తెలంగాణ

telangana

ప్రకృతి వరం.. సీతాఫలం.. ధర ప్రియం

By

Published : Oct 12, 2020, 2:06 PM IST

శీతాకాలంలో ప్రత్యేకత కలిగిన పండ్లల్లో సీతాఫలం ఒకటి. సీజన్‌ ఆరంభం కాకముందే ఈ ఏడాది మార్కెట్లోకి వచ్చేశాయి. కొనుగోలుదారుల జేబులు గుల్ల చేసేలా ధరలూ అధికంగానే పలుకుతున్నాయి. గతేడాది వర్షాలు అంతంత మాత్రమే పడడంతో సీజన్‌ ఆరంభమైనా సమృద్ధిగా లభించలేదు. ఈ ఏడాది అనుకూల సమయంలో వర్షాలు పడడంతో సీజన్‌కు ముందే మార్కెట్లోకి వచ్చాయి. రావడంతో కొనుగోలుదారులు వీటిని కొనుగోలు చేసేందుకు మొగ్గు చూపుతున్నారు.

Custard apple are available at higher price
సీతాఫలం.. ధర ప్రియం

ఏ సీజన్‌లో తినాల్సినవి ఆ సీజన్‌లో తినాలనే కోరిక ప్రజల్లో బలంగా ఉండడంతో ధర ఎక్కువైనా ఎక్కువ ఆసక్తి కనబరుస్తున్నారు. అసలే కరోనా సమయం కావడంతో రోగ నిరోధక శక్తిని పెంపొందించడంలో ఈ ఫలం ఎంతగానో తోడ్పడుతుందని వైద్యులు సూచిస్తుండడంతో అందరినీ ఆకట్టుకుంటోంది. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా కొనుగోలు చేస్తున్నారు.

మండలాల నుంచి మార్కెట్‌కు..

జనగామ ప్రభుత్వ ఆసుపత్రికి ఎదురుగా ఏర్పడిన మార్కెట్‌కు వివిధ మండలాలతో పక్క జిల్లా నుంచి కూడా సీతాఫలాలు పోటెత్తుతున్నాయి. మండలాల్లోని వివిధ గ్రామాల నుంచి వీటిని సేకరిస్తున్నారు. మూడు నెలలపాటు ఉండే సీజన్‌లో రోజుకు రూ.లక్షల్లో వ్యాపారం జరగడం విశేషం. మండలాల నుంచి తీసుకొచ్చిన ఫలాలను గుత్తేదారులు కొనుగోలు చేసి ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేసి అధిక లాభాలను పొందుతున్నారు. వ్యాపారులు సైతం పొద్దంతా కూర్చొని అమ్మడం కంటే గుత్తేదారులతో ఒప్పందం కుదుర్చుకొని గిట్టుబాటు ధరకు విక్రయిస్తున్నారు. ఇప్పటికే పలు గ్రామాల నుంచి 50 శాతం మేర విక్రయాలు జరిగాయని వ్యాపారులు చెబుతున్నారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది కలిసొచ్చిందని చెబుతున్నారు.

కొనలేని స్థితిలో పేదోడి యాపిల్‌..

ప్రస్తుతం మార్కెట్లో ఉన్న పండ్ల కంటే ఎక్కువ ఆదరణను కూడగట్టుకుంటోంది సీతాఫలం. రోజురోజుకు వినియోగం ఎక్కువవుతుండడంతో ధరలు అమాంతం పెరిగిపోతున్నాయి. పండిన పండ్లకో ధర, కాయలకో ధర చొప్పున డబ్బాల లెక్కన విక్రయిస్తున్నారు. పండ్ల డబ్బా గరిష్ఠంగా రూ.450 వరకు పలుకుతోంది. మళ్లీ ఇందులో చిన్నవి, పెద్దవిగా విభజించి పరిమాణానికి తగ్గట్టుగా ధరలను నిర్ణయించి విక్రయిస్తున్నారు. చిరు వ్యాపారులైతే ప్రధాన రహదారుల వెంట బుట్టల్లో పెట్టుకొని మరీ అమ్ముతున్నారు. సమృద్ధిగా కురిసిన వర్షాలతో ఈ ఫలం పలువురు వ్యాపారులకు ఆదాయంపై భరోసానిచ్చింది. కాకపోతే పేదోడి యాపిల్‌గా చెప్పుకునే సీతాఫలాలు మాత్రం వారు కొనలేని స్థితిలో పెరిగిపోయాయి.

ABOUT THE AUTHOR

...view details