తెలంగాణ

telangana

'గుండెల మీద పెట్టుకుని పెంచితే.. గూడు లేకుండా చేశారయ్యా'

By

Published : May 17, 2022, 11:00 AM IST

జీవితమంతా కష్టించి.. ఆస్తిని పంచిన తల్లిదండ్రులను వారి కుమారులు బయటకు వెళ్లగొట్టారు. గతిలేక ఆ వృద్ధులు సామాజిక భవనంలో కాలం వెళ్లదీస్తున్నారు. ఈ దారుణ ఘటన కరీంనగర్‌ రూరల్‌ మండలం చెర్లబూత్కూర్‌ గ్రామంలో చోటుచేసుకుంది. అసలు ఏం జరిగిందంటే...

SONS HAS THROWN HIS FATHER OUT OF HIS HOME
'గుండెల మీద పెట్టుకుని పెంచితే.. గూడు లేకుండా చేశారయ్యా'

పిల్లలే సర్వస్వమని తమ జీవితాల్ని ధారబోసే తల్లిదండ్రులను వృద్ధాప్యం రాగానే వదిలించుకుంటున్నారు. కన్నపేగు మీద కాస్త కూడా కనికరం లేకుండా రోడ్డుమీదకు నెట్టేస్తున్నారు. కళ్లలో పెట్టుకుని చూసుకున్న వారిపై కాస్త దయ కూడా చూపించడం లేదు. గుండెల మీద పెట్టుకుని పెంచిన ఆ కన్నపేగు గుండె పగిలేలా ప్రవర్తిస్తున్నారు. చివరకు గూడు కూడా లేకుండా చేశాడో కనికరంలేని కుమారులు.

ఇదీ జరిగింది.... కరీంనగర్‌ రూరల్‌ మండలం చెర్లబూత్కూర్‌ గ్రామానికి చెందిన అయిలయ్య, రావమ్మ ఇద్దరు దంపతులు. వీరికి ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. దాదాపు 90 ఏళ్ల వయసు వీరిది. అయిలయ్య తన ఆరు ఎకరాల భూమిని కుమారులకు పంచిపెట్టారు. ఇల్లు మూడో కుమారుడికి ఇస్తే, అతడు కొత్త ఇల్లు కట్టుకున్నాడు. పక్కనే తల్లిదండ్రులకు చిన్న రేకులషెడ్డు నిర్మించారు. కొన్నాళ్లకు అక్కడి నుంచి వెళ్లగొట్టడంతో ఆ దంపతులు చిన్న ఇల్లు అద్దెకు తీసుకుని.. వృద్ధాప్య పింఛనుతో జీవించేవారు.

మూడు నెలల కిందట గ్రామ పెద్దలంతా చర్చించి.. దంపతులను కుమారులు ఒక్కొక్కరు నెల రోజుల చొప్పున చూడాలని నిర్ణయించారు. ఆ ప్రకారం వృద్ధులు అద్దె ఇల్లు ఖాళీ చేసి ఇద్దరు కుమారుల వద్ద నెల రోజుల చొప్పున గడిపారు. మూడో కుమారుడు వారిని రానీయలేదు. పెద్ద కుమారుడు తన ఇంటి నుంచి వారి సామగ్రిని బయట పడేయించాడు. దీంతో 20 రోజులుగా వారు స్థానిక సామాజిక భవనంలో తలదాచుకుంటున్నారు. ఈ విషయం తెలిసిన ఇద్దరు కుమార్తెలు తల్లిదండ్రులను సోమవారం కలెక్టరేట్‌కు తీసుకువచ్చి 'ప్రజావాణి'లో ఫిర్యాదు చేయించారు. ఈ విషయం మంత్రి గంగుల కమలాకర్‌ దృష్టికి వెళ్లడంతో ఆయన తగు చర్యలు తీసుకోవాలని స్థానిక తహసీల్దారును ఆదేశాంచారు.

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details