తెలంగాణ

telangana

TSPSC పేపర్ లీకేజీ... 40 లక్షల లావాదేవీలు జరిగాయి.. హైకోర్టుకు సిట్ నివేదిక

By

Published : Apr 11, 2023, 3:15 PM IST

Updated : Apr 11, 2023, 7:21 PM IST

highcourt
highcourt

15:08 April 11

TSPSC పేపర్ లీకేజీ... ఎగ్జామ్స్​ నిర్వహించే వారిని పరీక్షలకు అనుమతించారా?: హైకోర్టు

TS Highcourt on TSPSC Paper Leakage Case: టీఎస్​పీఎస్సీ ప్రశ్నపత్రం లీకేజీ కేసులో ఇప్పటి వరకు జరిగిన దర్యాప్తు వివరాలను హైకోర్టుకు సిట్... సీల్డు కవర్‌లో సమర్పించింది. ప్రశ్నపత్రం లీకేజీ కేసును సీబీఐకి అప్పగించాలన్న ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ పిటిషన్‌పై జస్టిస్ బి.విజయసేన్ రెడ్డి బెంచ్ వద్ద ఇవాళ మరోసారి విచారణ జరిగింది. దర్యాప్తు పారదర్శకంగా జరుగుతోందని.. పిటిషనర్ ఊహాజనిత ఆరోపణలతో సీబీఐ దర్యాప్తు కోరుతున్నారని అడ్వకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ వాదించారు. సిట్ అధికారులు ఇప్పటి వరకు 17 మంది నిందితులను అరెస్టు చేశారని.. న్యూజిలాండ్‌లో ఉన్న మరొకరిని అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఏజీ వివరించారు.

ఈ కేసు దర్యాప్తు సీబీఐకి ఇవ్వాలి :పిటిషనర్ల తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది వివేక్ ఠంకా వాదించారు. ప్రశ్నపత్రాల లీకేజీలో కొందరు పెద్దల ప్రమేయం ఉందని.. ప్రభుత్వ కనుసన్నల్లో ఉన్న సిట్ వాటన్నింటిపై దర్యాప్తు చేయలేదన్నారు. సిట్ విచారణ ప్రక్రియలో అనేక లోపాలు ఉన్నాయని.. కొందరు చిన్న ఉద్యోగులకే దర్యాప్తు పరిమితమవుతోందని వాదించారు. ఏ జిల్లాలో ఎంతమందికి ఎన్ని మార్కులు వచ్చాయో మంత్రి ఎలా చెబుతారని వివేక్ ఠంకా వాదించారు. విదేశీ లావాదేవీలు కూడా ఉన్నాయన్న అనుమానంతో ఈడీ కూడా రంగంలోకి దిగిందని.. కాబట్టి సీబీఐకి ఇవ్వాలని కోరారు. పరీక్షలు రాసే ఉద్యోగులు ప్రశ్నపత్రాలతో సంబంధమున్న బాధ్యతల్లో ఎలా ఉంటారని హైకోర్టు వ్యాఖ్యానించింది. పరీక్షల నిర్వహణకు సంబంధించిన అవుట్ సోర్సింగ్ బాధ్యతలు ఏ సంస్థకు ఇచ్చారని ఆరా తీసింది. ప్రశ్నపత్రాల రూపకల్పన టీఎస్పీఎస్సీనే చేస్తుందని.. దీనిలో అవుట్ సోర్సింగ్ సంస్థల ప్రమేయం ఉండదని ఏజీ వివరించారు.

పేపర్‌ లీకేజీలో 40 లక్షల వరకు లావాదేవీలు జరిగాయి : పేపర్‌ లీకేజీ కేసు దర్యాప్తుపై హైకోర్టుకు నివేదిక సమర్పించిన సిట్... పేపర్‌ లీకేజీలో 40 లక్షల వరకు లావాదేవీలు జరిగాయంది. అక్రమంగా ప్రశ్నపత్రాలు పొందిన 15 మందిని అరెస్టు చేశామని వెల్లడించింది. కాన్ఫిడెన్షియల్ విభాగం ఇన్‌ఛార్జ్‌ శంకరలక్ష్మిని సాక్షిగా పేర్కొన్న సిట్.. ప్రశ్నపత్రాల లీకేజీలో ప్రవీణ్, రాజశేఖర్‌దే ప్రధాన పాత్రగా వెల్లడించింది. టీఎస్‌పీఎస్‌సీ ఛైర్మన్, కార్యదర్శి, సభ్యుడిని విచారించామన్న సిట్‌.. గతంలో అనేక క్లిష్టమైన కేసులు దర్యాప్తు చేసిన అనుభవం తమకు ఉందని తెలిపింది. ప్రశ్నపత్రాల లీకేజీపై పటిష్టమైన దర్యాప్తు జరుగుతోందని... సీబీఐకి అప్పగించాల్సిన అవసరం లేదంది. కీలకమైన ఫోరెన్సిక్ నివేదికలు అందాల్సి ఉందన్న సిట్... ఆరోపణలు చేసిన రాజకీయ నేతలు కీలకమైన సమాచారం ఇవ్వలేదని తెలిపింది. సాక్షులు, నిందితుల వాంగ్మూలాలను హైకోర్టుకు సమర్పించింది.

తదుపరి విచారణ ఈనెల 24కు వాయిదా :తదుపరి విచారణకు సహకరించేందుకు వీలుగా సీల్డు కవర్‌లో సమర్పించిన దర్యాప్తు వివరాలు పిటిషనర్‌కు ఇవ్వొచ్చా అని హైకోర్టు అడగ్గా... ఏజీ అభ్యంతరం చెప్పారు. దర్యాప్తునకు సంబంధించిన కీలక వివరాలు ఉన్నందున.. కేసుతో సంబంధం లేదని పిటిషనర్‌కు ఇవ్వరాదన్నారు. తామే నివేదిక పరిశీలిస్తామని.. నిందితులు, వారి ప్రమేయమేంటి.. పరీక్ష రాసిన సిబ్బందికి ఎన్నిమార్కులు వచ్చాయి.. తదితర వివరాలు పట్టిక రూపంలో ఇవ్వాలని తెలిపింది. తదుపరి విచారణను ఈనెల 24వ తేదీకి వాయిదా వేసింది.

ఇవీ చదవండి:

Last Updated :Apr 11, 2023, 7:21 PM IST

ABOUT THE AUTHOR

...view details