తెలంగాణ

telangana

తెలంగాణ నీటిపారుదలకు రూ.26,885 కోట్లు

By

Published : Feb 6, 2023, 11:43 AM IST

Telangana irrigation Budget 2023 : తెలంగాణ నీటిపారుదల రంగానికి 2023-24 ఆర్థిక ఏడాదికిగానూ రాష్ట్ర ప్రభుత్వం రూ.26,885 కోట్లు ప్రతిపాదించింది. ఈమేరకు శాసనసభలో ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు తెలిపారు. ప్రజల ఆశీస్సులే కొండంత అండగా భావించి తెలంగాణ ప్రభుత్వం 1 కోటి 25 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యాన్ని అతి త్వరలోనే చేరుకునేందుకు కృతనిశ్చయంతో ముందుకు సాగుతోందని తెలిపారు.

Telangana irrigation Budget 2023
Telangana irrigation Budget 2023

Telangana irrigation Budget 2023-24 : తెలంగాణలో మండు వేసవిలోనూ మత్తడి దూకేలా చెరువులు, ఎత్తిపోతల ప్రాజెక్టుల ద్వారా రిజర్వాయర్లకు చేరుతున్న నదీజలాలలు.. సాగునీటి రంగంలో రాష్ట్రం సాధించిన అద్భుతాలు ఆవిష్కరిస్తున్నాయని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు తెలిపారు. రాష్ట్ర నీటిపారుదల రంగానికి బడ్జెట్‌లో రూ.26,885 కోట్లు ప్రతిపాదిస్తున్నట్లు తెలిపారు. ఏదేమైనా.. ఎవరు కలిసి వచ్చినా రాకున్నా.. ప్రజల ఆశీస్సులే కొండంత అండగా భావించి.. తెలంగాణ సర్కార్ కోటి 25 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యాన్ని త్వరలోనే చేరుకునేందుకు కృతనిశ్చయంతో ముందుకు సాగుతోందని వివరించారు.

Telangana Budget 2023-24 : 'తెలంగాణ సర్కార్ తదేక దీక్షతో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాన్ని జరిపిస్తోంది. కేంద్రం తోడ్పాటు ఇవ్వకపోవడమే కాకుండా.. సకాలంలో అనుమతి ఇవ్వకుండా అడ్డంకులు సృష్టిస్తోంది. కృష్ణా నదీ జలాల్లో తెలంగాణ వాటాను నిర్ధారించమంటే. .విపరీతమైన తాత్సారం చేస్తోంది. రాష్ట్రంలో నిర్మిస్తున్న ఒక్క ప్రాజెక్టుకు అయినా జాతీయ హోదా కల్పించాలని కేంద్రానికి ఎన్ని విజ్ఞప్తులు చేసినా.. స్పందించడం లేదు.' అని మంత్రి హరీశ్ రావు అన్నారు.

‘‘రాష్ట్ర ప్రభుత్వం రూ.3,825 కోట్లతో 1200 చెక్ డ్యామ్‌ల నిర్మాణం చేపట్టింది. వీటిలో మొదటి దశ 650 చెక్ డ్యాంల నిర్మాణం పూర్తయింది. ఉమ్మడి పాలమూరు, రంగారెడ్డి జిల్లాలను సంపూర్ణంగా సస్యశ్యామలం చేసే విధంగా తెలంగాణ ప్రభుత్వం పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టును నిర్మిస్తున్నది. ఈ ప్రాజెక్టు నిర్మాణం దాదాపు 60 శాతం పూర్తయింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేసే సీతారామ ప్రాజెక్టు పనులు శరవేగంగా జరుగుతున్నాయి." - హరీశ్ రావు, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి

'కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం దేశ చరిత్రలోనే అపూర్వ ఘట్టం. రాష్ట్రంలో మొత్తంగా 73 లక్షల 33 వేల ఎకరాలకు సాగునీటి వసతి ఏర్పడింది. రానున్న రెండు మూడేళ్లలో మరో 50 లక్షల 24 వేల ఎకరాలకు సాగు నీరు అందుతుంది. ప్రజల ఆశీస్సులే కొండంత అండగా భావించి తెలంగాణ ప్రభుత్వం 1 కోటి 25 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యాన్ని అతి త్వరలోనే చేరుకునేందుకు కృతనిశ్చయంతో ముందుకు సాగుతున్నది. ఇందుకోసం నీటిపారుదల రంగానికి బడ్జెట్ రూ.26,885 కోట్లు ప్రతిపాదిస్తున్నాం’ అని మంత్రి హరీశ్ రావు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details