తెలంగాణ

telangana

స్లాట్ బుకింగ్‌లో ఇబ్బందులు... వెబ్‌సైట్ సహకరించక బాధలు..

By

Published : Dec 16, 2020, 3:52 AM IST

వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్‌కు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో నామమాత్రపు స్పందన లభించింది. స్లాట్ బుకింగ్‌ల కోసం వెబ్ సైట్ సహకరించక దరఖాస్తుదారులు ఇబ్బంది పడ్డారు. స్లాట్ బుకింగ్ కోసం అవసరమైన పీటీఐఎన్​​... అస్సెస్‌మెంట్ నెంబర్, నో డ్యూ సర్టిఫికెట్ల కోసం జనం మున్సిపాలిటీ బాట పడుతున్నారు. ప్రస్తుతానికి సేల్, గిఫ్ట్, మార్టిగేజ్‌కు సంబంధించిన స్లాట్‌లు మాత్రమే నమోదు అవుతుండటంతో మిగిలిన లావాదేవీల కోసం జనం నిరీక్షించక తప్పడం లేదు.

non agriculture lands registrations problems in mahaboobnagar
non agriculture lands registrations problems in mahaboobnagar

వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్‌కు ఉమ్మడి పాలమూరు జిల్లావ్యాప్తంగా రెండో రోజూ అంతంతమాత్రంగానే రిజిస్ట్రేషన్లు జరిగాయి. ఉమ్మడి జిల్లాలో 12 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలుండగా... 6 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో 10 దస్త్రాలకు సంబంధించిన లావాదేవీలు మాత్రమే జరిగాయి. గతంలో ఒక్కోరోజు 450 నుంచి 600 వరకూ రిజిస్ట్రేషన్లు జరిగేవి. కొత్త విధానంలోనూ ఒక్కో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో 24 స్లాట్లు బుక్ చేసుకునేందుకు అవకాశం ఉన్నా.. ఆ స్థాయిలో స్లాట్‌లు నమోదు కావడం లేదు. మక్తల్, నారాయణపేట, ఆత్మకూర్, అలంపూర్, కొల్లాపూర్, అచ్చంపేటలో ఎలాంటి రిజిస్ట్రేషన్లు జరగలేదు.

స్లాట్ బుక్ చేసుకునేందుకు దరఖాస్తు చేసుకునేటప్పుడు ప్రాపర్టీ టాక్స్ ఇండెక్స్ నంబర్-పీటీఐఎన్​, టీపిన్​, టాక్స్ అస్సెస్ మెంట్ నెంబర్ నిక్షిప్తం చేయాలని వెబ్‌సైట్ కోరుతోంది. చాలామందికి ఈ నంబర్లపై అవగాహన లేక, ఈ నెంబర్లు అందుబాటులో లేక దరఖాస్తు అక్కడితో ఆగిపోతోంది. కొత్తగా ఏర్పాటైన మున్సిపాలిటీల్లో ఆ వ్యవస్థ ఇంకా పూర్తి స్థాయిలో అమలు కావడం లేదు. స్లాట్ బుక్ చేసుకున్నా రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వెళ్లాక అధికారులు అడిగే దస్త్రాలు లేక లావాదేవీలు పూర్తి చేయలేకపోతున్నారు. సేల్, మార్జిగేజ్, గిఫ్ట్ డీడ్‌లకు సంబంధించిన సేవలు మాత్రమే ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. మార్జిగేజ్ రిలీజ్ డీడ్, సవరణలు, ఒప్పుదల దస్తావేజులు, భాగ పరిష్కార దస్తావేజులు, కిరాయి నామా దస్తావేజులు వంటి లావాదేవీలకు స్లాట్ బుకింగ్‌లో అవకాశం లేకుండా పోయింది.


తాజా విధానంలో పౌరులు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. స్లాట్ బుకింగ్ పూర్తిగా ఆంగ్లంలో ఉండటం వల్ల అర్థమైన రీతిలో సమాచారాన్ని నిక్షిప్తం చేస్తున్నారు. వినియోగదారుడు ఇచ్చిన సమాచారాన్ని రిజిస్ట్రేషన్ కార్యాలయంలో సవరించడానికి వీలులేదు. గతంలో వినియోగదారుడు దరఖాస్తు, దస్త్రాల్లో ఏవైనా తప్పులు నిక్షిప్తం చేస్తే రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో సవరించి లావాదేవీలు నమోదు చేసేవాళ్లు. ప్రస్తుతం దోషాలుంటే సవరించే అవకాశం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి లేదు.

వ్యవసాయ భూముల్ని వ్యవసాయేతర భూములుగా మార్చుకున్న వారికి తహశీల్దార్ కార్యాలయాల్లో... సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లోగానీ రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం లేదన్న ఆరోపణలున్నాయి. మొత్తంగా వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ విధానంపై పూర్తి స్థాయిలో అవగాహన లేక జనం ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు మాత్రం చాలా సులువైన పారదర్శమైన విధానమని చెబుతున్నారు.

ఇదీ చూడండి: దేశంలో కొవిడ్​ వ్యాక్సిన్​ పంపిణీకి రంగం సిద్ధం!

ABOUT THE AUTHOR

...view details