తెలంగాణ

telangana

Viral Video: నోట్లిస్తేనే ఓట్లేస్తాం.. పైసలు అందలేదని రోడ్డెక్కిన ఓటర్లు.. ఎక్కడంటే..?

By

Published : Oct 27, 2021, 6:25 PM IST

Updated : Oct 27, 2021, 7:54 PM IST

అందరిది ఓ బాధ అయితే.. వాళ్లది ఇంకో బాధ. కానీ.. ఈ బాధ కొంచెం ఆసక్తికరమండోయ్​. నోట్లతో ఓట్లు కొంటున్నారని.. కొందరు ఆందోళనలు చేస్తుంటే.. ఆ పైసలు మాకు అందలేదని లొల్లి చేస్తున్నారు కొందరు ఓటర్లు. మా ఇంట్ల 5 ఓట్లున్నాయని ఒకరు.. మేము నలుగురం ఉన్నామని ఇంకొకరు.. మేం ఇద్దరమున్నామని ఓ ముసలమ్మ.. ఇలా ఆ ప్రాంత ఓటర్లంతా రోడ్డెక్కారు. "ఇప్పటి వరకు మాకు ఒక్క రూపాయి అందలేదు.. మా సంగతేంది.. మాకు బాధుండదా.." అంటూ.. హుజూరాబాద్​ ఓటర్లు ఆవేదన వెళ్లగక్కుతున్నారు. మరి వాళ్ల సంగతేంటో.. మీరూ చూసేయండి.

voters-worried-about-not-receiving-money-for-their-votes-in-huzurabad-by-elections
voters-worried-about-not-receiving-money-for-their-votes-in-huzurabad-by-elections

నోట్లిస్తేనే ఓట్లేస్తాం.. పైసలు అందేలేదని రోడ్డెక్కిన ఓటర్లు..

హుజూరాబాద్​ ఉపఎన్నికలు రసవత్తరంగా మారాయి. రాష్ట్రమంతా ఎంతో ఉత్కంఠంగా ఈ​ ఎన్నిక వైపే చూస్తుండగా.. ఆయా పార్టీలు తమ గెలుపు కోసం అన్ని రకాల అస్త్రాలు ప్రయోగిస్తున్నారు. ఈరోజే ప్రచారానికి చివరి రోజు కావటం వల్ల.. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు లక్ష్మీదేవిని రంగంలోకి దింపారు. ఇన్ని రోజులు పార్టీలు నిర్వహించే.. సమావేశాల కోసం జనాన్ని పోగేసేందుకు రోజువారి కూలీల లెక్కన డబ్బు పంచిన చోటా నాయకులు.. ఇప్పుడు ఓటుకింతా అని ఏకంగా కవర్లల్లో డబ్బులు పెట్టి పంచేస్తున్నారు. డబ్బులు పంచుతున్న వీడియోలు సోషల్​ మీడియాలో తెగ వైరల్​ అవుతున్నాయి కూడా.

ఆవేదన ఉండదా అండీ..

ఇక్కడి వరకు అంతా బాగానే ఉన్నా.. మరి కవర్లు అందుకోని ఓటర్ల పరిస్థితి ఏంటీ..? అక్కడే వచ్చింది అసలు సమస్య. పంచేది.. ఐదు వందలో, వెయ్యో అయితే.. అందినా.. అందకపోయినా.. పెద్ద పట్టించుకునే వారు కాదేమో..! కానీ.. ఏకంగా 6 నుంచి పది వేలు పంచుతున్నారని తెలిసి.. ఆ కవర్లు దక్కని వాళ్లు.. అగ్గి మీద గుగ్గిలం అవుతున్నారు. అసలు తమకెందుకు ఇవ్వరని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అందరికి ఇచ్చినట్టు తమకు కూడా పైసలు ఇస్తేనే.. ఓట్లు వేస్తామని బహిరంగంగానే తెగేసి చెప్తున్నారు.

నడిరోడ్డు మీదే కడిగేశారు..

ఈ ఆసక్తికర ఘటన.. హుజూరాబాద్‌లోని కొత్తపల్లిలో జరిగింది. తమకు డబ్బు అందలేదని గ్రామంలోని ఓ ప్రాంతపు మహిళా ఓటర్లంతా కలిసి ఏకంగా ఆందోళనకు దిగారు. ఆ ప్రాంతానికి చెందిన మహిళలు, వృద్ధులంతా కలిసి ఓ వ్యక్తిని చుట్టుముట్టేశారు. "ఫలానా ప్రాంతంలో డబ్బు పంచుతున్నావు కదా.. మరి మాకెందుకు ఇవ్వడం లేదు" అని నడిరోడ్డు మీద నిలదీశారు. కొంత మందికి ఇచ్చి తమకెందుకు ఇవ్వలేదని అందరి ముందే కడిగేశారు. ఈ పరిణామం ఊహించని ఆ వ్యక్తికి.. ఏం చెప్పాలో తెలియక సతమతమైపోయాడు. తాను ఎవరికీ డబ్బు ఇవ్వలేదని వాళ్లకు నచ్చజెప్పేందుకు ప్రయత్నించి.. అక్కడి నుంచి మెల్లగా జారుకున్నాడు. డబ్బు ఇవ్వడం లేదని ధర్నా చేద్దామని.. కొంత మంది మహిళలు నిర్ణయించుకోగా.. పోలీసులు వచ్చి పట్టుకెళ్తారేమోనని మరికొందరు వెనుకంజ వేశారు.

పైసలిస్తే ఓట్లు లేకపోతే లేదు..

"ఒక్కొక్క ఓటుకు కవరులో ఆరు వేల రూపాయల చొప్పున ఇస్తున్నారు. మా ఇళ్లలో కూడా ఓట్లు ఉన్నాయి. మరి మాకెందుకు ఇవ్వరు. మా ఇంట్లో ఐదు ఓట్లున్నాయి. ఇస్తే అందరికి ఇయ్యాలే. ఇయ్యకపోతే మొత్తానికే ఇయ్యద్దు. కొందరికి ఇచ్చి.. మాకెందుకు ఇస్తలేరు. పల్లెల్లో ఓటుకు 6 వేలు ఇస్తున్నారట.. సిటీల్లో 10 వేలు పంచుతున్నారట. మాకైతే.. ఒక్క రూపాయి కూడా ఇప్పటి దాకా అందలే. మాకు డబ్బు ఇస్తేనే ఓట్లు వేస్తాం. లేకపోతే .. అసలు ఎవ్వరికీ ఓట్లు వేయం" -మహిళా ఓటర్లు

పలుచోట్ల ఉదయం ఆరు గంటల నుంచి 7 గంటల ప్రాంతంలో డబ్బు కవర్ల పంపిణీ జరిగిందని సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం జరగింది. ఈ వార్తలతో పలుచోట్ల ఆందోళనలు చోటు చేసుకున్నాయి. ఇప్పుడు ఈ ఓటర్ల ఆవేదనతో కూడిన ఆందోళన వీడియో వైరల్​గా మారి.. ఆసక్తి రేకెత్తిస్తోంది.

ఇదీ చూడండి:

Last Updated : Oct 27, 2021, 7:54 PM IST

ABOUT THE AUTHOR

...view details