తెలంగాణ

telangana

Income Tax Slabs: కేంద్ర పద్దులో లభించని ఊరట.. వేతన జీవుల ఉసూరు

By

Published : Feb 2, 2022, 5:41 AM IST

Income Tax Slabs: కేంద్ర పద్దు 2022లో సామాన్యులకు ఎలాంటి ఊరటా లభించలేదు. ఆదాయపు పన్ను శ్లాబులను సవరిస్తారని ఎదురుచూసిన వారికి నిరాశే మిగిలింది. ఈ మేరకు కేంద్ర బడ్జెట్​లో ఎలాంటి మార్పులు, చేర్పులను ప్రతిపాదించలేదు.

union budget 2022
Income Tax Slabs

Income Tax Slabs: ఆదాయపు పన్ను శ్లాబులను సవరిస్తారని, మినహాయింపులు పెంచుతారని వేయి కళ్లతో ఎదురుచూసిన సామాన్యులకు బడ్జెట్‌లో ఎలాంటి ఊరటా లభించలేదు. వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులకు పన్ను నిబంధనల్లో ఆర్థిక మంత్రి ఎలాంటి మార్పులు, చేర్పులను ప్రతిపాదించలేదు.

సర్‌ఛార్జి తగ్గింపు

ప్రస్తుత నిబంధనల ప్రకారం షేర్లు అమ్మినప్పుడు వచ్చిన మూలధన లాభంపై సర్‌ఛార్జి 15 శాతమే విధిస్తున్నారు. ఈ నిబంధనను ఇతర ఆస్తి లావాదేవీలకు ఇప్పటివరకు వర్తింపజేయలేదు. ప్రస్తుత బడ్జెట్‌లో అన్ని రకాల మూలధన లాభాలకు గరిష్ఠంగా 15 శాతం సర్‌ఛార్జిని ప్రతిపాదించారు.

రెండేళ్లపాటు..

ప్రస్తుత నిబంధనల ప్రకారం.. ఇప్పటికే సమర్పించిన రిటర్నులను సరిదిద్దుకునేందుకు నిర్ణీత వ్యవధి మాత్రమే ఉండేది. మదింపు సంవత్సరం ముగిసిన తర్వాత రెండేళ్ల వరకూ ఈ వ్యవధిని పొడిగిస్తూ ప్రత్యేక సెక్షన్‌ 139(8ఏ)ని తీసుకొచ్చారు. ఉదాహరణకు 2021-22 మదింపు సంవత్సరానికి (2020-21 ఆర్థిక సంవత్సరం) గాను రిటర్నులలో 31.03.2024 వరకు మార్పులు చేసుకునేందుకు వీలవుతుంది. గతంలో వెల్లడించని ఆదాయాలను రిటర్నులలో దాఖలు చేసేందుకు మాత్రమే ఇది వర్తిస్తుంది. ఇందుకోసం ప్రత్యేకంగా మరో రిటర్నుల ఫారాన్ని తీసుకొస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. నష్టాలను నమోదు చేసేందుకు, అదనపు రిఫండును కోరేందుకు, రిటర్నులలో మార్పులు చేయాలంటే ఇందులో అనుమతించరు.

