తెలంగాణ

telangana

Paddy Purchase :వానాకాలమొచ్చినా.. కల్లాల్లోనే యాసంగి పంట

By

Published : Jun 4, 2021, 10:27 AM IST

వానాకాలం మొదలైంది. ఖరీఫ్ పంటలకు వేళైంది. వర్షాలు ముంచుకొస్తున్నాయి. కాని యాసంగిలో వరి పండించిన రైతుల ధాన్యం కొనుగోలు(Paddy Purchase) కష్టాలు మాత్రం తీరడం లేదు. చేతికందిన పంటను అమ్ముకోవడానికి అన్నదాత నానా ఇబ్బందులు పడాల్సి వస్తోంది. కోతలు ముగిసి నెల రోజులు గడుస్తున్నా.. ఇప్పటికీ ధాన్యం కల్లాల్లో, కొనుగోలు కేంద్రాల్లో మూలుగుతోంది. వానలకు ధాన్యం తడిసి రైతన్న లబోదిబోమంటున్నాడు.

paddy purchase, paddy purchase problems, paddy purchase in telangana, paddy purchase in mahabubnagar
ధాన్యం కొనుగోళ్లు, తెలంగాణలో ధాన్యం కొనుగోళ్లు, మహబూబ్​నగర్ జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు

వానాకాలం మొదలైనా.. ఇప్పటికీ యాసంగి పంట కొనుగోలు కేంద్రాల్లో ఉంది. ఓవైపు కరోనా..మరోవైపు లాక్​డౌన్.. ఇంకోవైపు గన్నీలు, హమాలీల కొరతతో ధాన్యం విక్రయించేందుకు రైతు నానాతంటాలు పడుతున్నాడు. ఈలోగా.. మీదొకొస్తోన్న వానలతో ఆరుగాలం కష్టపడి పండించిన పంటంతా నీటిపాలవుతోందని ఆవేదన చెందుతున్నాడు. కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, రవాణా ఎజెన్సీలు, మిల్లర్లు, అధికారుల వైఫల్యాల కారణంగా అంతిమంగా అన్నదాతలు నష్టపోయే దుస్థితి ఎదురవుతోంది.

కొనుగోలు కష్టాలు..

ఉమ్మడి మహబూబ్​నగర్ జిల్లాలో రైతుల వరిధాన్యం కొనుగోలు(Paddy Purchase) కష్టాలు కొనసాగుతూనే ఉన్నాయి. సమయానికి ధాన్యాన్ని కొనుగోలు చేయక, కొనుగోలు చేసిన ధాన్యాన్ని కేంద్రాల నుంచి మిల్లులకు తరలించకపోవడం వల్ల వర్షాలకు చాలాచోట్ల ధాన్యం తడిసిపోయింది. కేంద్రాల వద్ద ఆరబోసిన వడ్లు, తూకం వేసిన బస్తాలు నీటిపాలయ్యాయి. కొన్నిచోట్ల రైతుల కల్లాల్లో అమ్మేందుకు నిల్వ ఉంచిన ధాన్యం మొలకలొచ్చి ఎందుకూ పనికి రాకుండా పోయింది. మహబూబ్ నగర్ మండలం హన్వాడ పీఏసీఎస్ కొనుగోలు కేంద్రం వద్ద తూకం వేసిన బస్తాలు 1250 వరకూ ఉన్నాయి. అవి కాకుండా సుమారు 70 మంది రైతులు ధాన్యాన్ని అమ్మేందుకు కేంద్రానికి తీసుకువచ్చారు. గురువారం తెల్లవారుజామున కురిసిన వర్షానికి కేంద్రం వద్ద ఉన్న ధాన్యం, బస్తాలు అడుగుభాగంలో పూర్తిగా తడిచిపోయాయి. ధాన్యం తీసుకొచ్చి 20 రోజులకు పైగా గడుస్తున్నా కొనడం లేదని.. వానలు ఇలాగే కొనసాగితే చేతికందిన పంట నీటిపాలవుతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు.

అంతటా ఇదే దుస్థితి..

