తెలంగాణ

telangana

Bathukamma celebrations: ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు.. ఉత్సాహంగా పాల్గొన్న మహిళలు

By

Published : Oct 7, 2021, 5:09 AM IST

Bathukamma celebrations
రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు

రాష్ట్రవ్యాప్తంగా బతుకమ్మ సంబరాలు తొలిరోజు అట్టహాసంగా జరిగాయి. ఊరూవాడా ఉయ్యాల పాటలు మారుమోగాయి. తొలిరోజు ఎంగిలి పూల బతుకమ్మ వేడుకల్లో.. తీరొక్క పూలతో పేర్చిన బతుకమ్మల చుట్టూ చిన్నాపెద్ద సంతోషంగా ఆడిపాడారు.

రాష్ట్రంలో బతుకమ్మ సంబరాలు అంబరాన్ని అంటాయి. పెత్తరమాస రోజు ఎంగిలిపూల బతుకమ్మతో వేడుకలు మొదలవగా.. తొలిరోజే రాష్ట్రవ్యాప్తంగా బతుకమ్మ శోభ ఉట్టిపడింది. రవీంద్రభారతిలో తెలంగాణ సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న వేడుకలను మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ ప్రారంభించారు. రంగు రంగుల పూలను ఒద్దికగా పేర్చి.. రాగయుక్తమైన పాటలకు లయబద్దమైన తాళం వేస్తూ మహిళలు ఆడిపాడారు.

బతుకమ్మ వేడుకల్లో గవర్నర్‌

రాజ్‌భవన్‌లో జరిగిన బతుకమ్మ వేడుకల్లో గవర్నర్‌ తమిళిసై, ఆమె కుటుంబసభ్యులు పాల్గొన్నారు. దాదాపుగా మూడుగంటలపాటు బతుకమ్మ ఆడారు. కూకట్‌పల్లిలోనూ యువతులు, మహిళలు, చిన్నారులు సంతోషంగా బతుకమ్మ వేడుకల్లో భాగస్వామ్యులయ్యారు.

ఉమ్మడి వరంగల్ జిల్లాలో..

ఉమ్మడి వరంగల్‌లో జిల్లాల్లోని ఊరువాడా బతుకమ్మ సంబురాలతో మురిసిపోయింది. హనుమకొండలోని వేయి స్తంభాల ఆలయం తీరొక్క పూలతో పేర్చిన బతుకమ్మలతో పూలవనంలా మారింది. వేలాదిగా తరలివచ్చిన మహిళలతో సందడిగా మారింది. బతుకమ్మ పాటలకు అనుగుణంగా నృత్యాలు చేస్తూ హొరెత్తించారు.

మెదక్ జిల్లాలో..

బతుకమ్మ సంబరాలు ఉమ్మడి మెదక్‌ జిల్లాలోనూ ఘనంగా జరిగాయి. బతుకమ్మలను అందంగా పేర్చి కోదండ రామాలయం బాలాజీ మందిరంతో పాటు వివిధ కూడళ్లు, కాలనీల వద్ద బతుకమ్మ ఆడారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో బతుకమ్మ వేడుకల్లో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో..

ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోనూ బతుకమ్మ ఆటపాటలు మారుమోగాయి. ఖమ్మంలో జరిగిన వేడుకల్లో మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ పాల్గొన్నారు. చిన్నాపెద్ద అంతా ఒక్కచోట చేరి ఉత్సాహంగా బతుకమ్మ ఆడారు. ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలను ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో మహిళలు ఘనంగా జరుపుకున్నారు.

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో..

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో బతుకమ్మ సంబురాలతో మురిసిపోయింది. హుజూరాబాద్‌లో ఎంగిల పూల బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. సిరిసిల్ల మహిళలు సంతోషంగా బతుకమ్మ ఆడారు. ఉమ్మడి ఆదిలాబాద్‌లోనూ ఊరువాడా ఉయ్యాల పాటలు మారుమోగాయి. మంచిర్యాల జిల్లా కేంద్రంలో బతుకమ్మ సంబురాల్లో మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు.

ఉమ్మడి నల్గొండ జిల్లాలో..

ఉమ్మడి నల్గొండ జిల్లాలోనూ తొలిరోజు బతుకమ్మ సంబరాలు అంబరాన్ని అంటాయి. చిన్నాపెద్దా తేడా లేకుండా బతుకమ్మ సంబరాల్లో ఆడి పాడారు.

ఇదీ చూడండి:Bathukamma images: ఎంగిలి బతుకమ్మా వలలో.. ఎన్నెన్ని సుందర సిత్రాలో వలలో...

ABOUT THE AUTHOR

...view details