తెలంగాణ

telangana

KTR TOUR: నేడు గద్వాల జిల్లాకు మంత్రి కేటీఆర్.. కట్టుదిట్టమైన ఏర్పాట్లు

By

Published : Sep 14, 2021, 4:23 AM IST

KTR TOUR: నేడు గద్వాల జిల్లాకు మంత్రి కేటీఆర్.. కట్టుదిట్టమైన ఏర్పాట్లు

పురపాలక శాఖ మంత్రి కేటీఆర్​ నేడు జోగులాంబ గద్వాల జిల్లాలో పర్యటించనున్నారు. రూ.106 కోట్ల విలువైన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొననున్నారు. ఇందుకోసం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. మరోవైపు జిల్లాకు ఇప్పటి వరకూ ఇచ్చిన హామీలు ఏ ఒక్కటీ నెరవేర్చలేదని.. కేటీఆర్​కు జిల్లాకు వచ్చే నైతిక అర్హత లేదంటూ విపక్ష నేతలు నిరసన గళం వినిపిస్తున్నారు.

జోగులాంబ గద్వాల జిల్లాలోని అలంపూర్, గద్వాల నియోజకవర్గాల్లో పురపాలకశాఖ మంత్రి కేటీఆర్​ ఇవాళ పర్యటించనున్నారు. హైదరాబాద్​ నుంచి హెలికాప్టర్​ ద్వారా అలంపూర్​ చేరుకోనున్న కేటీఆర్.. తొలుత 100 పడకల ఆస్పత్రికి శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం జూరాల పార్కు శంకుస్థాపన చేస్తారు. ఆ తర్వాత గునుపాడులో పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు.

అనంతరం గద్వాలలో కళాశాలలు, గ్రంథాలయాల భవనాలు, సీసీ రోడ్లు తదితర కార్యక్రమాలకు మంత్రి శంకుస్థాపన చేస్తారు. ప్రభుత్వ మహిళా పీజీ కళాశాల, వసతి గృహంతో పాటు పట్టణంలో పూర్తైన ఆర్వోబీని ప్రారంభిస్తారు. అనంతరం మార్కెట్ యార్డులోని బహిరంగ సభలో మంత్రి ప్రసంగిస్తారు. కేటీఆర్ పర్యటనకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కార్యక్రమం విజయవంతం చేయాలని ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్​రెడ్డి పిలుపునిచ్చారు.

విపక్షాల నిరసనలు..

కేటీఆర్​ పర్యటన నేపథ్యంలో కొన్ని రోజులుగా విపక్షాలు నిరసనలు కొనసాగిస్తున్నాయి. 2014 నుంచి పలుమార్లు గద్వాల నియోజకవర్గంలో పర్యటించిన కేటీఆర్​, కేసీఆర్​.. ఇప్పటి వరకు ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని విపక్షాలు విమర్శిస్తున్నాయి. తుమిళ్ల ఎత్తిపోతల, జూరాల ఆయకట్టు విస్తరణ, గుర్రంగడ్డ వంతెన, గట్టు ఎత్తిపోతల హామీలు నీటిమూటలుగానే మిగిలిపోయాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గద్వాల ప్రజల చిరకాల వాంఛ అయిన వైద్య కళాశాలను నేటి పర్యటనలో ప్రకటించాలని గద్వాల మాజీ ఎమ్మెల్యే భరత సింహారెడ్డి డిమాండ్ చేశారు. టెక్స్​టైల్​ పార్కు సహా శంకుస్థాపనలు చేసిన పనులను పూర్తి చేశాకే.. కేటీఆర్​ జిల్లాకు రావాలని ఏఐసీసీ కార్యదర్శి సంపత్​కుమార్​ విమర్శించారు.

కార్యక్రమాన్ని బహిష్కరిస్తూ తీర్మానం..

మరోవైపు అలంపూర్​ చౌరస్తాలో కేటీఆర్ పాల్గొనే​ కార్యక్రమాన్ని బహిష్కరిస్తున్నామని మండల మున్సిపల్​ ఛైర్మన్​ మనోరమ, మండల తెరాస కార్యకర్తలు తీర్మానం చేశారు. వంద పడకల ఆసుపత్రిని అలంపూర్​ పట్టణానికి కేటాయిస్తూ జీవో విడుదలైనా.. జీవోకు విరుద్ధంగా అలంపూర్​ చౌరస్తాలో ఆస్పత్రికి శంకుస్థాపన చేయటాన్ని నిరసిస్తూ కార్యక్రమాన్ని బహిష్కరిస్తునట్లు స్పష్టం చేశారు.

ఇదీ చూడండి: మహిళా​ కానిస్టేబుల్​ రాజీనామా.. ఇన్​స్టాలో ఆ వీడియో వల్లే!

ABOUT THE AUTHOR

...view details