తెలంగాణ

telangana

న్యూఇయర్​ వేళ.. భాగ్యనగరంలో పోలీసుల ట్రాఫిక్​ ఆంక్షలు

By

Published : Dec 31, 2022, 6:58 AM IST

Updated : Dec 31, 2022, 10:05 PM IST

Traffic Restrictions In Hyderabad: నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో రాష్ట్ర రాజధానిలోని.. హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ కమిషనరేట్లలో పోలీసులు ఆంక్షలు విధించారు. డిసెంబరు 31 రాత్రి పది గంటల నుంచి... జనవరి 1న తెల్లవారుజాము వరకు ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి. ట్రాఫిక్‌ ఆంక్షలతో పాటు డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ తనిఖీలు.. వాహనాలు వేగంగా నిర్లక్ష్యంగా నడుపుతూ రోడ్డు ప్రమాదాలకు కారణమయ్యే వారిపై కఠిన చర్యలు తప్పవని పోలీసు అధికారులు హెచ్చరిస్తున్నారు. దీంతో పాటు పబ్‌లు, బార్​లలో మాదకద్రవ్యాలు సరఫరా కాకుండా నిఘా ఏర్పాటు చేశారు.

Traffic Restrictions In Hyderabad
Traffic Restrictions In Hyderabad

న్యూఇయర్​ వేళ.. భాగ్యనగరంలో పోలీసుల ట్రాఫిక్​ ఆంక్షలు

Traffic Restrictions In Hyderabad: కొత్త సంవత్సరానికి అంబరాన్నంటే సంబురాలతో స్వాగతం పలకడానికి.. జంటనగర వాసులు సిద్ధమవుతున్నారు. గత రెండేళ్లుగా కరోనా కారణంగా.. నూతన సంవత్సర వేడుకలు పెద్ద ఎత్తున జరుపుకోని నగర ప్రజలు.. ఈసారి భారీగానే వేడుకలు జరుపుకోవడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు అమల్లోకి తీసుకురావడంతో పాటు.. పలు నిబంధనలు విధించారు.

హైదరాబాద్‌ పోలీస్ కమిషనరేట్‌ పరిధిలోని పలు ప్రాంతాల్లో ఇవాళ రాత్రి 10 గంటల నుంచి జనవరి 1 తెల్లవారుజాము వరకు.. పైవంతెనలు మూసివేయనున్నారు. ట్రాఫిక్‌ ఆంక్షలను విధించనున్నారు. ప్రధానంగా ఎన్టీఆర్ మార్గ్‌, నెక్లెస్‌ రోడ్డు, అప్పర్‌ ట్యాంక్‌బండ్‌ రహదారుల మీద వాహనాలను అనుమతి నిలిపివేయనున్నారు. ఖైరతాబాద్‌ మీదుగా నెక్లెస్‌రోడ్డు, ఎన్టీఆర్​ మార్గ్‌ వైపు వెళ్లే వాహనాలను నిరంకారి భవన్‌, రాజ్‌భవన్‌ రోడ్డు మీదుగా మళ్లించనున్నారు. మింట్‌కాంపౌండ్‌ రహదారిని పూర్తిగా మూసివేయనున్నారు.

సికింద్రాబాద్‌ మీదుగా ట్యాంక్‌బండ్‌ వైపు వెళ్లే వాహనాలను కవాడిగూడ కూడలి మీదుగా.. లోయర్‌ ట్యాంక్‌బండ్‌ కట్టమైసమ్మ ఆలయం మీదుగా రాకపోకలు సాగించేలా ఏర్పాట్లు చేశారు. ట్రావెల్స్‌ బస్సులు, లారీలు, భారీ వాహనాలకు జనవరి 1వ తేదీ తెల్లవారుజామున రెండు గంటల వరకు.. నగర రహదారులపై తిరిగేందుకు పోలీసులు అనుమతి నిరాకరించారు. దీంతో పాటు ప్రత్యేకంగా డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ తనిఖీలు నిర్వహించనున్నారు.

