తెలంగాణ

telangana

Ganesh Immersion: ఏర్పాట్లు పూర్తి.. విధుల్లో 19 వేల మంది పోలీసులు

By

Published : Sep 18, 2021, 12:33 PM IST

గణేశ్​ నిమజ్జనానికి ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది. అన్ని శాఖలతో సమన్వయం చేసి... నిమజ్జన ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు మంత్రి తలసాని వెల్లడించారు. నిమజ్జనానికి వచ్చే ప్రతి ఒక్కరికి మాస్కులు పంపిణీ చేస్తున్నట్లు స్పష్టం చేశారు. విధుల్లో 19వేల మంది పోలీసులు పాల్గొననున్నట్లు సీపీ అంజనీకుమార్ వెల్లడించారు.

Ganesh Immersion
Ganesh Immersion

సుప్రీం కోర్టు అనుమతులతో హైదరాబాద్‌లో ఆదివారం జరిగే గణేశ్‌ నిమజ్జనానికి... ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. నిమజ్జన వేడుకల్లో పాల్గొనే అన్ని శాఖల అధికారులతో.... మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ సమీక్ష నిర్వహించారు. అన్ని శాఖల సమన్వయంతో నిమజ్జన ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు మంత్రి తలసాని వెల్లడించారు.

గణేశ్ నిమజ్జన విధుల్లో 19 వేల మంది పోలీసు సిబ్బంది పాల్గొననున్నారు. జిల్లాల నుంచి 7 వేల మంది పోలీసులను రప్పించినట్లు పోలీస్‌ కమిషనర్‌ అంజనీకుమార్‌ తెలిపారు. హైదరాబాద్​లో 320 కి.మీ.ల పొడవునా గణేశ్ శోభాయాత్ర జరగనున్నట్లు వెల్లడించారు. నిమజ్జన విధుల్లో 8,700 మంది శానిటేషన్ సిబ్బంది పాల్గొననున్నారు. సుమారు 40 వేల విగ్రహాలు ట్యాంక్​బండ్​లో నిమజ్జనం అవుతాయని అంచనా వేస్తున్నట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్​​కుమార్​ తెలిపారు. నిమజ్జనానికి ట్యాంక్‌బండ్ పరిసరాల్లో 40 క్రేన్లు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. మరో నాలుగు క్రేన్లు అదనంగా ఉంచుతామని అధికారులు మంత్రికి వివరించారు. లైఫ్ జాకెట్లు, బోట్లు అందుబాటులో ఉంచామన్నారు. ట్యాంక్‌బండ్ వద్ద 30 మంది గజ ఈతగాళ్లు విధుల్లో పాల్గొంటారని మంత్రి తలసాని వెల్లడించారు.

ఖైరతాబాద్ మహా గణపతి నిమజ్జనం..

క్రేన్ నంబర్ 5 వద్ద ఖైరతాబాద్‌ గణేశుడి నిమజ్జనం చేస్తున్నట్లు మంత్రి తలసాని స్పష్టం చేశారు. గతంలో మాదిరిగా వీలైనంత త్వరగా ఖైరతాబాద్ గణేశుడి నిమజ్జనం చేయాలని సూచించారు. నిమజ్జనంలో పాల్గొనే భక్తులకు మాస్కులు పంపిణీ చేయాలన్నారు. నిమజ్జనం తర్వాత 4 రోజుల్లో వ్యర్థాలు తొలగిస్తామని జీహెచ్‌ఎంసీ కమిషనర్ స్పష్టం చేశారు.

ఇదీ చూడండి:Ganesh Immersion: హుస్సేన్‌సాగర్‌లో గణేశ్​ విగ్రహాల నిమజ్జనానికి సుప్రీం అంగీకారం

ABOUT THE AUTHOR

...view details