు.. కనువిందు చేస్తున్నాయి. వేలాడే వంతెన, బోటింగ్ సౌకర్యాలు పర్యాటకులను కట్టిపడేస్తున్నాయి. సందర్శకులకు లక్నవరం స్వర్గధామంలా మారింది. కొత్తగా ఏర్పాటు చేసిన జిప్ సైక్లింగ్ పర్యాటకులను విపరీతంగా ఆకర్షిస్తోంది.

లక్నవరంలో పర్యాటక సందడి

కరోనాతో వెలవెల

కరోనా వల్ల ఇన్నాళ్లూ వెలవెలబోయిన పర్యాటకరంగం మళ్లీ కొత్త కళ సంతరించుకుంది. ఏడాది కాలంగా లక్నవరం సందర్శకులు లేకుండా బోసిపోయింది. మధ్యలో రెండు మూడు నెలలు అనుమతించినా.. పర్యాటకులు అంతంతమాత్రమే వచ్చారు. కరోనా రెండోదశ తర్వాత లక్నవరంలో మళ్లీ సందడి నెలకొంది. వర్షాలు జోరుగా పడటంతో సరస్సు నిండు కుండలా మారింది. పరిసర ప్రాంతాలే కాకుండా హైదరాబాద్, విజయవాడ నుంచి సైతం ఎక్కువమంది వచ్చి సరస్సు అందాలను వీక్షిస్తున్నారు. కుటుంబసమేతంగా వచ్చిన సందర్శకులు బోటింగ్ చేస్తూ సరదాగా గడుపుతున్నారు. ఉత్సాహంగా జిప్ సైక్లింగ్ చేస్తున్నారు. పిల్లలు సరదాగా ఆడుకునేందుకు హరిత హోటల్‌లో ఎలక్ట్రిక్ కార్లు ఏర్పాటు చేశారు.

కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి చూడటానికి ఇది చాలా మంచి ప్రదేశం. ఇక్కడ సదుపాయాలు, చూడదగిన ప్రదేశాలు చాలా బాగున్నాయి. మొదటి సారి ఇక్కడికి వచ్చాం. ఫొటోలు, బోటింగ్​, కొత్తగా ఏర్పాటు చేసిన జిప్​ సైక్లింగ్​ మంచి అనుభూతినిచ్చాయి. కరోనా తర్వాత చాలా రోజులకు ఇలాంటి ప్రదేశాలను చూడటం ఆనందంగా ఉంది. ఎప్పుడూ ఆఫీసూ, ఇల్లే కాకుండా అప్పుడప్పుడూ ఇలా బయటకు వస్తే మనసుకు ఆహ్లాదంగా ఉంటుంది.

కరోనా లాక్​డౌన్​ తెచ్చిన మానసిక ఒత్తిడితో ఎంతో సతమతమయ్యాం. మహమ్మారి తగ్గుముఖం పట్టిన తర్వాత ఇలా బయటకు రావడం చాలా ఉత్తేజాన్ని ఇచ్చింది. స్నేహితులతో కలిసి వచ్చి ప్రకృతి అందాలతో మమేకమవడం అనిర్వచనీయం. పిల్లలు ఆడుకునేందుకు సదుపాయాలు, ఆహార వసతి అన్నీ చాలా బాగున్నాయి. మళ్లీ మహమ్మారి విజృంభించకుండా ప్రభుత్వం, అధికారులు ఇక్కడ కొవిడ్​ నిబంధనలు పాటిస్తే బాగుంటుంది. ఇక్కడకు రావడం. -పర్యాటకులు

రామప్ప టు లక్నవరం..

తాజాగా రామప్పకు యునెస్కో గుర్తింపు దక్కడం కూడా.. పర్యాటకుల రద్దీకి కారణమైంది. ప్రపంచ వారసత్వ కట్టడం రామప్ప శిల్పసౌందర్యాన్ని వీక్షిస్తున్న పర్యాటకులు... అటు నుంచి లక్నవరానికి వచ్చి ప్రకృతి అందాలను తిలకిస్తున్నారు. లక్నవరంలో కొవిడ్‌ నిబంధనలు కచ్చితంగా అమలు చేస్తే.. ఇంకా బాగుంటుందని పర్యాటకులు అంటున్నారు.

ఇదీ చదవండి:Supreme Court : 'కృష్ణా జలాల వివాదాన్ని మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకోవాలి'

ABOUT THE AUTHOR

...view details