తెలంగాణ

telangana

Traffic Divertion: భాగ్యనగరంలో రేపు ట్రాఫిక్ ఆంక్షలు

By

Published : Jun 27, 2021, 7:13 PM IST

మాజీ ప్రధాని పీవీ నరసింహారావు శతజయంతి ఉత్సవాలు రేపటితో ముగియనున్నాయి. సోమవారం పీవీ విగ్రహావిష్కరణ కార్యక్రమం నేపథ్యంలో ట్రాఫిక్ పోలీసులు ఆంక్షలు విధించారు. నగరంలోని పలు కూడళ్లలో రాకపోకలను ఇతర ప్రాంతాలకు మళ్లించనున్నట్లు పేర్కొన్నారు.

traffic restrictions, pv narasimha rao
ట్రాఫిక్ ఆంక్షలు, పీవీ నరసింహారావు

మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు విగ్రహావిష్కరణకు నెక్లెస్ రోడ్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించనున్నారు. పంజాగుట్ట, రాజ్ భవన్ నుంచి వచ్చే వాహనాలు ఖైరతాబాద్ నిరంకారి కూడలి వైపు మళ్లించనున్నారు. మినిస్టర్ రోడ్ నుంచి సంజీవయ్య పార్క్ వైపు వచ్చే వాహనాలు బుద్ధ భవన్, నల్లకుంట వంతెన మీదుగా... ట్యాంక్ బండ్ నుంచి సంజీవయ్య పార్క్ వైపు వచ్చే వాహనాలు సోనాభాయి మసీద్ వద్ద కర్బాలా మైదాన్ వైపు మళ్లించనున్నట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.

పార్కింగ్​కు ఏర్పాట్లు

మింట్ కాంపౌండ్ నుంచి వచ్చే వాహనాలు సైఫాబాద్ ట్రాఫిక్ పీఎస్ మీదుగా... తెలుగు తల్లి వంతెన వైపు నుంచి నెక్లెస్ రోడ్ వైపు వచ్చే వాహనాలు ఇక్బాల్ మినార్ మీదుగా మళ్లించనున్నట్లు వెల్లడించారు. ప్రారంభోత్సవాలకు ఖైరతాబాద్ నుంచి వచ్చే వారి వాహనాలు ప్రసాద్ ఐమ్యాక్స్ పక్కన ఉన్న ఖాళీ ప్రదేశంలో పార్కింగ్​కు ఏర్పాటు చేసిన పోలీసులు... సంజీవయ్య పార్క్ వైపుగా వచ్చే వారి కోసం ఎంఎంటీఎస్ రైల్వే స్టేషన్ సమీపంలోని ఖాళీ ప్రదేశంలో పార్కింగ్ చేసుకోవాలని సూచించారు.

ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు..

సికింద్రాబాద్ నుంచి ప్రారంభోత్సవానికి వచ్చే వారు మినిస్టర్ రోడ్-కిమ్స్ ఆస్పత్రి-సంజీవయ్య పార్క్ నుంచి రావాలని... లిబర్టీ నుంచి వచ్చేవారు అప్పర్ ట్యాంక్ బండ్-సెయిలింగ్ క్లబ్-సంజీవయ్య పార్క్ వైపుగా రావాలని సూచించారు. ఉదయం 8.30 నుంచి మధ్యాహ్నం 1.30 వరకూ అంక్షలు ఉంటాయని తెలిపిన ట్రాఫిక్ పోలీసులు స్పష్టం చేశారు.

విగ్రహావిష్కరణకు సన్నాహాలు

పీవీ ఘనతను చాటేలా రాష్ట్ర ప్రభుత్వం ఏడాదిగా ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. హైదరాబాద్‌ పీవీ మార్గ్‌లోని జ్ఞానభూమిలో ఉత్సవాల ముగింపు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఉత్సవాల కమిటీ అధ్యక్షుడు, ఎంపీ కె.కేశవరావు(keshava rao) తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై, ముఖ్యమంత్రి కేసీఆర్‌ పాల్గొననున్నారు. తొలుత 26 అడుగుల ఎత్తయిన పీవీ కాంస్య విగ్రహాన్ని, పీవీ మార్గ్‌ బోర్డును వీరు ఆవిష్కరించనున్నారు. అనంతరం 11.30 గంటలకు ప్రారంభమయ్యే కార్యక్రమంలో 9 పుస్తకాలను విడుదల చేయనున్నారు. ఇందులో పీవీ రాసినవి 4 కాగా.. మిగతావి ఆయన కృషిని, జీవితాన్ని విశ్లేషించేవి ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం, భాషా సాంస్కృతిక శాఖ, తెలంగాణ సాహిత్య అకాడమీలు ఈ పుస్తకాలను ప్రచురించాయి.

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details