ఒక్క హన్వాడలో మాత్రమే కాదు, ఉమ్మడి జిల్లాలోని అన్నికేంద్రాల్లో ఇదే పరిస్థితి. ధాన్యం కొనుగోలు(Paddy Purchase) చేయాలంటూ పలుచోట్ల రైతులు ఆందోళనలకు దిగుతున్నారు. ఈసారి దాదాపు అన్ని జిల్లాల్లో వరికి అధిక దిగుబడులొచ్చాయి. అంత ధాన్యం వస్తుందని అధికారుల ఊహించలేకపోయారు. దీనికి తోడు కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లులకు తరలించే రవాణా వ్యవస్థ పూర్తిగా విఫలమైంది. సమయానికి లారీలు రాక ధాన్యం..... కేంద్రాల్లో, కల్లాల్లో మూలుగుతోంది. ట్రాక్టర్లు, బస్సులు సర్దుబాటు చేసి మిల్లులకు తరలించినా నిల్వ సామర్థ్యం తక్కువగా ఉండటం, ధాన్యం ఎక్కువ రావడం, హమాలీల కొరతతో సకాలంలో ధాన్యాన్ని మిల్లుల్లో దింపుకోలేకపోయారు. లారీలు రోజుల తరబడి మిల్లుల వద్ద ఆగిపోవాల్సి వచ్చింది. లారీలు రాక ధాన్యం కేంద్రాల్లో నిలిచిపోయింది. కొన్నధాన్యమే తరలి వెళ్లకపోవడంతో, అమ్మేందుకు సిద్ధంగా ఉన్న కొత్తధాన్యం కూడా కేంద్రాల్లో పేరుకు పోయింది.

వనపర్తి జిల్లాలో 3 లక్షల 50వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకోగా.. 2లక్షల 40వే మెట్రిక్ టన్నులు కొన్నారు. ఇందులో 20వేల మెట్రిక్ టన్నులు ఇంకా మిల్లులకు తరలించాల్సి ఉంది. మరో లక్షా 10వేల మెట్రిక్ టన్నుల్ని అధికారులు కొనుగోలు చేయాల్సి ఉంది. మహబూబ్​నగర్ జిల్లాలో లక్షా 80 వేల మెట్రిక్ టన్నులకు ఇప్పటికి లక్షా 60 వేల టన్నులు కొన్నారు. 20 వేల మెట్రిక్ టన్నులు ప్రస్తుతం కేంద్రాల్లో, కల్లాలోనే ఉంది. నాగర్ కర్నూల్ జిల్లాల్లో 2లక్షల 50వేల మెట్రిక్ టన్నులకు, లక్షా70వేల మెట్రిక్ టన్నులు కొన్నారు. దాంట్లో 23వేల మెట్రిక్ టన్నుల్ని ఇంకా మిల్లులకు తరలించాల్సి ఉంది. మరో 80వేల మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని అంచనా. నారాయణపేట జిల్లాలో లక్షా 60వేల మెట్రిక్ టన్నులకు లక్షా 5వేల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశారు. 30వేల మెట్రిక్ టన్నుల ధాన్యం(Paddy Purchase) మిల్లులకు తరలించాల్సి ఉంది. మరో 50వేల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయాల్సి ఉంది. జోగులాంబ గద్వాల జిల్లాలో 49వేల మెట్రిక్ టన్నులకు గాను ఇప్పటి వరకూ 70 వేల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశారు. 3వేల మెట్రిక్ టన్నులు మిల్లులకు తరలించాల్సి ఉంది. మరో 7వేల మెట్రిక్ టన్నులు కొనుగోలు కోసం వస్తాయని అంచనా వేస్తున్నారు.

నష్టపోయినా ఫర్వాలేదు..

ధాన్యం కొనుగోలు చేయకపోవడం, చేసినా మిల్లులకు తరలించకపోవడం ఒక ఎత్తైతే.. మిల్లుల్లో దింపుకునేందుకు మిల్లర్లు నానా రకాల కొర్రీలు పెడుతున్నారు. ఒక్కో బస్తాపై కిలో నుంచి నాలుగైదు కిలోలు తరుగు తీస్తేనే దింపుకుంటామని ఇబ్బంది పెడుతున్నారన్న ఆరోపణలున్నాయి. తూకమై, మిల్లులకు చేరాక తరుగు పేరుతో కోతలు విధించడంతోనూ రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. వానలకు జడిసి నష్టపోయినా ఫర్వాలేదు.. అమ్ముకుంటే చాలనే దుస్థితిని కర్షకులు ఎదుర్కొంటున్నారు.

ABOUT THE AUTHOR

...view details