తెలంగాణ

telangana

రైతన్నలకు శుభవార్త.. రైతుబంధు విడుదల తేదీ ఇదే..

By

Published : Dec 18, 2022, 4:49 PM IST

Updated : Dec 19, 2022, 6:58 AM IST

Rythubandhu
Rythubandhu

16:45 December 18

యాసంగి రైతుబంధు నిధులు ఈ నెల 28 నుంచి విడుదల

RYTHUBANDHU :ప్రస్తుత యాసంగికి సంబంధించి రైతులకు ఈ నెల 28 నుంచి రైతుబంధు సాయం అందనుంది. ఈ మేరకు పథకం కింద రూ.7,600 కోట్ల నిధులను విడుదల చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదివారం ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావును ఆదేశించారు. ఎప్పటి మాదిరిగానే ఎకరం నుంచి ప్రారంభించి సంక్రాంతి కల్లా రైతులందరి ఖాతాల్లో జమ చేయాలని సూచించారు. కేంద్రం ఎన్ని ఆటంకాలు కల్పించినా జాప్యం, కోతలు లేకుండా నిధులను విడుదల చేయడం రైతాంగం, వ్యవసాయంపై తమ చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు. రైతు బంధు పథకం ద్వారా రైతులకు వానాకాలం, యాసంగి రెండు కాలాలకు కలిపి ఎకరానికి రూ.పది వేల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న విషయం తెలిసిందే.

పంట పెట్టుబడిని అందించడం దేశ వ్యవసాయ రంగంలో సత్ఫలితాలిస్తోందని సీఎం ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఉచిత సాగునీరు, విద్యుత్తుతో పాటు రైతు బీమా, సాగు కోసం నేరుగా రైతు ఖాతాలో పెట్టుబడిని అందించడం ద్వారా తెలంగాణ వ్యవసాయంలో విప్లవాత్మక పరిణామం చోటు చేసుకుందన్నారు. తెలంగాణ ప్రభుత్వ వ్యవసాయ అనుకూల కార్యాచరణ దేశానికి ఆదర్శంగా నిలవడమే కాకుండా దేశ వ్యవసాయరంగ నమూనా మార్పునకు దారితీసిందని అన్నారు. ఇక్కడి వ్యవసాయ అనుకూల దార్శనిక నిర్ణయాలు ధాన్యం ఉత్పత్తిలో రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామిగా నిలిపాయని సీఎం పేర్కొన్నారు. దేశ రైతాంగ సంక్షేమానికి, వ్యవసాయ ప్రగతికి బాటలు వేసే దిశగా పక్క రాష్ట్ర ప్రభుత్వాలను, కేంద్రాన్ని ప్రభావితం చేస్తున్నాయన్నారు.

రూ.40 వేల కోట్ల నిధులను కేంద్ర ప్రభుత్వం నిలిపివేసినా..

వివిధ మార్గాల ద్వారా రాష్ట్రానికి హక్కుగా రావాల్సిన రూ.40 వేల కోట్లను కేంద్రం తొక్కిపెట్టి ఆర్థికంగా ఇబ్బందులకు గురిచేస్తోందని సీఎం కేసీఆర్‌ ఆరోపించారు. అయినప్పటికీ రైతుల సంక్షేమం, వ్యవసాయరంగ అభివృద్ది విషయంలో రాజీ పడకుండా రైతు బంధు నిధులను సకాలంలో రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తోందన్నారు. ఈసారి ఎలాంటి కోతలు లేకుండా రైతులందరికీ పూర్తి స్థాయిలో నిధులు జమ చేయనున్నట్లు పేర్కొన్నారు.

రైతుబంధు దేశానికే ఆదర్శం

రైతుబంధు దేశానికే ఆదర్శమని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. పదోవిడతగా రైతుబంధు సాయం కింద 65 లక్షల మంది పైచిలుకు రైతుల ఖాతాల్లో రూ.7,600 కోట్లను జమ చేయనున్నట్లు ఆదివారం ఆయన మీడియాకు తెలిపారు. ప్రస్తుతం రైతుల ఖాతాల్లో వేేయనున్న నిధులతో కలిపి ఇప్పటికి మొత్తం దాదాపు రూ.66వేల కోట్లు ప్రభుత్వం విడుదల చేసిందన్నారు. నేరుగా రైతుల ఖాతాల్లో నిధులు జమ చేస్తున్న మొట్టమొదటి పథకం దేశంలో ఇదేనన్నారు. అన్నం పెట్టే రైతు అప్పులపాలు కాకూడదని, యాచించే స్థితిలో కాదు శాసించే స్థాయిలో ఉండాలన్నదే సీఎం కేసీఆర్‌ ఆకాంక్ష అన్నారు. ఈ సందర్భంగా ఆయనకు అన్నదాతల పక్షాన నిరంజన్‌రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. - వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి

ఇవీ చూడండి..

నష్టాల్లో రాష్ట్ర విద్యుత్‌ పంపిణీ సంస్థలు.. కొనుగోలుకు రూ.16 వేల కోట్లు

'ఈశాన్య రాష్ట్రాలను విభజించే కుట్ర.. మేమే వాటిని అడ్డుకుంటున్నాం'

Last Updated : Dec 19, 2022, 6:58 AM IST

ABOUT THE AUTHOR

...view details