  • 80 డీడీ ప్రకారం.. ఇకపై దివ్యాంగుల కోసం తీసుకున్న పాలసీలో తల్లిదండ్రులు, సరక్షకులకు 60 ఏళ్లు దాటినప్పుడు యాన్యుటీ వచ్చే పాలసీలకు చెల్లించే ప్రీమియానికీ పన్ను మినహాయింపు వర్తిస్తుంది.
  • డిజిటల్‌ ఆస్తులపై.. భారతీయ, విదేశీ కరెన్సీలు కాకుండా.. డిజిటల్‌ కరెన్సీల క్రయవిక్రయ లావాదేవీలపై వచ్చిన లాభాలకు సెక్షన్‌ 115బీబీహెచ్‌ ప్రకారం 30 శాతం పన్ను చెల్లించాలి. అంతేకాకుండా వర్చువల్‌ డిజిటల్‌ ఆస్తులు బదిలీ చేసినప్పుడు సెక్షన్‌ 194 ఎస్‌ ప్రకారం 1శాతం టీడీఎస్‌ వర్తిస్తుంది. ఈ ఆస్తులను ఎవరికైనా బహుమతిగా ఇచ్చినా పన్ను చెల్లించాల్సి వస్తుంది.
  • సెక్షన్‌ 194ఐఏ ప్రకారం రూ.50 లక్షలపైన విలువున్న ఆస్తి కొన్నప్పుడు టీడీఎస్‌ 1 శాతాన్ని చెల్లించాలి. ప్రతిపాదిత నిబంధనల ప్రకారం ఆస్తి లావాదేవీల్లో చెల్లించిన మొత్తం లేదా ప్రభుత్వం నిర్ణయించిన స్టాంపు డ్యూటీ విలువపై ఏది ఎక్కువ మొత్తం ఉంటే.. దానిపై టీడీఎస్‌ వర్తిస్తుంది.

రాష్ట్ర ఉద్యోగులకు ‘ఎన్‌పీఎస్‌’ ఊరట?

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా రాష్ట్రాల ఉద్యోగులకు సామాజిక భద్రత పథకాల ఫలాలు అందించేందుకు వీలుగా మంగళవారం నాటి బడ్జెట్లో కేంద్రం కీలక ప్రతిపాదన చేసింది. జాతీయ పింఛను పథకం (ఎన్‌పీఎస్‌) కింద యజమాని వాటాగా చెల్లించే చందాను 10 నుంచి 14 శాతానికి పెంచాలని ప్రతిపాదించింది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఉద్యోగి మూలవేతనం, డీఏ మొత్తంలో 14 శాతాన్ని యజమాని వాటా కింద ఎన్‌పీఎస్‌లో జమ చేసి, ఆ మొత్తానికి ఆదాయపన్ను నుంచి మినహాయింపు ఇస్తోంది. ఇదే తరహాలో రాష్ట్ర ఉద్యోగులకూ వెసులుబాటు కల్పించాలని కేంద్రం పేర్కొంది. రాష్ట్రాలు దీన్ని అమలు చేస్తే ఉద్యోగులు లబ్ధి పొందుతారు.

ఇదీ లాభం..: రాష్ట్రంలో ఒక ఉద్యోగికి మూలవేతనం రూ.18,950 ఉంటే, డీఏ రూ.7,348గా ఉంది. ఈ మొత్తం కలిపి రూ.26,298 అవుతుంది. ఇందులో ఉద్యోగి వాటా కింద 10 శాతం అంటే నెలకు రూ.2,630 అవుతుంది. దీనికి సమానంగా యజమాని వాటా కింద 10 శాతం ప్రభుత్వం చెల్లిస్తోంది. ఈ లెక్కన నెలకు ఇద్దరి వాటాల మొత్తం రూ.5,260 ఎన్‌పీఎస్‌ ఖాతాకు వెళ్తోంది. కేంద్ర ఉద్యోగులతో సమానంగా రాష్ట్ర సర్కారు వాటా 14 శాతమైతే నెలకు రూ.3,682 అవుతుంది. అంటే.. నెలకు దాదాపు రూ.1,052 అదనంగా ప్రభుత్వ వాటా కింద ఎన్‌పీఎస్‌లో జమ అవుతుందన్న మాట. ఈ లెక్కన ఏడాదికి దాదాపు రూ.12,624 మేర రాష్ట్ర ఉద్యోగి ఎన్‌పీఎస్‌ ఖాతాలో అదనంగా వచ్చి చేరుతుంది. ఈ మొత్తానికి ఆదాయపన్ను కింద మినహాయింపు పొందే అవకాశముంది.

ఇదీచూడండి:

ABOUT THE AUTHOR

...view details