తెలంగాణ

telangana

Huzurabad By Election Campaign: జోరుగా హుజూరాబాద్ ఉపఎన్నిక ప్రచారం

By

Published : Oct 16, 2021, 10:54 PM IST

బతుకమ్మ, దసరా విరామం తర్వాత హుజూరాబాద్‌ ఉపఎన్నిక ప్రచారం (Huzurabad by election campaign) మళ్లీ జోరందుకుంది. తెరాస, భాజపా, కాంగ్రెస్‌ అభ్యర్థులు ఓటర్లను కలిసి తమను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఆత్మగౌరవం కోసం తనకు ఓటు వేయాలని భాజపా అభ్యర్థి ఈటల రాజేందర్‌, సంక్షేమ పాలనకు మద్దతివ్వాలని తెరాస అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌ ప్రచారం చేస్తున్నారు. నిరుద్యోగుల్ని మోసం చేస్తున్న రెండు పార్టీలకు బుద్ధి చెప్పాలంటూ కాంగ్రెస్‌ అభ్యర్థి బల్మూరి ఓటర్లను కోరుతున్నారు.

Campaign
ఉపఎన్నిక ప్రచారం

జోరుగా హుజూరాబాద్ ఉపఎన్నిక ప్రచారం

తెరాస అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌యాదవ్‌ హుజూరాబాద్‌ ఉపఎన్నికల ప్రచారం(Huzurabad by election campaign)లో దూసుకుపోతున్నారు. హనుమకొండ జిల్లా శంభునిపల్లి, కానిపర్తి, దేశరాజులపల్లిలో పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, మాజీ మంత్రి పెద్దిరెడ్డితో కలిసి ప్రచారం చేశారు. తనను గెలిపిస్తే నియోజకవర్గ ప్రజల సమస్యలన్నీ తీర్చుతామని... కారు గుర్తుకే ఓటు వేయాలని కోరారు. తెరాసకు ద్రోహం చేసిన ఈటలకు ఉపఎన్నికలో బుద్ధిచెప్పాలని గెల్లు శ్రీనివాస్‌యాదవ్‌ కోరారు.

ఈటల సవాల్...

హుజూరాబాద్‌ ఉపఎన్నిక(Huzurabad by election campaign)లో తెరాసకు దీటుగా భాజపా అభ్యర్థి ఈటల రాజేందర్‌ విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. హనుమకొండ జిల్లా కమలాపూర్‌ మండలం గుండేడు, కొత్తపల్లిలో ఓటర్లను కలిశారు. గ్రామస్థులు ఈటలకు మంగళహారతులతో స్వాగతం పలికారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఓట్లు ఉంటేనే ప్రజలు గుర్తుకు వస్తారని...లేదంటే జనాన్ని పట్టించుకోరని ఈటల ఆరోపించారు. సానుభూతి కోసం దాడి చేయించుకుంటానని తనపై దుష్ప్రచారం చేశారని.. అంతటి నీచానికి తెరాస నేతలు దిగజారారని దుయ్యబట్టారు. తాను ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానన్న ఈటల... గెలిస్తే సీఎం కేసీఆర్‌ శాసనసభకు రాకూడదని సవాల్‌ విసిరారు.

వెంకట్ ప్రచారం...

కాంగ్రెస్ అభ్యర్థి బల్మూరి వెంకట్ (Congress Candidate Balmuri Venkat) ప్రజలతో మమేకమవుతున్నారు. హుజూరాబాద్‌లో ములుగు ఎమ్మెల్యే సీతక్కతో కలిసి ఇంటింటి ప్రచారం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలు అమలు చేస్తున్నాయని వెంకట్‌ ఆరోపించారు. నిరుద్యోగ సమస్యను భాజపా, తెరాస పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. యువత గొంతునై పోరాడేందుకు హుజూరాబాద్‌లో తనను గెలిపించాలని బల్మూరి వెంకట్‌ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.

దూరంగా...

హుజూరాబాద్‌ ఉపఎన్నికలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు సీపీఐ ప్రకటించింది. తెరాస, భాజపా ప్రచార తీరు అత్యంత జుగుప్సాకరంగా ఉందని...అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈనెల 30న హుజూరాబాద్‌ ఉపఎన్నిక పోలింగ్‌ జరగనుండగా... వచ్చేనెల 2న ఫలితాలు వెలువడనున్నాయి.

ఇదీ చూడండి:huzurabad by election: హుజూరాబాద్​ ఉపఎన్నిక ప్రచారం.. ఆద్యంతం విమర్శల పర్వం

Trs Complaints On Etela: ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని ఈటలపై కేసులు

Huzurabad Campaign: ఎన్ని కేసులుంటే అంత గొప్ప... హుజూరాబాద్​లో విచిత్ర పరిస్థితి!

ABOUT THE AUTHOR

...view details