తెలంగాణ

telangana

PARVATI BARRAGE: పార్వతి బ్యారేజీలో చేపల వేట..

By

Published : Jul 27, 2021, 9:56 AM IST

Updated : Jul 27, 2021, 10:03 AM IST

పార్వతీ బ్యారేజీ గేట్లు మూశారని తెలియగానే... ప్రజలు తండోపతండాలుగా అక్కడకు చేరుకున్నారు. నీటిలో దిగుతూ... చేపలు పట్టేందుకు ఎగబడుతున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ప్రజలను చెదరగొట్టే ప్రయత్నం చేశారు.

people-fishing-in-parvati-barrage
పార్వతి బ్యారేజీలో చేపల వేట..

పార్వతి బ్యారేజీలో చేపల వేట..

గత పది రోజుల క్రిందట ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి అధికారులు నీటిని విడుదల చేయడంతో పార్వతీ బ్యారేజీ నిండుకుండలా మారింది. వెంటనే స్పందించిన అధికారులు ముందస్తుగా నీటిని దిగువకు విడుదల చేశారు. నీటి ప్రవాహం తగ్గిపోవడంతో సోమవారం మూడు గంటల తర్వాత నుంచి గేట్లను మూసి వేశారు. ఈ విషయం దావానలంలా వ్యాపించడంతో ప్రజలు బ్యారేజీ వద్దకు పరుగులు పెట్టారు. తండోపతండాలుగా వచ్చి చేపలను పట్టడానికి పోటీ పడ్డారు. బ్యారేజీలోకి దిగి చేపలను పట్టుకుంటున్నారు.

బ్యారేజీ వద్ద ప్రజల జనాలు
చేపలు పడుతున్న జనాలు

పోలీసుల రంగప్రవేశంతో పరుగులు పెట్టిన ప్రజలు..

లుంగీలు, వలలు, సంచులు, బ్యాగుల్లో చేపలను తీసుకొని వెళ్తున్నారు. మరికొందరికీ తీసుకెళ్లేందుకు ఏంలేక చేతుల్లోనే పట్టుకెళ్తున్నారు. బ్యారేజీలోకి దిగడం ప్రమాదమని తెలిసినా పట్టించుకోకుండా ఎగబడుతున్నారు. సంబంధిత అధికారులకు విషయం తెలిసినప్పటికీ... తమకేం పట్టనట్లుగా నిర్లక్ష్యం వహించారు. విషయం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగి ప్రజలను చెదరగొట్టే ప్రయత్నం చేశారు. పోలీసులను చూసిన ప్రజలు పరుగులు తీశారు. కరోనా కాలంలోనూ ఎలాంటి మాస్కులు ధరించకుండా, భౌతిక దూరం పాటించకుండా గుంపులుగా తిరగడం భయాందోళనలకు గురిచేస్తోంది.

అందరం కలిసే వచ్చినం.. మనిషికిన్ని దొరికినయ్..
పట్టుకుపోవడానికి ఏం లేదు.. అందుకే చేతుల్లో తీసుకెళ్తున్నా..
నాకు రెండే దొరికినయ్.. చాలు ఈరోజుకి..
అబ్బా.. నాకైతే బాగానే దొరికాయోచ్..

ప్రత్యేకంగా హోటల్...

చేపలు పట్టుకునేందుకు వచ్చిన వారు అలిసిపోవడం గమనించిన ఇద్దరు వ్యక్తులు... అక్కడే ఓ చిన్న హోటల్ ఏర్పాటు చేశారు. టీ, టిఫిన్లు తయారు చేసి అమ్ముకుంటూ డబ్బులు సంపాదించుకుంటున్నారు.

ఇదీ చూడండి:ACCIDENTS: రక్తసిక్తమవుతున్న రహదారులు.. రోజుకు 34 రోడ్డు ప్రమాదాలు

Last Updated :Jul 27, 2021, 10:03 AM IST

ABOUT THE AUTHOR

...view details