తెలంగాణ

telangana

డెంగీ తొంగి చూస్తోంది..

By

Published : May 16, 2020, 8:38 AM IST

ఓ పక్క భాగ్యనగరంలో కరోనా కలకలం సృష్టిస్తుంటే మరోపక్క డెంగీ సమస్య మొదలైంది. రెండింటి ప్రాథమిక లక్షణం జ్వరమే. శరీర ఉష్ణోగ్రత పెరగ్గానే ఏ వైరస్సో తెలియక బాధితులు గందరగోళానికి గురవుతున్నారు. కరోనా భయంతో డయల్‌ 104ను సంప్రదిస్తున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులకు పరుగులు తీస్తున్నారు. రోగ నిర్ధారణ పరీక్షలకు పట్టుబడుతున్నారు. ఇదే అదనుగా కొన్ని ప్రైవేటు ఆస్పత్రులు పరీక్షల పేరిట పెద్దయెత్తున వసూళ్లు చేస్తున్నాయి.

dengue effect in Hyderabad  latest news
dengue effect in Hyderabad latest news

జూన్‌లో నగరంలోని పరిస్థితులు మరింత తీవ్రంగా మారుతాయని నిపుణుల అంచనా. కరోనా కట్టడి చర్యలతోపాటు.. దోమల నివారణ చర్యలు, వర్షాకాల కార్యాచరణను తక్షణం అమలు చేయాలన్న డిమాండ్‌ ప్రజల నుంచి వినిపిస్తోంది.

రూ.1.50 లక్షల ఖర్చు...

దోమల నివారణలో జీహెచ్‌ఎంసీ విఫలమైందంటూ అల్వాల్‌కు చెందిన ఓ వ్యక్తి అధికారులకు తాజాగా మెయిల్‌ చేశారు. ‘‘ఉన్నట్టుండి నాకు జ్వరమొచ్చింది. ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లా. నాలుగు రోజులు తిప్పారు. కరోనా వైరస్సేమోనని ఆందోళనపడ్డాం. సీటీ స్కాన్‌, ఇతరత్రా పరీక్షలు చేసి డెంగీ వచ్చిందన్నారు. అప్పటికే రూ.1.50 లక్షల ఖర్చయింది. ఇంటికెళ్లాక, పక్కనున్న నిర్మాణంలోని భవనం దోమల వృద్ధికి కారణమని తెలిసిందని పేర్కొన్నారు.’’

ఈ ఏడాదీ తీవ్రమేనన్న అనుమానాలు...

నగరంలో గతేడాది అత్యధికంగా 1,406 మంది డెంగీ బారినపడ్డారు. దోమలను అదుపు చేసే విషయంలో విఫలమవడంతోనే ఈ పరిస్థితి తలెత్తిందని అప్పట్లో విమర్శలొచ్చాయి. 2020లో ఇప్పటివరకు నమోదైన గణాంకాలు పరిశీలిస్తే ఈ ఏడాదీ డెంగీ తీవ్రత ఎక్కువగా ఉంటుందన్న అంచనాలున్నాయి. కరోనా మహమ్మారికి డెంగీ, మలేరియా జ్వరాలు తోడైతే నగరంలో పరిస్థితి మరింత తీవ్రంగా మారుతుందని వైద్య నిపుణులు ఆందోళన చెందుతున్నారు.

ప్రభుత్వ ఆస్పత్రుల్లో పరీక్షలు...

గతేడాది రాష్ట్ర ప్రభుత్వం గాంధీ, ఉస్మానియా, నిలోఫర్‌, ఐపీఎం, ఫీవర్‌ ఆసుపత్రులకు మాత్రమే నేరుగా డెంగీ నిర్ధారణ పరీక్షలు చేసే అనుమతిచ్చింది. నగరవ్యాప్తంగా ఉన్న ప్రాథమిక వైద్య కేంద్రాలు, ఇతర ఆరోగ్య కేంద్రాలు సైతం అనుమానిత వ్యక్తుల రక్త నమూనాలు తీసుకొని అక్కడికే పంపిస్తాయి.

చాలా వ్యత్యాసముంది...

డెంగీకి, కరోనాకు చాలా వ్యత్యాసముంది. ప్రజలు గందరగోళపడొద్దు. డెంగీ జ్వరం 104-105 డిగ్రీల ఉష్ణోగ్రతల మధ్య ఉంటుంది. కొద్దిగా ఉప్పు, చక్కెర కలిపిన మజ్జిగ, పండ్ల రసాలు, తాగునీరు తీసుకోవాలి. శరీర ఉష్ణోగ్రతను తగ్గించుకోవాలి. వైద్య పరీక్షలు చేయించుకోవాలి.

- డా.రాంబాబు, బల్దియా చీఫ్‌ ఎంటమాలజిస్టు

దోమల నివారణ అందరి బాధ్యత...

జాతీయ డెంగీ దినోత్సవాన్ని పురస్కరించుకుని నేడు నగరవ్యాప్తంగా దోమల నివారణపై ప్రజా చైతన్య కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు జీహెచ్‌ఎంసీ అధికారులు తెలిపారు . ‘ఉన్నట్టుండి జ్వరం రావడం, కండరాల నొప్పులు, చర్మంపై దద్దుర్లు, అధిక దాహం, రక్తపోటు ఇతరత్రా డెంగీ లక్షణాలు. అశ్రద్ధగా ఉంటే వ్యాధి ప్రాణాంతకంగా మారుతుంది. దోమల తీవ్రత అధికంగా ఉంటే హెల్ప్‌లైన్‌ నంబరు 040-2111 1111ను లేదా ‘మైజీహెచ్‌ఎంసీ’ మొబైల్‌ అప్లికేషన్‌లో ఫిర్యాదు చేయాలని అధికారులు సూచించారు.

ABOUT THE AUTHOR

...view details