తెలంగాణ

telangana

Double Bedroom Houses : తెలంగాణకే ఆదర్శంగా.. బాన్సువాడ డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లు

By

Published : Jul 19, 2023, 7:44 PM IST

Double Bedroom Houses In Telangana : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రతిష్ఠాత్మక పథకం.. 2పడక గదుల ఇళ్ల నిర్మాణం. రాష్ట్రవ్యాప్తంగా ఎలా ఉన్నా కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గంలో మాత్రం ఈ పథకం విజయవంతమైంది. 11,000 పైచిలుకు ఇళ్లు నిర్మించడమే కాక.. 9000 ఇళ్లను లబ్ధిదారులకు సైతం ఇప్పటికే అందించడమూ పూర్తి అయింది. ఇదే సమయంలో రాష్ట్రప్రభుత్వం కొత్తగా తెచ్చిన గృహలక్ష్మి అమలుకూ బాన్సువాడ నమూనాగా నిలవనుంది. ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి ప్రత్యేకచొరవతో ఇళ్ల నిర్మాణం జరిగింది. రాష్ట్రంలోనే అనేక నియోజకవర్గాలకు ఆదర్శంగా నిలుస్తోన్న .. బాన్సువాడ రెండు పడక గదుల ఇళ్ల గురించి ఇప్పుడు చూద్దాం.

Bansuwada
Bansuwada

తెలంగాణకే ఆదర్శంగా.. బాన్సువాడ డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లు

Highest Double Bedroom Houses In Bansuwada : తెలంగాణ రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలోనూ రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణం జరిగినా ఆశించిన స్థాయిలో ముందుకెళ్లలేదు. గుత్తేదారులు ముందుకు రాకపోవడం, తగినంత ప్రభుత్వ స్థలం లేకపోవడం, లేదంటే ఇతర కారణాలతో చాలా చోట్ల నిర్మాణాలు నెమ్మదించాయి. ఒక వేళ నిర్మాణం పూర్తైనా అర్హులు ఎక్కువ మంది ఉండటంతో.. పంపిణీలలో జాప్యం జరుగుతోంది. కానీ, వీటన్నింటికి భిన్నంగా కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గం ఉంది. రాష్ట్రంలోనే అత్యధికంగా ఈ నియోజకవర్గానికి 2పడక గదుల ఇళ్లు మంజూరయ్యాయి. అత్యధికంగా నిర్మాణం పూర్తి చేసుకున్న ఇళ్లు కూడా ఈ నియోజకవర్గంలోనే ఉన్నాయి.

రాష్ట్ర ప్రభుత్వం రెండు పడక గదుల ఇళ్ల పథకం ప్రారంభించినప్పుడు అందరిలాగే బాన్సువాడకూ 1400 ఇళ్లు మంజూరయ్యాయి. స్పీకర్‌ పోచారం శ్రీనివాసరెడ్డి చొరవతో మంజూరైన ఇళ్ల నిర్మాణం త్వరత్వరగా పూర్తయింది. ఇళ్లు పూర్తి కాగానే వాటిని చూశాక మిగతా పేద ప్రజలంతా తమకూ ఇళ్లు కావాలని స్పీకర్‌కు విన్నవించుకున్నారు. మొదట మంజూరైన నిర్మాణాలు పూర్తి కాగానే లబ్ధిదారులకు పంపిణీ చేసి మళ్లీ ఇళ్లు కావాలని సీఎం కేసీఆర్‌కు స్పీకర్‌ విజ్ఞప్తి చేశారు. మళ్లీ వెయ్యి ఇళ్లు ఇవ్వగా.. వాటినీ పూర్తి చేసి మళ్లీ కావాలని అడిగారు. ఇలా ఒక్క నియోజకవర్గానికే 11,000 ఇళ్లు మంజూరు కాగా.. 9000లకు పైగా ఇళ్ల నిర్మాణం పూర్తై లబ్ధిదారులకు అందించారు.

Double Bedroom Houses In Bansuwada : అలా ఇప్పుడు బాన్సువాడ నియోజకవర్గంలో పేదవాడి ఆత్మగౌరవానికి డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లు ప్రతీకగా నిలుస్తున్నాయి. తాడ్కోల్‌ శివారులో ఏకంగా 1,004 ఇళ్లు పూర్తి కావడంతో పాటు గృహ ప్రవేశాలు కూడా పూర్తయ్యాయి. దీంతో అదో గ్రామంగా మారింది. దానికి కేసీఆర్‌ నగర్‌.. పీఎస్‌ఆర్‌ కాలనీగా నామకరణం చేశారు. 28 ఎకరాల్లో జీ ప్లస్‌-1 పద్ధతిలో ఇళ్లు నిర్మించారు. ఇక్కడ భూమి విలువతో కలిపితే ఒక్కో డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇంటి విలువ రూ.20 లక్షల నుంచి రూ.25లక్షల రూపాయల వరకు ఉంటుంది అంచనా. 1000ఇళ్లకు మొత్తం రూ.200 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసింది. ఒక్క బాన్సువాడ పట్టణంలోనే 2,400 పైచిలుకు ఇళ్లను నిర్మించారు.

