తెలంగాణ

telangana

ఎమ్మెల్యేలకు ఎర కేసు.. ప్రభుత్వ పిటిషన్‌పై విచారణకు సీజే నిరాకరణ

By

Published : Feb 8, 2023, 10:52 AM IST

Updated : Feb 8, 2023, 12:02 PM IST

TELANGANA HC
TELANGANA HC

10:46 February 08

ఎమ్మెల్యేలకు ఎర కేసు.. ప్రభుత్వ పిటిషన్‌పై విచారణకు సీజే నిరాకరణ

MLA purchase case in High Court: 'ఎమ్మెల్యేలకు ఎర కేసు' తీర్పు ఆపాలన్న ప్రభుత్వ పిటిషన్‌పై విచారణకు హైకోర్టు సీజే నిరాకరించారు. సింగిల్ జడ్జి వద్ద విచారణకు అనుమతి ఇవ్వాలని కోరిన అడ్వకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్.. సీజేను కోరారు. ధర్మాసనం విచారణ తర్వాత సింగిల్ జడ్జి విచారణ జరపలేరని హైకోర్టు సీజే స్పష్టం చేశారు.

హైకోర్టులో ప్రభుత్వం తరుపున వాదించిన అడ్వకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్.. కేసు ఫైళ్ల కోసం సీబీఐ ఒత్తిడి చేస్తోందని ఆరోపించారు. కేసు ఫైళ్లు ఇవ్వాలని సీఎస్‌కు నిన్న మరోసారి సీబీఐ లేఖ రాసిందని పేర్కొన్నారు. వాదనలు విన్న హైకోర్టు సీజే.. డివిజన్ బెంచ్ తీర్పు ఇచ్చాక మళ్లీ సింగిల్ జడ్జి విచారణ జరపరాదని స్పష్టం చేశారు. డివిజన్ బెంచ్ తీర్పును సుప్రీంకోర్టు మాత్రమే సమీక్షిస్తుందని హైకోర్టు సీజే జస్టిస్ ఉజ్జల్ భూయాన్ పేర్కొన్నారు.

ఎన్నో మలుపులు తిరుగుతున్న ఎమ్మెల్యేలకు ఎర కేసు ఇప్పటికే సీబీఐకి చేరింది. కేసు దర్యాప్తునకు ఉన్న అడ్డంకులు.. హైకోర్టు ధర్మాసనం తీర్పుతో తొలిగిపోయాయి. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును రద్దు చేయాలని.. సిట్ దర్యాప్తు యథావిధిగా కొనసాగేలా చూడాలని ప్రభుత్వం వేసిన అప్పీల్‌ను సీజే ధర్మాసనం ఇదివరకే కొట్టేసింది. ఈ పిటిషన్‌కు అర్హత లేదని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. ఎమ్మెల్యేలకు ఎర కేసులో ఉన్న నేర తీవ్రతను పరిగణలోకి తీసుకున్న సింగిల్ బెంచ్.. సీబీఐ దర్యాప్తునకు ఆదేశిస్తూ తీర్పు ఇచ్చిందని దీనిపై నిర్ణయం తీసుకోలేమని హైకోర్టు తెలిపింది.

ఎమ్మెల్యేల కొనుగోలుకు దారితీసిన అంశాలపై సీబీఐ దృష్టి: మెయినాబాద్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన ఎఫ్ఐఆర్ ఆధారంగా.. సీబీఐ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నారు. ఇప్పటి వరకు సిట్ అధికారులు చేసిన దర్యాప్తు.. రద్దు చేస్తున్నట్లు సింగిల్ బెంచ్ గతంలోనే తీర్పు ఇచ్చింది. కాబట్టి సీబీఐ మొదటి నుంచి దర్యాప్తు చేయనుంది. ప్రధానంగా ఫామ్‌హౌజ్‌లో చోటు చేసుకున్న ఘటనల గురించి.. సీబీఐ అధికారులు ఆరా తీసే అవకాశం ఉంది. ఎమ్మెల్యేల కొనుగోలుకు దారితీసిన అంశాలపై అధికారులు దృష్టి పెట్టనున్నారు.

వివిధ అంశాల గురించి సీబీఐ అధికారుల ఆరా: ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి మొయినాబాద్ పోలీస్ స్టేషన్‌లో చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. ఆయన ఫిర్యాదులో పేర్కొన్న అంశాల గురించి సీబీఐ అధికారులు ఆరా తీయనున్నారు. అంతే కాకుండా కేసు దర్యాప్తు దశలో ఉన్న సమయంలో.. కీలకమైన వీడియోలు బయటికి వెళ్లడాన్ని హైకోర్టు సింగిల్ బెంచ్ తప్పు పట్టింది. నేరానికి సంబంధించిన వీడియోలు సీఎంకు ఎలా చేరాయనన్న దానికి.. పోలీసులు, ఫిర్యాదుదారులు సరైన సమాధానం చెప్పలేదని హైకోర్టు తప్పుపట్టింది. ఈ విషయంపైనా సీబీఐ అధికారులు దృష్టి పెట్టే అవకాశం ఉంది.

ఇవీ చదవండి:

Last Updated :Feb 8, 2023, 12:02 PM IST

ABOUT THE AUTHOR

...view details