తెలంగాణ

telangana

Dalitha bandhu: 'అర్హులందరికీ దళిత బంధు.. ఎవరూ ఆందోళన చెందొద్దు'

By

Published : Aug 14, 2021, 5:53 PM IST

అర్హులైన వారందరికీ దళిత బంధు అందజేస్తామని.. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సీఎస్​ సోమేశ్​కుమార్​ తెలిపారు. గ్రామ సభల ద్వారా దళిత బంధు సాయాన్ని పంపిణీ చేస్తామని వెల్లడించారు. దళిత బంధు పథకం, హుజూరాబాద్‌లో ఈ నెల 16న జరగనున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ బహిరంగ సభ ఏర్పాట్లపై మంత్రులు హరీశ్‌రావు, గంగుల కమలాకర్‌, కొప్పుల ఈశ్వర్‌తో పాటు సీఎస్‌ సమీక్షించారు.

Dalitha bandhu: 'అర్హులందరికీ దళిత బంధు.. ఎవరూ ఆందోళన చెందొద్దు'
Dalitha bandhu: 'అర్హులందరికీ దళిత బంధు.. ఎవరూ ఆందోళన చెందొద్దు'

అర్హులైన ప్రతి కుటుంబానికీ దళిత బంధు అందజేస్తామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్​కుమార్ పేర్కొన్నారు. ఎవరూ ఆందోళన చెందవద్దని సూచించారు. కరీంనగర్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో దళిత బంధు పథకం, సీఎం కేసీఆర్​ బహిరంగ సభ ఏర్పాట్లపై ఆర్థిక శాఖ మంత్రి హరీశ్​రావు, మంత్రులు గంగుల కమలాకర్‌, కొప్పుల ఈశ్వర్​తో పాటు సీఎస్ సమీక్షించారు.​

ఈ సందర్భంగా దళితబంధు పథకాన్ని హుజూరాబాద్ నియోజకవర్గంలో పైలెట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్నామని సీఎస్​ తెలిపారు. భవిష్యత్తులో పథకాన్ని మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు ప్రాజెక్టులో తలెత్తిన సమస్యలను గుర్తించి.. మార్గదర్శకాలు రూపొందించుటకు ఇది ఉపయోగపడుతుందని చెప్పారు. ఈ నెల 16న ముఖ్యమంత్రి కేసీఆర్​ హుజూరాబాద్ నియోజకవర్గంలో ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారన్న సీఎస్.. ప్రారంభ కార్యక్రమంలో 15 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి దళితబంధు చెక్కులను అందజేస్తారని వివరించారు.

పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక..

దళిత బంధు డబ్బులతో లబ్ధిదారులు తమ అనుభవం, నైపుణ్యం దృష్ట్యా వారికి ఇష్టమైన ఒక యూనిట్​ను ఎన్నుకొని నెలకొల్పుకోవాలని సీఎస్​ సూచించారు. ఈ పథకం అమలుకు గ్రామ స్థాయి, మండల స్థాయి, నియోజక వర్గం స్థాయి, జిల్లా స్థాయి కమిటీలను ఏర్పాటు చేస్తామని ఆయన తెలిపారు. సీనియర్ ప్రత్యేక అధికారులు, గ్రామ సర్పంచ్, ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు, దళితుల సమక్షంలో గ్రామ సభలు నిర్వహించి పారదర్శకంగా లబ్ధిదారులను ఎంపిక చేస్తామని వివరించారు. లబ్ధిదారుల జాబితాను గ్రామ పంచాయతీ కార్యాలయం బోర్డుల్లో ప్రదర్శిస్తారన్నారు. ఈ పథకాన్ని ముందుగా అతి నిరుపేద కుటుంబాలకు, తర్వాత దళిత కుటుంబాలందరికీ అందిస్తామని స్పష్టం చేశారు.

దళిత బంధుతో పాటు దళిత రక్షణ నిధి..

హుజూరాబాద్​ నియోజకవర్గంలోని 107 గ్రామాల్లో సమగ్ర కుటుంబ సర్వే వివరాల ప్రకారం ప్రతి గ్రామంలో, వార్డుల్లో గ్రామ సభలు నిర్వహించి లబ్ధిదారులను ఎంపిక చేస్తామని షెడ్యూల్డ్​ కులాల కార్యదర్శి రాహుల్​ బొజ్జా పేర్కొన్నారు. గ్రామంలో అందరూ ఒకే స్కీమ్ కాకుండా వారి ఆసక్తి, అభిరుచి, వృత్తి నైపుణ్యాలను బట్టి వేర్వేరు స్కీములు ఎంపిక చేసుకోవాలని సూచించారు. దళిత బంధు లబ్ధిదారులు దురదృష్టవశాత్తు చనిపోతే.. వారిని ఆదుకునేందుకు వీలుగా దళిత రక్షణ నిధినీ ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ రక్షణ నిధికి లబ్ధిదారుల వాటా, రాష్ట్ర ప్రభుత్వం ద్వారా వాటా ఉంటుందని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details