తెలంగాణ

telangana

Sanitation worker MA LLB: పారిశుద్ధ్య కార్మికుడు@ఎమ్‌.ఎ, (ఎల్‌.ఎల్‌.బి)

By

Published : Jan 3, 2022, 4:04 PM IST

Sanitation worker MA LLB : చదువుకోవాలన్న పట్టుదల ఉండాలే కానీ... వయస్సు.... చేసే ఉద్యోగంతో నిమిత్తం లేకుండా విద్యను అభ్యసించ వచ్చని నిరూపిస్తున్నారు.. కరీంనగర్‌కు చెందిన ఓ పారిశుధ్యకార్మికుడు. తన చదువుకు తగ్గ ఉద్యోగం రాలేదని ఏనాడు నిరుత్సాహ పడలేదు. పైగా తన పిల్లలకు ఉన్నత చదువులకు అవకాశం కల్పిస్తూనే... తాను కూడా ఉన్నత చదువులు కొనసాగించి ఆదర్శంగా నిలుస్తున్నారు. ప్రస్తుతం న్యాయశాస్త్ర పట్టా కోసం... యత్నిస్తున్న పట్టువదలని విక్రమార్కునిపై ఈటీవీ భారత్ ప్రత్యేక కథనం.

Sanitation worker MA LLB, Sanitation worker ramesh
పారిశుద్ధ్య కార్మికుడు @ఎమ్‌.ఎ, (ఎల్‌.ఎల్‌.బి)

పారిశుద్ధ్య కార్మికుడు @ఎమ్‌.ఎ, (ఎల్‌.ఎల్‌.బి)

Sanitation worker MA LLB : కరీంనగర్‌లో ఒప్పంద పారిశుధ్య కార్మికునిగా పనిచేస్తున్న ఈయన పేరు కుతాడి రమేశ్. ప్రస్తుతం న్యాయశాస్త్ర పట్టా కోసం.. రేయింబవళ్లు కృషి చేస్తున్నారు. షిప్టుల వారీగా పారిశుధ్య కార్మికునిగా విధులు నిర్వర్తిస్తూనే.. ఉన్నత చదువులకు అవసరమైన పుస్తకాలు కొనుక్కోలేని పరిస్థితిలో... గ్రంథాలయాన్ని ఉపయోగించుకుంటున్నారు. ఎంఏ ఇంగ్లీష్‌ లిటరేచర్... ఫస్ట్‌ క్లాస్‌లో పాసయ్యారు. అనంతరం ప్రమోషన్ వస్తుందేమోనన్న ఉద్దేశంతో... శానిటరీ కోర్సును పూర్తి చేశారు. ప్రమోషన్ రాకపోయినా నిరాశపడకుండా.. ఉన్నత చదువులను కొనసాగిస్తున్నారు. కుటుంబ పోషణతో పాటు... తమ పిల్లలకు ఉన్నత చదువులకు పంపిస్తూనే.. ఎల్ఎల్​బీ ద్వితీయ సంవత్సరాన్ని కొనసాగిస్తున్నారు. ఏ ఉద్యోగమైనా చేయడానికి సిద్ధపడినప్పుడే... డబ్బు విలువ తెలుస్తుందని అప్పుడే చదువు పట్ల మరింత శ్రద్ధ పెరుగుతుందని అంటున్నారు రమేశ్‌.

ఇంటర్, డిగ్రీ చదివిన. అంబేడ్కర్ యూనివర్శిటీలో పీజీ కూడా చేశాను. శానిటరీ కోర్సు పూర్తి చేశారు. ఇప్పుడు ఎల్​ఎల్​బీ రెండో సంవత్సరం చదువుతున్నాను. ప్రభుత్వం ఏవైనా నోటిఫికేషన్లు విడుదలైతే రాస్తాను. కోచింగ్ తీసుకునే సామర్థ్యం లేదు. గ్రంథాలయంలో ఉన్న పుస్తకాలతో సన్నద్ధమవుతాను. మున్సిపాలిటీ పారిశుద్ధ్య కార్మికుడైన నేను.. ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని అనుకుంటున్నాను.

-రమేష్‌, ఎమ్‌ఏ, (ఎల్‌.ఎల్‌.బి), పారిశుధ్య కార్మికుడు

పిల్లలతో పాటు..

తాను ఉన్నత విద్యను అభ్యసించడమే కాకుండా... తన పిల్లలకు కూడా ఉన్నత చదువులు చదివించాలని పట్టుదలగా ఉన్నారు రమేష్‌. అందుకే కుమార్తె నాగజ్యోతిని బీఎస్సీ చదివించారు. ప్రస్తుతం పీజీపై దృష్టి సారించి ఉన్నత చదువులకు సిద్ధం చేస్తుండగా.. తనయుడు విద్యాధర్‌ను ఇంటర్మీడియట్ చదివిస్తున్నారు. నాన్న ఎంతో కష్టపడి తమను చదివిస్తున్నారని.. పారిశుధ్య పని చేస్తూనే ఎల్‌ఎల్‌బీ చదవడం గర్వంగా ఉందని పిల్లలు చెబుతున్నారు.

మా నాన్న ఎన్నో సంవత్సరాల నుంచి కష్టపడుతూనే... తాను చదువుకుంటున్నారు. మమ్మల్ని కూడా బాగా చదివిస్తున్నారు. పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేస్తూనే... 15 ఏళ్ల నుంచి చదువుకుంటున్నాడు. ఇంకా కూడా మాతోపాటు చదువుకోవడం మాకు చాలా గర్వంగా ఉంది. పారిశుద్ధ్య కార్మికుడైనా కూడా ఎంతో కష్టపడి ఉన్నత చదువులు చదివి... ఆదర్శంగా నిలుస్తున్నారు.

-రమేశ్ పిల్లలు

సమయం వృథా వద్దు..

కరీంనగర్‌ నగరపాలక సంస్థలో పారిశుధ్య కార్మికులుగా పనిచేస్తున్న వారిలో... అధిక శాతం పదో తరగతి నుంచి ఇంటర్మీడియట్‌ వరకు విద్యను అభ్యసించిన వారున్నారు. డిగ్రీ పూర్తి చేసిన వారు ఇరవై మంది వరకు ఉండటం గమనార్హం. ప్రస్తుత పరిస్థితుల్లో ఉన్నత ఉద్యోగాలంటూ సమయం వృథా చేయకుండా.. అందుబాటులో ఉన్న ఉద్యోగాల్లో చేరాలని రమేశ్ సూచిస్తున్నారు.

ఇదీ చదవండి:ఇంట్లో గ్యాస్ లీక్.. కుమార్తె సహా దంపతులు సజీవదహనం

ABOUT THE AUTHOR

...view details