తెలంగాణ

telangana

Vaccination Record: నూటికి నూరు శాతం టీకాస్త్రం.. కరీంనగర్​ ఆదర్శం

By

Published : Jan 26, 2022, 3:53 AM IST

Vaccination Record: వ్యాక్సినేషన్‌లో కరీంనగర్‌ జిల్లా రికార్డు సృష్టించింది. మంగళవారం నాటికి జిల్లాలో రెండో డోస్‌ పంపిణీ 100 శాతం పూర్తయింది. తద్వారా రాష్ట్రంలో రెండు డోసులు 100 శాతం పూర్తి చేసుకున్న తొలిజిల్లాగా, దక్షిణాది రాష్ట్రాల్లో రెండో జిల్లాగా రికార్డు సొంతం చేసుకుంది. దక్షిణాది రాష్ట్రాల్లో రెండు డోసులు పూర్తయిన జిల్లాగా బెంగళూరు అర్బన్‌ మొదటి స్థానంలో నిలవగా.. కరీంనగర్‌ రెండో స్థానంలో నిలిచింది. ఈ సందర్భంగా కరీంనగర్ సాధించిన ఘనత పట్ల ఆరోగ్యశాఖ మంత్రి హర్షం వ్యక్తం చేస్తూ.. రాష్ట్రంలోని మిగత జిల్లాలు సైతం ఇదే స్ఫూర్తితో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.

Vaccination Record: నూటికి నూరు శాతం టీకాస్త్రం.. కరీంనగర్​ ఆదర్శం
Vaccination Record: నూటికి నూరు శాతం టీకాస్త్రం.. కరీంనగర్​ ఆదర్శం

Vaccination Record: కరీంనగర్ జిల్లాలో 7,92,922 మందికి టీకాలు వేయాలని లక్ష్యంగా నిర్ధారించగా.. మొదటి డోస్‌ లక్ష్యానికి మించి 104 శాతం మందికి వేశారు. ఇప్పటివరకు 8,27,103 డోసులు పంపిణీ చేశారు. ఇదే స్ఫూర్తితో సెకండ్‌ డోస్‌ సైతం రికార్డు స్థాయిలో పూర్తి చేశారు. మంగళవారం నాటికి జిల్లాలో 7,94,404 మందికి రెండో డోస్‌ పంపిణీ చేసి 100 శాతం అధిగమించిన తొలి జిల్లాగా రికార్డు సృష్టించారు. ఈ సందర్భంగా వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌ రావు హర్షం వ్యక్తం చేశారు. కరీంనగర్‌ జిల్లా అధికారులను, సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు. తెలంగాణతోపాటు దక్షిణాది రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచారని ప్రశంసించారు. ముఖ్యమంత్రి కేసీఅర్ ఆదేశాల ప్రకారం, రాష్ట్రంలోని అన్ని జిల్లాలు ఇదే స్ఫూర్తితో వందశాతం లక్ష్యాన్ని పూర్తి చేయాలని పిలుపునిచ్చారు. ఆ తర్వాత స్థానాల్లో ఖమ్మం, యాదాద్రి భువనగిరి జిల్లాలు ఉన్నాయి.

లక్ష్యానికి మించి..

మొదటి డోస్‌ విషయంలో తెలంగాణ ఇప్పటికే 100 శాతం లక్ష్యాన్ని అధిగమించింది. జిల్లాల వారీగా పరిశీలించగా.. నిజామాబాద్‌, సూర్యాపేట, కామారెడ్డి, కుమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లాల్లో వందశాతం పూర్తయితే అన్ని జిల్లాలు వందశాతం పూర్తయిన రికార్డు సొంతం కానుంది. రాష్ట్రంలో 18 ఏండ్లకు పైబడి 2.77 కోట్ల మందికి వ్యాక్సిన్‌ వేయాలని కేంద్రం లక్ష్యం నిర్ధారించగా.. రాష్ట్రంలో ఇప్పటివరకు మొదటి డోస్‌ 2.88 కోట్ల మందికి వేశారు. లక్ష్యానికి మించి 104 శాతం వ్యాక్సినేషన్‌ రాష్ట్రంలో పూర్తయింది.

సమష్టి కృషి.. ప్రత్యేక కార్యాచరణ

కరోనా నుంచి ప్రజల్ని కాపాడే క్రమంలో జిల్లాలో వ్యాక్సినేషనే రక్ష అని గుర్తించిన ఇక్కడి యంత్రాంగం ఈ దిశగా సమష్టి కృషితో ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది. జిల్లా కలెక్టర్​ కర్ణన్​, డీఎంహెచ్​వో జువేరియా, ఇతర సిబ్బంది విశేష కృషితో లక్ష్యాన్ని విజయవంతంగా సాధించింది. రాష్ట్రంలో రెండో డోసును నూరు శాతం పూర్తిచేసిన జిల్లాగా ఆ ఘనతను నేడు వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్​రావు, మంత్రి గంగుల కమలాకర్​ అధికారికంగా ప్రకటించనున్నారు. ఇందుకు సంబంధించి కరీంనగర్​లో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details