తెలంగాణ

telangana

Huzurabad CEC Rules: ఎన్నికల నియమావళి ఆంక్షలు తప్పించుకొనేందుకు సూపర్ ప్లాన్‌!

By

Published : Oct 15, 2021, 4:25 PM IST

కేంద్ర ఎన్నికల సంఘం (Huzurabad CEC Rules) సరికొత్త నిబంధనలను రూపొందించింది. వాటిని హుజూరాబాద్ నియోజకవర్గంలో అమలు చేయాలని సూచించింది. కానీ ఆయా పార్టీలు సీఈసీ నియమాలను తుంగలో తొక్కి ఇష్టానుసారం వ్యహరిస్తున్నాయి.

CEC Rules
ఎన్నికల నియమావళి

కరోనా మహమ్మారి బారిన పడకుండా కేంద్ర ఎన్నికల సంఘం (Huzurabad CEC Rules) సరికొత్త నియమాలను రూపొందించింది. పశ్చిమ బంగా, తమిళనాడు ఎన్నికల సందర్భంగా జరిగిన లోపాలను సవరిస్తూ కొత్త నిబంధనలు రూపొందించింది. వాటిని హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో (Huzurabad CEC Rules) అమలు చేయాలని సూచించింది. అయితే ఎన్నికల కమిషన్ ఉద్దేశాన్ని పక్కన పెట్టి ఆంక్షలను తుంగలో తొక్కేందుకు వీలుగా సమావేశాలను నిర్వహించడం పలు విమర్శలకు తావిస్తోంది. భారీగా జనం గుమికూడదనే ఉద్దేశంతో కొత్త నియమాలను రూపొందించగా.. వాటిని అమలు చేసి ఆదర్శంగా ఉండాల్సిన రాజకీయ పార్టీలు ఆ నిబంధనల నుంచి ఎలా తప్పించుకోవాలో ప్రత్యక్షంగా చేసి చూపెడుతున్నాయి. హుజూరాబాద్ నియోజకవర్గంలో ఎన్నికల నియమావళి అమల్లో ఉన్న దృష్ట్యా నియోజక వర్గ సరిహద్దులోని కూతవేటు దూరంలో పెంచికలపేటలో సభలు, ఆత్మీయ సమావేశాలు ఏర్పాటు చేయడం పట్ల విమర్శలు వెలువెత్తుతున్నాయి.

నియోజకవర్గానికి నియమావళి పరిమితంతో కొత్త ఎత్తులు..

హుజూరాబాద్ ఉప ఎన్నికల (Huzurabad By Election) నియమావళిపై కమిషన్ స్పష్టత ఇవ్వగా పార్టీలు ఊపిరి పీల్చుకున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా స్టార్‌ క్యాంపెయినర్ల సభకు కూడా 1,000 మందికి మించకూడదని ఆంక్షలు విధించింది. దీనితో రాజకీయ పార్టీలు ఒకరకంగా ఉక్కిరిబిక్కిరి అయ్యాయని చెప్పొచ్చు. ఈ క్రమంలో ఎన్నికల నియమావళి కేవలం నియోజకవర్గానికే పరిమితం అని ప్రకటించగా ప్రచారం కోసం ప్రత్యమ్నాయాలు ఆలోచిస్తున్నారు. ప్రస్తుతం సామాజిక మాధ్యమాల ప్రభావం అధికంగా ఉండటంతో కేవలం నియోజకవర్గంలోనే కాకుండా ఇరుగుపొరుగు సెగ్మెంట్లు వేదికగా మార్చుకునే వెసులుబాటు లభించినట్టయింది. ఎన్నికల ప్రచారం కోసం రాజకీయ పార్టీలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాయి. మొదట్లోనే ఎన్నికల కమిషన్ కోడ్ జిల్లా వ్యాప్తంగా ఉంటుందని ప్రకటించినప్పటికీ... ఆ తరువాత ఎన్నికలు జరుగుతున్న నియోజకవర్గం వరకే అమల్లో ఉంటాయని ప్రకటించడం పార్టీకి వరంగా మారిందనే చెప్పాలి.

కరోనా ప్రోటోకాల్‌తో పాటు నియమావళి..

