తెలంగాణ

telangana

'దుబ్బాకతోనే తెరాస పతనం.. గ్రేటర్​లోనూ అదే పునరావృతం'

By

Published : Nov 17, 2020, 6:46 PM IST

Updated : Nov 17, 2020, 7:10 PM IST

మేయర్ పీఠమే లక్ష్యంగా భాజపా బరిలోకి దిగుతోందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. భాజపాకు మద్దతు ఇవ్వాలని నగర ప్రజలకు విజ్ఞప్తి చేశారు. దుబ్బాక నుంచి తెరాస పతనం ప్రారంభమైందని... ఆ ఫలితాలే జీహెచ్​ఎంసీలో పునరావృతమవుతాయని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల్లో జనసేనతో కలిసి పోటీచేయడంపై చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు.

kishan reddy
kishan reddy

తెరాస ఐదేళ్ల పనితీరుపై ప్రజలు తీర్పు ఇవ్వాల్సిన అవసరం ఉందని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్​ రెడ్డి అన్నారు. గ్రేటర్ హైదరాబాద్​లో తెరాస సాధించింది ఏంటో చెప్పాలని డిమాండ్​ చేశారు. గత ఎన్నికల్లో తెరాస అనేక హామీలు ఇచ్చి విస్మరించిందని విమర్శించారు. సికింద్రాబాద్ అసెంబ్లీని దత్తత తీసుకుంటున్నానని చెప్పిన ముఖ్యమంత్రి ఎప్పుడైనా సమీక్షించారా అని ప్రశ్నించారు.

ఆ పాపం వాళ్లదే

హైదరాబాద్ ఎట్లా ఉండాలో చూపిస్తానని కేసీఆర్ ప్రగల్భాలు పలికారని కిషన్​ రెడ్డి ఎద్దేవా చేశారు. కేసీఆర్ పుణ్యమా అని పాత బస్తీకి మెట్రో పోలేదని ఆరోపించారు. పాతబస్తీకి మెట్రో వెళ్లకుండా తెరాస, మజ్లీస్ అడ్డుకుని.. ఆ పాపం మూటగట్టుకున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎయిమ్స్ ఆసుపత్రికి భవనాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా బదిలీ చేయలేదన్నారు.

ఇంకా ఎన్నాళ్లు

తాత్కాలికమైన తాయిలాలు ఇచ్చి ఓట్లు పొందాలని తెరాస చూస్తోంది. హైదరాబాద్ ప్రజలు చైతన్య వంతులు. తండ్రి, కొడుకుల పాలనకు వ్యతిరేకంగా దుబ్బాక ఫలితాలు పునరావృతం అవుతాయి. ఎన్నికల కమిషన్ రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకుండా పని చేయాలి. అబద్ధ ప్రచారాలు ఇంకా ఎన్నాళ్లు చేస్తారు. మాటలు కోటలు దాటుతున్నయి తప్పితే చేతలు ప్రగతి భవన్ గోడలు దాటడం లేదు.

- కిషన్​ రెడ్డి

వాళ్లకు ఆర్భాటం ఎక్కువ

ఇది భాగ్యనగరమా... విషాద నగరమా అని కిషన్​ రెడ్డి ప్రశ్నించారు. తండ్రి, కొడుకుల పాలనలో అభివృద్ధి తక్కువ... ఆర్భాటం ఎక్కువని విమర్శించారు. వరదసాయాన్ని తెరాస కార్యకర్తలు గద్దల్లా తన్నుకుపోయారని ఆరోపించారు. మేయర్ పీఠం కైవసమే లక్ష్యంగా భాజపా బరిలోకి దిగుతోందని... మద్దతు ఇవ్వాలని నగర ప్రజలకు విజ్ఞప్తి చేశారు. దుబ్బాక నుంచి తెరాస పతనం ప్రారంభమైందన్నారు. గ్రేటర్ ఫలితాలతో కల్వకుంట్ల పాలనకు చరమ గీతం పాడాలని విజ్ఞప్తి చేశారు. ఎన్నికల్లో జనసేనతో కలిసి పోటీ చేసే అంశంపై చర్చించి నిర్ణయం ప్రకటిస్తామని వెల్లడించారు.

'దుబ్బాకతోనే తెరాస పతనం.. గ్రేటర్​లోనూ అదే పునరావృతం'

ఇదీ చదవండి :రేపు తెరాస పార్లమెంటరీ పార్టీ, శాసనసభాపక్ష సమావేశం

Last Updated : Nov 17, 2020, 7:10 PM IST

ABOUT THE AUTHOR

...view details