డిసెంబరు 31 రాత్రి ప్రత్యేక డ్రైవ్‌లు:ట్రాఫిక్‌ ఉల్లంఘనలపై డిసెంబరు 31 రాత్రి ప్రత్యేక డ్రైవ్‌లు చేపట్టనున్నారు. డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ తనిఖీలతో పాటు వేగంగా, నిర్లక్ష్యంగా వాహనాలు నడిపే వారిపై.. చర్యలు తీసుకోవడానికి పోలీసులు సిద్ధమవుతున్నారు. సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలోని నెహ్రూ బాహ్యవలయ రహదారిపై శంషాబాద్‌ విమానాశ్రయం వైపు వెళ్లే కార్లను రాత్రి పది గంటల నుంచి.. జనవరి 1 తెల్లవారుజామున 5 గంటల వరకు పోలీసులు అనుమతి నిరాకరించారు.

పైవంతెనలను మూసివేయనున్న పోలీసులు: శిల్ప లేఅవుట్‌, గచ్చిబౌలి, బయోడైవర్సిటీ.. షేక్‌పేట్‌, మైండ్​స్పేస్‌, దుర్గం చెరువు తీగల వంతెన, సైబర్‌ టవర్‌.. ఫోరం మాల్‌, బాలానగర్‌, కైత్లాపూర్‌ పైవంతెనలను పోలీసులు పూర్తిగా మూసివేయనున్నారు. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణించాలని పోలీసులు సూచిస్తున్నారు. పీవీ ఎక్స్‌ప్రేస్​వే పైవంతెన కూడా మూసివేయనున్నారు. ఈ పైవంతెన మీదగా విమానాశ్రయం చేరుకునే వారు.. విమాన టిక్కెట్లు చూపిస్తే వంతెన మీద నుంచి రాకపోకలకు అనుమతించనున్నారు.

రాచకొండ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో కూడా పైవంతెనలను మూసివేయనున్నారు. బార్‌లు, పబ్‌లలో మద్యం సేవించి ఇళ్లకు వెళ్లే వారికి ఆయా పబ్‌లు, బార్‌ల యాజమాన్యాలే... ఇళ్లకు చేర్చే విధంగా ఏర్పాట్లు చేయాలని పోలీసు అధికారులు కోరారు. పలు ప్రాంతాల్లో డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ తనిఖీలు నిర్వహించనున్నారు. మద్యం సేవించి వాహనం నడుపుతూ పోలీసుల తనిఖీల్లో పట్టుబడితే సదరు వాహనదారుడికి.. రూ.10,000 జరిమానా లేదా ఆరు నెలల జైలు శిక్ష విధించే అవకాశం ఉందని పోలీసులు హెచ్చరించారు.

మాదకద్రవ్యాలు సరఫరా చేయకుండా పోలీసుల నిఘా:క్యాబ్‌, ఆటో డ్రైవర్లు అధిక ధరల పేరిట ప్రయాణికులను వేధిస్తే చర్యలు తీసుకుంటామని పోలీసు అధికారులు స్పష్టం చేశారు. డ్రైవర్లు వేధిస్తే వాట్సప్‌ నెంబర్‌ 9490617346 కు ఫిర్యాదు చేయాలని తెలిపారు. పబ్‌లు, బార్​లలో మాదకద్రవ్యాలు సరఫరా చేయకుండా పోలీసులు నిఘా ఏర్పాటు చేశారు. ప్రతి ఒక్కరు నిబంధనలు పాటించి.. పోలీసులకు సహకరించాలని హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ పోలీసు కమిషనర్‌లు... సీవీ ఆనంద్‌, స్టీఫెన్‌ రవీంద్ర, మహేశ్​ భగవత్‌ సూచించారు.

ఇవీ చదవండి:ఈ రాత్రి నుంచే గ్రూప్‌-4 దరఖాస్తుల స్వీకరణ..!

'కులం వద్దు.. వర్గం వద్దు'.. ప్రభుత్వ బడులపై సర్కార్​ కీలక నిర్ణయం!

Last Updated :Dec 31, 2022, 10:05 PM IST

ABOUT THE AUTHOR

...view details