ఎన్నికల నిబంధనలు (CEC Rules), కరోనా నియంత్రణకు చేపట్టాల్సిన నిబంధనలు కూడా విధిగా అమలు చేయాలని ఎన్నికల కమిషన్ షెడ్యూల్‌లో స్పష్టం చేసింది. స్టార్ క్యాంపెయినర్లు ప్రచారం చేసుకునేందుకు అనుమతి ఇచ్చినా... 1,000 మంది మించరాదన్న నిబంధనతో పాటు ర్యాలీలు, రోడ్ షోలు వంటి వాటిని నిషేధించింది. కేవలం సమావేశాలు మాత్రమే ఏర్పాటు చేసుకోవాలని చెప్పింది. ఆయా సమావేశాలకు హాజరయ్యే వారి వివరాలను రిజిస్టర్ చేయాలని కూడా ఆదేశించింది. కఠినమైన ఈ నిబంధనలను అమలు చేయడం రాజకీయ పార్టీలకు దాదాపు అసాధ్యమైందనే చెప్పాలి. ప్రచారం చేయడం ఎలా అనుకుంటున్న పార్టీలకు ఎన్నికల కోడ్ (Election Code) కేవలం హుజూరాబాద్ నియోజకవర్గం వరకే అమల్లో ఉంటుందని ప్రకటించడంతో ఆయా పార్టీలు ఎగిరి గంతేసినంత పనిచేశాయి.

సరిహద్దు ప్రాంతాలపై దృష్టి సారించిన పార్టీలు..

హుజూరాబాద్‌ నియోజకవర్గం(Huzurabad CEC Rules)లో నియమావళి కఠినంగా అమలు చేయడమే కాకుండా ఇప్పటికే అధికార పార్టీ నాయకునితో ఫంక్షన్ హాల్ యజమానితో పాటు భాజపా అభ్యర్థి ఈటల రాజేందర్‌పై కేసు నమోదైయింది. ఈ క్రమంలో కేసులు నమోదు కాకుండా విస్తృత ప్రచారం కోసం పకడ్బందీ ప్రణాళిక అమలు చేస్తున్నారు. ప్రస్తుతం హుజూరాబాద్ నియోజకవర్గంలో తప్ప పక్క నియోజకవర్గాల్లో నియమావళి ఇబ్బందులు ఉండవు అనే నిర్ణయానికి వచ్చిన నాయకులు ప్లాన్‌ బీ అమలు చేస్తున్నారు. కరీంనగర్ జిల్లాలో కాకుండా పొరుగు జిల్లాల సరిహద్దుల్లో సభలు నిర్వహిస్తున్నారు. ఎన్నికల సమీపిస్తున్న కొద్ది ఈ సమావేశాలు మరింత పెరిగే అవకాశాలు లేకపోలేదు.

పెంచికల్ పేట ఎంపిక..

హనుమకొండ జిల్లా పెంచికల్‌ పేట హుజూరాబాద్‌కు కేవలం మూడు కిలోమీటర్ల దూరంలో ఉండటంతో ప్రచారానికి ఈ ప్రాంతాన్ని ఎంచుకోవడం గమనార్హం. నాలుగు రోజుల క్రితం ఈ ప్రాంతంలో సభలకు శ్రీకారం చుట్టారు. ఈ గ్రామంలో హుజూరాబాద్ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టింది. నూతనంగా ఆవిర్భవించిన హనుమకొండ జిల్లాలో ఈ గ్రామం చేరగా హుస్నాబాద్ నియోజవకర్గంలో ఉండడం వీరికి కలిసి వస్తోంది. అంతే కాకుండా కరీంనగర్, వరంగల్ హైవేపైనే ఈ గ్రామం ఉండటం.. పైగా విశాల స్థలం ఉండటం, జన సమీకరణకు ఇబ్బందులు లేకుండా పోయింది. ఈ విధానాన్ని ఇతర పార్టీలు కూడా అమలు చేస్తాయా అన్న అంశంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది.

నియమావళి ఉల్లంఘనతో ప్రజలో ఆందోళన..

ఎన్నికల కమిషన్‌ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినప్పటికీ ఉద్దేశాన్ని పట్టించుకోకుండా ఎన్నికల ప్రచారం చేయడం పట్ల స్థానికుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. జనసమీకరణలో భాగంగా వివిధ జిల్లాలకు చెందిన ప్రజలను పెద్దఎత్తున పెంచికల్ పేటకు తరలిస్తున్నారు. పొరపాటున కరోనా సోకిన వారెవరైనా ఈ సభల్లో పాల్గొంటే పరిస్థితి ఎలా అన్న ఆందోళన వ్యక్తమవుతోంది. కేవలం నిబంధనలను కాకుండా ఉద్దేశాన్ని అర్థం చేసుకొని నియమాలను అమలు చేస్తే బాగుంటుందని ప్రజలు సూచిస్తున్నారు.

ఇదీ చూడండి:Trs Complaint To Ec: 'ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తూ అసత్య ప్రచారాలు చేస్తున్నారు'

Etela Fire on Kcr: 'కేసీఆర్ అహంకారానికి హుజూరాబాద్ ప్రజల ఆత్మగౌరవానికి మధ్య పోరు'

ABOUT THE AUTHOR

...view details