తెలంగాణ

telangana

రామకృష్ణాపురం కేరాఫ్ కూరగాయలు: టైమ్​పాస్ కోసం చేస్తే ఆరోగ్యం.. ఆదాయం..

By

Published : Feb 7, 2022, 11:45 AM IST

Updated : Feb 7, 2022, 12:12 PM IST

Ramakrishnapur villagers vegetable farming : అది ఒక చిన్న గ్రామం. ఆ గ్రామంలో సుమారు 300కు పైగా కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. ఆ గ్రామంలో ఎక్కడా ఒక గుడిసె కనిపించదు. అన్ని డాబా ఇళ్లే. ఆ ఊరిలో ఏ ఇంటికైనా వెళ్తే... మొదట పచ్చని వాతావరణం ఆహ్వానం పలుకుతుంది. ఇక ఇంట్లోకి వెళ్లాకా.. ఎవరైనా సరే ఆశ్చర్యానికి గురి కావాల్సిందే. ఎందుకంటే ఇంటి వెనకాల కొద్దిపాటి ప్రదేశంలోనూ కూరగాయలు, ఆకుకూరలు, పూలు, పండ్లు పండిస్తుంటారు. అలా అని వారెవరూ రైతులు కాదు. అందులో కొందరు సింగరేణి ఉద్యోగులు ఉండగా... మరికొందరు విశ్రాంతి కార్మికులు, ఉద్యోగులు, చిరు వ్యాపారులు. అయితే ఆ గ్రామం ఎక్కడో తెలుసుకుందామా.

Ramakrishnapur villagers vegetable farming, Organic Farming
ఆర్గానిక్ కూరగాలు ఆరోగ్యం.. ఆదాయం

ఆర్గానిక్ పద్ధతిలో కూరగాయల సాగు

Ramakrishnapur villagers vegetable farming : మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణ పరిధిలో ఊరు రామకృష్ణాపురం. ఆ గ్రామంలో 300పైగా ఇళ్లు ఉన్నాయి. అందులో దాదాపు 1,250 మంది జనాభా ఉన్నారు. ఆ గ్రామంలో ఉన్న కుటుంబాలకు ఆర్థికంగా ఎలాంటి ఇబ్బంది లేదు. అయినా ఊర్లో మహిళలందరూ ఖాళీగా ఉండరు. సుమారు 70 నుంచి 80 శాతం మంది కూరగాయలు సాగు చేస్తున్నారు.

కూరగాయలు సాగు చేస్తున్న పెద్దాయన

తక్కువ స్థలంలో ఎక్కువ లాభాలు...

Organic Farming : ఆ గ్రామంలో ప్రతి ఇంటి ఆవరణలో ఒకటి నుంచి పది గుంటల వరకు ఖాళీ స్థలం ఉంటుంది. ఆ కొద్ది స్థలంలోనే వారు అనేక రకాల పంటలను పండిస్తున్నారు. అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇంటి ఆవరణలో పాటు పొలాల్లోనూ అనేక రకాల కూరగాయలు, ఆకుకూరలను సాగు చేస్తున్నారు. ఇంటి పెరడులో ఎక్కువగా తోట, పాల, చుక్క కూరలను పండిస్తున్నారు. వాటితో పాటు ఉల్లి, కొత్తిమీర, క్యాబేజీ, మిర్చి, టమాటా, కంది, బెండకాయ, సొరకాయ, బీరకాయ, వంకాయ, చిక్కుడుకాయ, మొక్కజొన్న, గోరుచిక్కుడు వంటి కూరగాయలను సాగు చేస్తున్నారు. వివిధ రకాల కూరగాయలు సాగు చేస్తూనే పూలు, పండ్ల మొక్కలను పెంచుతున్నారు. వారాంతపు సంతలో అమ్ముతూ.. లాభాలు ఆర్జిస్తున్నారు. ఇలా వచ్చిన డబ్బులతో చిన్న చిన్న అవసరాలు తీర్చుకుంటున్నారు. కూరగాయలు తొందరగా చేతికి రావడం, వాటికి మార్కెట్‌లో డిమాండ్‌ ఉండడంతో రైతులు కూరగాయలు సాగువైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. ఎక్కువ మొత్తంలో కాకుండా కొద్ది భూమిలో కూరగాయలు సాగుచేయడం వల్ల లాభాలు పొందవచ్చని చెబుతున్నారు.

ఏపుగా పెరిగిన మొక్కజొన్న

రోజంతా కష్టపడటం వల్ల ఎటువంటి ఆరోగ్య సమస్య తమకు దరి చేరవని గ్రామస్థులు అంటున్నారు. లాభాల కోసమే కాకుండా తృప్తి కోసమే కూరగాయలు సాగు చేస్తున్నాం. ప్రతీ సంవత్సరం తోటకూర, పాలకూర, మిరప, వంకాయ వంటి కూరగాయలను పండిస్తాం. మా ఇంట్లో వాడుకోగా... మిగిలినవి అమ్ముతాం. ఇంట్లో ఖర్చులకు సరిపోను పైసలు వస్తాయి. వేరే కూరగాయలు కొనడం మా వల్ల కాదు. మేం తక్కువకు పండించుకుంటాం. అందుకే ఎక్కువ ధరకు కొనబుద్ధి కాదు. మేం వేరే కూలీలను పెట్టుకోం. ఎవరి పని వాళ్లే చేసుకుంటాం. కూరగాయల రేట్లు అప్పుడప్పుడే ఎక్కువ ఉంటాయి. ఎప్పుడు వీలైతే అప్పుడే... పనిచేస్తాం.

-అమృత, గ్రామస్థురాలు

ముల్లంగి హార్వెస్ట్ చేస్తున్న మహిళ

మా ఇంటి పక్కనే ఆరు గుంటల భూమి ఉంది. అందులో కూరగాయలు, ఆకు కూరలు పండిస్తాం. తోటకూర, పాలకూర, ముల్లంగి, క్యారెట్, టమాటా, మునగ, బెండకాయ పండిస్తాం. ఖాళీగా ఉండలేక పండిస్తాం. ఎంజాయ్ చేస్తూ... పని చేసుకుంటాం. మాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. రోజుకూ రెండు మూడు గంటలు పనిచేస్తాం. అన్ని ఖర్చులు పోగా నెలకు 4 లేదా 5వేల రూపాయలు వస్తాయి.

-శరణ్య, గ్రామస్థురాలు

ఆర్గానిక్ టమాటా
టైమ్ కోసం కూరగాయల సాగు

మా ఊళ్లో దాదాపు వంద కుటుంబాలు కూరగాయలు పండిస్తారు. సింగరేణి జాబ్ రిటైర్ అయ్యాక... టైమ్ పాస్ కోసం పండిస్తారు. మాకు పోగా ఖర్చులకు డబ్బులు వస్తాయి. తోటకూర, పాలకూర, బెండకాయ, టమాటా, బెండకాయ ఇలా చాలా రకాల కూరగాయలు, ఆకుకూరలు పండిస్తారు. ఇక్కడ ఉండే అన్ని మార్కెట్లకు మా ఊరి నుంచి కూరగాయలు పోతాయి. పది గుంటల లోపు భూమి ఉన్న వారు వీటిని సాగు చేస్తారు.

-సంఘపు హనుమంతు, గ్రామస్థుడు

ఆర్గానిక్ కూరగాలు ఆరోగ్యం.. ఆదాయం

ఇదీ చదవండి: Delay in agricultural loans : రుణం అందడం లేదు... "సాగు" సాగడంలేదు..

Last Updated : Feb 7, 2022, 12:12 PM IST

ABOUT THE AUTHOR

...view details