తెలంగాణ

telangana

Telangana High Court: సమాచార హక్కుపై సీఎస్ కీలక ఉత్తర్వులు.. హైకోర్టు స్టే

By

Published : Nov 1, 2021, 11:56 AM IST

Updated : Nov 1, 2021, 3:07 PM IST

Telangana High Court
Telangana High Court

11:53 November 01

సీఎస్ ఉత్తర్వులపై హైకోర్టు స్టే

ఆర్టీఐ కింద సమాచారం ఇచ్చేముందు శాఖాధిపతుల అనుమతి పొందాలంటూ సీఎస్ సోమేశ్​ కుమార్ జారీ చేసిన ఉత్తర్వులపై హైకోర్టు స్టే విధించింది. గత నెల 13న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్​ కుమార్ అంతర్గత అత్యవసర ఉత్తర్వులు జారీ చేశారు. పలు కార్యాలయాల్లోని పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్లు పూర్తి వివరాలు పరిశీలించకుండానే సమాచార హక్కు చట్టం కింద అందే దరఖాస్తులకు సమాచారం ఇస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని అందులో పేర్కొన్నారు. కాబట్టి పీఐఓలు శాఖాధిపతుల నుంచి ముందస్తు అనుమతి తీసుకున్న తర్వాతే ఆర్టీఐ కింద వివరాలు ఇచ్చేలా తగిన సూచనలు ఇవ్వాలని ప్రిన్సిపల్ సెక్రటరీలకు సీఎస్ ఆదేశాలు జారీ చేశారు.

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులను సవాల్ చేస్తూ హైకోర్టులో పలు ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలయ్యాయి. న్యాయ విద్యార్థి శ్రీధ్రుతి చిత్రపు పిల్ పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీశ్​ చంద్ర శర్మ, జస్టిస్ ఎ.రాజశేఖర్ రెడ్డి ధర్మాసనం విచారణ చేపట్టింది. సీఎస్ ఉత్తర్వులు సమాచార హక్కు చట్టానికి, రాజ్యాగానికి విరుద్ధంగా ఉన్నాయని శ్రీధ్రుతి వాదించారు. సమాచారం ఇచ్చేందుకు పీఐఓలు శాఖాధిపతుల సహకారం తీసుకోవచ్చునని.. సమాచార హక్కు చట్టంలో సెక్షన్ 5లో ఉందని అడ్వరేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ వాదించారు.

సహకారం తీసుకోవడం... ముందస్తు అనుమతి పొందడం వేర్వేరని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ముందస్తు అనుమతి తీసుకోవాలని చట్టంలో ఎక్కడా లేదని హైకోర్టు పేర్కొంది. సీఎస్ ఉత్తర్వుల అమలును నిలిపివేస్తూ మధ్యంతర ఆదేశాలు జారీ చేసిన హైకోర్టు... పూర్తి వివరాలతో కౌంటరు దాఖలు చేయాలని ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది.

ఇదీ చూడండి:సమాచార హక్కు చట్టానికి సంకెళ్లు!

Last Updated : Nov 1, 2021, 3:07 PM IST

ABOUT THE AUTHOR

...view details