తెలంగాణ

telangana

నిధి నీడన.. మహిళల ఉపాధికి సాంత్వన

By

Published : Sep 30, 2020, 11:02 AM IST

ఆర్థిక పరిస్థితులు మెరుగ్గా ఉండాలి. అప్పుడే సమస్యలు అధిగమించేందుకు అవకాశం ఉంటుంది. అలాంటి కుటుంబాలకు సామాజికంగానూ గుర్తింపు ఉంటుంది. ముఖ్యంగా కుటుంబంలోని మహిళలకు ఆర్థిక అక్షరాస్యత అత్యావశ్యకం. మహిళా సంఘాల ఏర్పాటు ఉద్దేశం కూడా ఇదే. మొదట సంఘంగా ఏర్పడగానే ఆరు నెలల వరకు వారి దృష్టంతా పొదుపుపైనే ఉంటుంది. ఆ తర్వాత బ్యాంకు రుణాలు ప్రారంభమవుతాయి. బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను వాయిదా ప్రకారం చెల్లింపుల్లో ముందుంటున్నాయి. ఇంతవరకు బాగానే ఉన్నా స్వయం ఉపాధి విషయంలో వెనుకబడుతుండటంతో పేదరికంలోనే మగ్గుతున్నారు. ఈ పరిస్థితిలో మార్పు తీసుకురావాలన్న లక్ష్యంతో స్త్రీనిధి ద్వారా చేయూత ఇవ్వాలని నిర్ణయించింది. తాజాగా ఉమ్మడి మెదక్‌ జిల్లాకు లక్ష్యాలు ఖరారు చేసింది.

interest less loans to women associations in Srindhi
interest less loans to women associations in Srindhi

ఉమ్మడి మెదక్‌ జిల్లా పరిధిలోని సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్‌ జిల్లాల్లో కలిపి మొత్తం గ్రామైక్య సంఘాలు 2,329 ఉన్నాయి. ఆయా గ్రామైక్య సంఘాల పరిధిలో 54,068 మహిళా స్వయం సహాయక సంఘాలు ఉండగా 5,79,469 మంది మహిళలు సభ్యులుగా ఉన్నారు. మహిళా సంఘాల్లోని సభ్యులు పాడి పరిశ్రమ, నాటుకోళ్ల పెంపకం, ఈ-ఆటోలతో స్వయం ఉపాధికి బాటలు వేయనున్నారు. ఇందుకోసం అవసరమైన పెట్టుబడికి స్త్రీనిధి ద్వారా రాయితీలేని రుణం అందజేస్తారు. స్త్రీనిధి రుణాలపై వసూలు చేస్తున్న వడ్డీని ప్రభుత్వం ఇటీవల తగ్గింపు ఇవ్వడంతో 11.5శాతం వడ్డీకే రుణాలు అందనున్నాయి.

నాటుకోళ్ల పెంపకానికి..

నాటుకోళ్ల పెంపకానికి కూడా రుణాలు ఇవ్వాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా ప్రతి మండలానికి 10 యూనిట్లు అందజేస్తారు. ఒక యూనిట్‌లో 50-100 కోళ్లు ఉంటాయి. ప్రస్తుతం నాటుకోళ్లకు ఉన్న డిమాండ్‌ అంతా ఇంతా కాదు. నాటుకోళ్లు ఎక్కడ ఉన్నా ఎంత ధర అయినా కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపేవారు ఎక్కువగా ఉండటమే దీనికి కారణం. దీన్ని దృష్టిలో ఉంచుకొని మహిళా సంఘాల సభ్యులు నాటుకోళ్ల యూనిట్లు ఏర్పాటు చేసేందుకు రుణ సదుపాయాన్ని కల్పిస్తున్నారు.

పాడి పరిశ్రమకు రూ.45 కోట్లు

ఉమ్మడి జిల్లా పరిధిలోని సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్‌ జిల్లాల్లో ఒక్కో జిల్లాలో 2వేల చొప్పున పాడిగేదెల యూనిట్లను ఇవ్వాలని లక్ష్యంగా నిర్దేశించారు. ఇందుకోసం మూడు జిల్లాలకు కలిపి రూ.45కోట్లు రుణాలుగా అందించనున్నారు. పాడిపశువుల పెంపకంతో మహిళా సంఘాల సభ్యులకు నిత్యం ఆదాయం సమకూరనుంది. రుణ వాయిదాలు చెల్లించడం సులభమవడంతోపాటు పాల ఉత్పత్తులతో ఆర్థిక ఉన్నతికి బాటలు వేసుకునేందుకు వీలుంటుంది.

పర్యావరణ హితం.. ఉపాధికి ఊతం

స్త్రీనిధి ద్వారా మహిళా సంఘాల సభ్యులు ఈ-ఆటోలు, సరకు రవాణా వాహనాలు కొనుగోలు చేసేందుకు రుణాలు మంజూరు చేస్తారు. ఉమ్మడి జిల్లాకు 45 ఈ-ఆటోలు, 45 ఈ-సరకు రవాణా వాహనాలను కేటాయించారు. ఇందుకోసం రూ.90లక్షలు రుణాలుగా అందించనున్నారు. కాలుష్య రహిత వాహనాలనే కొనుగోలు చేయాలన్న నిబంధన విధించారు. దీనివల్ల మహిళలకు ఉపాధితోపాటు పర్యావరణహిత ప్రజా, సరకు రవాణాకు బాటలు పడనున్నాయి.

సద్వినియోగం చేసుకోవాలి

- కిషోర్‌, స్త్రీనిధి ప్రాంతీయ మేనేజర్‌

స్త్రీనిధి ద్వారా కల్పిస్తున్న స్వయం ఉపాధి రుణాలను మహిళా సంఘాల సభ్యులు సద్వినియోగం చేసుకోవాలి. పాడిగేదెలు, నాటుకోళ్ల పెంపకంతో ఆదాయం పెంచుకునేందుకు వీలుంటుంది. ఈ-ఆటో, ఈ-సరకు వాహనాలతోనూ ఆర్థికాభివృద్ధికి బాటలు వేసుకోవాలి. అర్హులకు రుణాలు మంజూరు చేస్తాం.

ఇదీ చూడండి:'నేతన్నల కష్టాలేంటో సీఎం కేసీఆర్‌కు బాగా తెలుసు'

ABOUT THE AUTHOR

...view details