తెలంగాణ

telangana

TS High court: స్కూళ్లలో అధిక ఫీజుల వసూళ్లపై వివరణ ఇవ్వండి: హైకోర్టు

By

Published : Oct 20, 2021, 9:32 AM IST

పాఠశాలల్లో అధిక ఫీజులు వసూలు చేయడంపై హైకోర్టు(TS High court) విచారణ చేపట్టింది. ఇష్టానుసారం ఫీజులను వసూలు చేయడంపై వివరణ ఇవ్వాలంటూ నోటీసులు జారీ చేసింది. అధిక ఫీజులు వసూలు చేయడాన్ని సవాలు చేస్తూ హైదరాబాద్ స్కూల్ పేరెంట్స్ అసోషియేషన్ తరఫున సంయుక్త కార్యదర్శి కె.వి.సాయినాథ్ దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై ధర్మాసనం విచారణ జరిపింది.

TS High court, school fees in telangana
తెలంగాణ హైకోర్టు, తెలంగాణలో అధిక ఫీజు వసూలు

పాఠశాలల్లో ఫీజులపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు హైకోర్టు(TS High court) నోటీసులు జారీ చేసింది. ఫీజుల నియంత్రణకు నిర్దిష్ట అథారిటీ లేకపోవడంతో పాఠశాలలు ఇష్టానుసారం ఫీజులను వసూలు చేయడంపై వివరణ ఇవ్వాలంటూ ఆదేశించింది. ఈమేరకు పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి, డైరెక్టర్, కేంద్ర విద్యాశాఖ, సీబీఎస్ఈ, తెలంగాణ గుర్తింపు పొందిన పాఠశాలల మేనేజ్‌మెంట్‌ అసోషియేషన్, స్వతంత్ర పాఠశాలల మేనేజ్‌మెంట్‌ అసోషియేషన్లకు నోటీసులు జారీ చేసింది. ఫీజుల నియంత్రణ సంస్థ లేకపోవడంతో ప్రైవేట్, అన్ఎయిడెడ్ పాఠశాలలు ఇష్టానుసారం ఫీజులు వసూలు చేయడాన్ని సవాలు చేస్తూ హైదరాబాద్ స్కూల్ పేరెంట్స్ అసోషియేషన్ తరఫున సంయుక్త కార్యదర్శి కె.వి.సాయినాథ్ ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్ చంద్ర శర్మ, జస్టిస్ ఎ.రాజశేఖర్ రెడ్డితో కూడిన ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది.

పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ ఫీజుల నియంత్రణ యంత్రాంగం లేకపోవడంతో పాఠశాలలు ట్యూషన్ ఫీజుతోపాటు ఇతర ఫీజులను తమకు నచ్చిన విధంగా నిర్ణయిస్తున్నాయన్నారు. ఇది చట్ట విరుద్ధమని ఫీజుల నియంత్రణకు ఓ యంత్రాంగాన్ని రూపొందించి కేవలం లాభాల కోసం చేస్తున్న విద్యా వ్యాపారాన్ని అడ్డుకునేలా ఆదేశాలివ్వాలని కోరారు. ఫీజులపై ప్రభుత్వం ఇచ్చిన జీవో 15కు సవరణ తీసుకురావాలని, వసూలు చేసే ఫీజులో 40 శాతం కొవిడ్(covid news) రిలీఫ్ ఫండ్ ఏర్పాటు చేసేలా ఆదేశాలివ్వాలన్నారు. అంతేగాకుండా తిరుపతిరావు కమిటీ నివేదికను బహిరంగపరిచేలా ఆదేశించాలన్నారు. వాదనలను విన్న ధర్మాసనం పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని.. ప్రతివాదులకు నోటీసులు జారీ చేస్తూ విచారణను నవంబరు 17కు వాయిదా వేసింది.

ఇదీ చదవండి:ycp attack: అట్టుడికిన ఆంధ్రరాష్ట్రం.. తెదేపా ఆఫీసుల్లో అల్లరి మూకల విధ్వంసం... ఇవాళ ఏపీ బంద్

ABOUT THE AUTHOR

...view details