బాన్సువాడ నియోజకవర్గం నిజామాబాద్, కామారెడ్డి రెండు జిల్లాల పరిధిలో ఉంటుంది. కొన్ని మండలాలు కామారెడ్డి, మరికొన్ని మండలాలు నిజామాబాద్ జిల్లాలో ఉన్నాయి. దీంతో 2 జిల్లాల అధికారులను సమన్వయం చేసుకుంటూ ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేశారు. నిజామాబాద్ జిల్లా పరిధిలో వర్ని మండలంలో 1137, రుద్రూర్‌ మండలంలో 898, కోటగిరి మండలంలో 2,197, మోస్రా మండలంలో 361, చందూర్‌ మండలంలో 386 ఇళ్లు నిర్మించారు. ఇక కామారెడ్డి జిల్లా పరిధిలో బాన్సువాడ పట్టణం, గ్రామీణ మండలంలో 3906 ఇళ్లు, బీర్కూర్‌ మండలంలో 1044, నస్రుల్లాబాద్ మండలంలో 888 ఇళ్లు నిర్మించారు.

బాన్సువాడలో సొంత జాగాలో 7000 ఇళ్లు నిర్మాణం :రాష్ట్రంలో ఎక్కడా సొంత స్థలంలో ఇళ్లు నిర్మించుకునేందుకు అనుమతి ఇవ్వలేదు. కానీ, బాన్సువాడ నియోజకవర్గంలో ఏకంగా 7000 వరకు సొంత స్థలంలో ఇళ్లు నిర్మించుకున్నారు. పట్టణప్రాంతాల్లో ఇంటి నిర్మాణానికి రూ.5.30లక్షలు, గ్రామీణ ప్రాంతాల్లో నిర్మాణానికి రూ.5.04లక్షలు చొప్పున మంజూరు చేశారు. ఇదంతా స్పీకర్ పోచారం ప్రత్యేక చొరవ తీసుకుని సీఎంను ఒప్పించడం వల్లే జరిగిందని నియోజకవర్గ ప్రజలు చెబుతున్నారు. అందుకే చాలా మంది నియోజకవర్గాల ప్రజాప్రతినిధులు, అధికారులు బాన్సువాడ నియోజకవర్గానికి వచ్చి సొంత స్థలంలో ఇళ్ల నిర్మాణ సాధ్యాసాధ్యాలను పరిశీలించారు.

"కొత్తగా రాబోతున్న ఇళ్లు గృహలక్ష్మీ. ఈ ఇళ్లకు టెండరు ఉండదు. ఆబిడ్డ పేరు మీద ఇళ్లు మంజూరు అవుతుంది. రూ.3 లక్షలు మూడు విడతలుగా పేమెంట్‌ అవుతుంది. దీనికి బెస్‌మెంట్‌కు రూ.1 లక్ష, స్లాబ్‌కు రూ.1 లక్ష, ఇళ్లు మొత్తం పూర్తి అయిన తర్వాత రూ.1 లక్ష ఇస్తారు. ప్రతి నియోజకవర్గానికి 3000 ఇళ్లు సీఎం కేటాయించారు. ఎవరైతే బాన్సువాడ నియోజకవర్గంలో రూ.3 లక్షలతో ఇళ్లు కట్టుకుంటామని అంటారో వారికి ఇళ్లు మంజూరు చేస్తాం."- పోచారం శ్రీనివాసరెడ్డి, శాసనసభ స్పీకర్

గత ఎన్నికలకు ముందు సీఎం కేసీఆర్‌.. సొంత స్థలంలో ఇళ్ల నిర్మించుకునేందుకు ఆర్థిక సాయం చేస్తామని ప్రకటించారు. ఇందుకు అనుగుణంగా ఇటీవల గృహలక్ష్మి పేరుతో ఆ పథకాన్ని ప్రభుత్వం అమలు చేయబోతోంది. ఇటీవలే మంత్రిమండలి ఆమోదం తెలపగా.. జీవో సైతం విడుదలైంది. ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఇళ్లను ప్రభుత్వం మంజూరు చేశారు. ఈ పథకానికి ఇప్పుడు బాన్సువాడ ఆదర్శంగా నిలుస్తోంది.

ఇవీ చదవండి :

ABOUT THE AUTHOR

...view details