తెలంగాణ

telangana

పంటి బిగువున కష్టాలను భరిస్తూ.. ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తూ..

By

Published : Apr 23, 2022, 4:25 AM IST

Updated : Apr 23, 2022, 6:47 AM IST

పేదరికం ఆమెను చదువుకు దూరం చేసింది. బాల్యం తోబుట్టువుల సంరక్షణకే సరిపోయింది. అన్ని కుదట పడి పెళ్లి చేసుకుందామనుకుంటున్న వేళ అనుకోని రోడ్డు ప్రమాదం ఆమె జీవితాన్ని మార్చేసింది. రెండేళ్లుగా మంచానికే పరిమితమై ప్రతి పనికి తల్లిపైనే ఆధారపడాల్సి వస్తోంది. మహబూబ్‌నగర్‌కు చెందిన నిరుపేద యువతి దయనీయస్థితి.

Lakshmi confined to bed
మంచానికే పరిమితమైన లక్ష్మీ

మహబూబ్‌నగర్‌ సమీపంలోని బోయపల్లి గ్రామానికి చెందిన కావలి శాంతయ్య, వెంకటమ్మ దంపతుల కూతురు లక్ష్మీ. స్థానికంగా ఉపాధి లేక ఆ దంపతులు గతంలో హైదరాబాద్‌కు వలస వెళ్లారు. తల్లిదండ్రులు పనులకు వెళ్తే పెద్ద కుమార్తె లక్ష్మీ పాఠశాలకు వెళ్లకుండా ఇంటి వద్దే ఉంటూ చెల్లె, తమ్ముడిని సంరక్షించేది. 12 ఏళ్ల క్రితం పని కోసం వెళ్తున్నట్లు చెప్పి ఇంటి నుంచి బయలుదేరిన తండ్రి తిరిగిరాలేదు. ఆయన ఏమయ్యాడో తెలియదు.

అప్పటి నుంచి తల్లే పిల్లలను పెంచింది. 7 ఏళ్ల క్రితం తిరిగి బోయపల్లికి మకాం మార్చి అత్తవారింటి దగ్గరే ఉంటున్నారు. లక్ష్మీకి 18 ఏళ్లు నిండటంతో పెళ్లి చేసేందుకు డబ్బులు కూడబెట్టుతూ పెళ్లి ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఈ క్రమంలో 2019లో మార్చిలో ఇంటి సమీపంలోని స్నేహితురాలి వివాహ వేడుకకు వెళ్లింది.

అక్కడ జరిగిన ఊరేగింపులో వెళ్తుండగా ప్రమాదవశాత్తు కారు లక్ష్మీని ఢీకొట్టడంతో నడుము విరిగింది. చికిత్స నిమిత్తం వెంటనే మహబూబ్‌నగర్‌లోని ప్రైవేటు ఆసుపత్రికి, ఆ తరువాత హైదరాబాద్‌కు తరలించారు. ఆర్థిక స్థోమత లేక గాంధీ ఆసుపత్రిలో చేర్పించారు. ఆ తర్వాత నిమ్స్‌కు తీసుకెళ్లగా సర్జరీ చేశారు. లాక్‌డౌన్‌, కోవిడ్‌ కేసులు పెరుగుతుండటం మూడు రోజుల్లోనే ఇంటికి పంపించారు.

రెండేళ్లుగా లక్ష్మి మంచానికే పరిమితమైంది. నడుము విరిగిపోవటంతో లేవలేదు. కూర్చోలేదు. కనీసం కాలు కూడా కదపలేదు. మొండెం నుంచి కింది భాగం పూర్తిగా స్పర్శను కోల్పోవటంతో మలమూత్రాలు వచ్చినా ఆమెకు తెలియటం లేదు. ఆమె తల్లి లక్ష్మికి కాలకృత్యాల నుంచి స్నానం చేయించటం, భోజనం పెట్టడం వరకు పసిబిడ్డకు చేసినట్లు అన్ని సపర్యలు చేయాల్సి వస్తోంది.

రోజంతా లక్ష్మీని కనిపెట్టుకుని ఉండాల్సి రావటంతో తల్లి కూలీ పనులకు కూడా వెళ్లలేని పరిస్థితి నెలకొంది. ఉండటానికి సరైన ఇల్లు కూడా లేదు. యువతి పెళ్లి కోసం కూడబెట్టుకున్న డబ్బులు కూడా అయిపోవడంతో కుటుంబ దైన్యాన్ని చూసి బంధువులు, తెలిసిన వారు ఇచ్చే డబ్బులతో నిత్యావసరాలు కొనుక్కొంటూ రోజులు గడుపుతున్నారు. లక్ష్మీకి ఎవరైన దాతలు ముందుకు వచ్చి వైద్యం చేయించాలని కుటుంబ ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఆదుకోవాలని పలువురు కోరుతున్నారు.

"తన నిస్సహాయ స్థితిని, తల్లి పడుతున్న కష్టాలు తలచుకుంటూ లక్ష్మీ నిత్యం కన్నీటి పర్యంతమవుతోంది. పెద్ద ఆసుపత్రుల్లో వైద్యం చేయించునే స్థోమత తమకు లేదని, ప్రభుత్వం స్పందించి కనీసం తన అవసరాలు తానే తీర్చుకునేలా మెరుగైన వైద్యం చేయించాలని లక్ష్మీ వేడుకుంటోంది."

- లక్ష్మీ, భాదితురాలు

ఆపన్నహస్తం కోసం ఎదురు చూపులు

ఇదీ చదవండి: Ramadan Special: రంజాన్‌ మాసంలో నోరూరిస్తున్న మసాలా రుచులు

భగభగ మండే కాగడాలతో రెండు గ్రూపుల దాడి.. అదే ఆచారం!

Last Updated :Apr 23, 2022, 6:47 AM IST

ABOUT THE AUTHOR

...view details