తెలంగాణ

telangana

సర్కారు వారి సాయం.. ఆ కుటుంబాలు సంపన్నం

By

Published : Jan 30, 2023, 9:18 AM IST

Dalit Bandhu Scheme

Dalit Bandhu Scheme in Telangana: దళితుల ఆర్థిక స్థితిగతులు మార్చడమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన దళితబంధు పథకం అమల్లో రాష్ట్రంలోనే ఉమ్మడి ఖమ్మం జిల్లా అగ్రస్థానంలో ఉంది. లబ్ధిదారులు, యూనిట్ల ఎంపిక మొదలుకొని గ్రౌండింగ్ వంటి ప్రక్రియలో యంత్రాంగం తీసుకున్న చర్యలతో రాష్ట్రంలోనే అత్యధికంగా సత్ఫలితాలిస్తోంది. ఇప్పటికే దళిత బంధు యూనిట్ల ద్వారా వారి కుటుంబాలు ఆర్థికంగా గాడిన పడుతున్నాయి. అట్టడుగు వర్గాల కుటుంబాలు ఆర్థిక స్వావలంబన సాధిస్తున్నాయి. ఫలితంగా లబ్ధిదారుల కుటుంబాల్లో ఆనందం వెల్లివిరిస్తోంది.

దళితబంధు పథకం వలన వృద్ధి చెందుతున్న లబ్ధిదారులు

Dalit Bandhu Scheme in Telangana: రాష్ట్రవ్యాప్తంగా దళిత కుటుంబాలను ఆర్థిక పరిపుష్టం చేసేందుకు ప్రభుత్వం దళితబంధు పథకాన్ని తీసుకొచ్చింది . తొలుత రాష్ట్రంలోనే తొలిసారి కరీనంగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గం నుంచి దళితబంధుకి శ్రీకారం చుట్టింది. ఆ తర్వాత రాష్ట్రవ్యాప్త విస్తరణలో భాగంగా ఖమ్మం జిల్లా చింతకాని మండలం పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి 3,462 యూనిట్లకు సంబంధించి ప్రక్రియ మొదలెట్టారు.

ఒక్కో యూనిట్‌కు 10 లక్షలు: చింతకాని మండలంలోనే లబ్ధిదారులు ఎంపిక, యూనిట్ల గ్రౌండింగ్‌ త్వరితగతిన పూర్తయింది. మొత్తం 3462 యూనిట్లకు గానూ 346 కోట్ల నిధులు కేటాయించారు . తొలిదఫాలోనే లబ్ధిదారులకు యూనిట్లు అందాయి. ఆ తర్వాత మళ్లీ చింతకానికి వచ్చిన అదనపు నిధులతో లబ్దిదారుల సంఖ్య 3,945 మంది కాగా 395 కోట్లు అందజేశారు. ఒక్కో యూనిట్‌కు రూ.10 లక్షల చొప్పున వారి ఖాతాల్లో వేశారు. తొలి దఫాలో అన్ని జిల్లాల్లో కంటే ఖమ్మంలోనే లబ్ధిదారుల ఎంపిక మొదలుకొని యూనిట్ల గ్రౌండింగ్ వరకు ముందంజలో ఉంది.

కుటుంబానికి ఆసరాగా నిలుస్తున్నారు: పైలెట్ ప్రాజెక్టుగా ఎంపికైన చింతకాని మండలంతో పాటు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా దళితబంధు యూనిట్లు పొందిన లబ్ధిదారులు ఆర్థికంగా సొంతకాళ్లపై నిలబడుతున్నారు. మొత్తం 120 రకాల యూనిట్లు లబ్ధిదారులు ఎంపిక చేసుకుని ఆత్మవిశ్వాసంతో విజయపథంలో సాగుతున్నారు. తమకు ప్రభుత్వం అందించిన యూనిట్లను విజయవంతంగా నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం అందించిన సహకారాన్ని అందిపుచ్చుకుని ఆర్థికంగా నిలదొక్కుకుకుంటున్నారు.

మహిళలు, యువత ఈ పథకాన్ని అద్వితీయంగా అందిపుచ్చుకుంటోంది. మహిళలు మొక్కవోని దీక్షతో వ్యాపారాలు చేస్తూ.. విజయవంతంగా నడుపుతున్నారు. ప్రభుత్వం అందించిన ఆర్థిక సహకారంతో కిరాణం, ఫ్యాన్సీ, రెడీమేడ్ దుస్తులు, డెయిరీ యూనిట్లు, ఔషధ దుకాణాలు నిర్వహిస్తున్నారు. మరికొందరు హార్వెస్టర్లు, జేసీబీలు, మొబైల్ టిఫిన్ సెంటర్లు, రవాణా వాహనాలు, ఫోటో స్టూడియో, కాంక్రీట్‌ మిక్సర్లు నడుపుతూ కుటుంబానికి ఆసరాగా మారారు.

దళితబంధు పథకం తొలి దశ విజయం:ముఖ్యమంత్రి కేసీఆర్ దూరదృష్టితో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దళితబంధు పథకం ద్వారా.. దళితులు ధనికులుగా మారుతున్నారని.. నాటి కూలీలే నేడు యజమానులుగా తలెత్తుకుని జీవిస్తున్నారని ప్రజాప్రతినిధులు కొనియాడుతున్నారు. దళితబంధు పథకం దళితుల కుటుంబాల్లో వెలుగులు నింపుతోంది. తొలి దశ విజయవంతంతో పథకం రెండో దశ అమలుపై జిల్లా యంత్రాంగం దృష్టిసారించింది.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details