తెలంగాణ

telangana

Medaram maha jathara 2022: మహా జాతరలో కోలాహలంగా తొలి ఘట్టం.. నేడు సమ్మక్క ఆగమనం

By

Published : Feb 17, 2022, 5:11 AM IST

Updated : Feb 17, 2022, 6:41 AM IST

మేడారం జాతరలో తొలి ఘట్టం అంగరంగ వైభవంగా ఆరంభమైంది. శివసత్తుల పూనకాలు, ఆదివాసీల ఆచారాలతో నిండు పున్నమి వేళ బుధవారం రాత్రి 10.47 గంటలకు సారలమ్మ తల్లి గద్దెపై కొలువైన ఘట్టం కనుల పండువగా సాగింది. జంపన్నవాగు భక్త జనసంద్రమైంది.

Medaram maha jathara 2022: మహా జాతరలో కోలాహలంగా తొలి ఘట్టం.. నేడు సమ్మక్క ఆగమనం
Medaram maha jathara 2022: మహా జాతరలో కోలాహలంగా తొలి ఘట్టం.. నేడు సమ్మక్క ఆగమనం

Medaram maha jathara 2022: మహా జాతరలో కోలాహలంగా తొలి ఘట్టం.. నేడు సమ్మక్క ఆగమనం

మేడారం జాతరలో తొలి ఘట్టం అంగరంగ వైభవంగా ఆరంభమైంది. ఆదివాసీ పూజారులు సారలమ్మ తండ్రి పగిడిద్దరాజును, భర్త గోవిందరాజులును కూడా వేర్వేరు ప్రాంతాల నుంచి ఊరేగింపుగా తోడ్కొని వచ్చి గద్దెలపై ప్రతిష్ఠించడంతో భక్త కోటి పరవశించింది. సాయంత్రం పూజారులు కాక సారయ్య, కిరణ్‌కుమార్‌, వెంకటేశ్వర్లు, భుజంగరావు, కనకమ్మలు కన్నెపల్లిలోని సారలమ్మ దేవాలయానికి చేరుకొన్నారు. అప్పటికే అక్కడి ఆడపడుచులు ఐదుగురు ఆలయంలో ముగ్గులు వేసి అందంగా తీర్చిదిద్ది పూజకు సిద్ధం చేశారు. పూజారులు సుమారు గంటకుపైగా సారలమ్మను సకల పూజలతో ఆరాధించారు. ఈ ఘట్టం తిలకించేందుకు భారీ సంఖ్యలో భక్తులు కన్నెపల్లికి తరలివచ్చారు.

*ములుగు శాసనసభ్యురాలు సీతక్క, కలెక్టర్‌ కృష్ణ ఆదిత్య, ఏఎస్పీ సాయి చైతన్య, ఇతర ఉన్నతాధికారులు నృత్యం చేస్తూ అమ్మవారి ఊరేగింపు మొదలుపెట్టారు. సుమారు వంద మంది పోలీసులు భద్రత కల్పించారు. రాత్రి 7.08 గంటలకు పూజారులు సారలమ్మను కన్నెపల్లి ఆలయం నుంచి మేడారానికి తీసుకొచ్చే ప్రక్రియ ప్రారంభమైంది. కన్నెపల్లి నుంచి మేడారం వరకు సమారు మూడున్నర కిలోమీటర్ల మేర అడుగడుగునా అమ్మకు భక్తులు మోకరిల్లారు. 8.20 గంటలకు జంపన్నవాగు గుండా తోడ్కొని వెళ్లి పూజారులు మేడారం గద్దెపై సారలమ్మను ప్రతిష్ఠించారు. మహబూబాబాద్‌ జిల్లా గంగారం మండలం పూనుగొండ్ల నుంచి మంగళవారం బయలుదేరిన సారలమ్మ తండ్రి పగిడిద్దరాజు, ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం కొండాయి నుంచి వచ్చిన సారలమ్మ భర్త గోవిందరాజు సైతం అదే సమయంలో గద్దెపై కొలువుదీరారు. ఈ ముగ్గురూ గద్దెలపై అధిష్ఠించడంతో మహాజాతరకు అంకురార్పణ జరిగింది. జంపన్నవాగు, మేడారం పరిసరాలు జనసంద్రంగా మారాయి. వాగుకు ఇరువైపులా తొలి రోజు లక్షలాది మంది భక్తులు పుణ్యస్నానాలు చేశారు. మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, సత్యవతిరాథోడ్‌, మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, ములుగు ఎమ్మెల్యే సీతక్క, ఎమ్మెల్సీ వాణిదేవి మొక్కులు సమర్పించుకున్నారు.

రెండు దశాబ్దాల తర్వాత..:గత రెండు దశాబ్దాలలో మాఘశుద్ధ పౌర్ణమి రోజు మహాజాతర ప్రారంభమవడం ఇదే తొలిసారి. ఆ రోజున సమ్మక్క తల్లి కుంకుమ భరిణె రూపంలో దేవతగా అవతరించింది. అందుకే ఆదివాసీలు ఆ దినాన్ని అత్యంత పవిత్రంగా భావిస్తారు. ‘‘అదే రోజే జాతర ప్రారంభించడం చాలా సందర్భాల్లో వీలుకాదు. ప్రతిసారి బుధవారం జాతర ప్రారంభించడం ఆనవాయితీ. మాఘశుద్ధ పౌర్ణమి, బుధవారం ఒకే రోజు రావడం చాలా అరుదు. క్రితంసారి జాతర ముగిసిన రోజు వచ్చింది’’ అని సమ్మక్క పూజారి కొక్కెర రమేశ్‌ తెలిపారు.

ఆధ్యాత్మికం, ఆనందం: కవిత

ఈనాడు, హైదరాబాద్‌: వన దేవతలు సమ్మక్క-సారలమ్మల సమక్షంలో అడవి తల్లి ఒడిలో జరిగే ఆధ్యాత్మికం, ఆనందం, ఆహ్లాదం కలగలిసిన మేడారం అద్భుతమైన జాతర అని తెరాస ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. అమ్మవార్ల దర్శనం కోసం వచ్చే లక్షల మంది భక్తులకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని సౌకర్యాలు కల్పించిందని ఆమె బుధవారం ట్విటర్‌లో తెలిపారు.

ఇదీ చూడండి: Medaram Jatara 2022: ఆ తల్లీకూతుళ్ల పోరాటం.. చిరస్మరణీయం..

Last Updated : Feb 17, 2022, 6:41 AM IST

ABOUT THE AUTHOR

...view details