తెలంగాణ

telangana

State VS central: 'అప్పుల రాష్ట్రంగా పరిగణించడం కక్షపూరిత చర్య'

By

Published : May 10, 2022, 5:15 AM IST

Updated : May 10, 2022, 6:24 AM IST

State VS central:
State VS central ()

State VS central: అప్పులు తీసుకునేందుకు కేంద్రం అనుమతులు ఇవ్వకపోవడంపై రాష్ట్ర ప్రభుత్వం నిరసన వ్యక్తం చేసింది. బడ్జెట్ వెలుపలి అప్పులను అకస్మాత్తుగా రాష్ట్రాల అప్పులుగా పరిగణించడం అత్యంత కక్షపూరిత చర్య అన్న ప్రభుత్వం నిబంధనల పేరిట అప్పుల కోసం బంధనాలు వేయడాన్ని తెలంగాణ రాష్ట్రంపై కేంద్రం చూపే వివక్షగా భావించాల్సి ఉంటుందని ఘాటుగా వ్యాఖ్యానించింది. కేంద్ర తరహా నిబంధనలు పాటిస్తున్న తెలంగాణకు రుణాలకు అనుమతి ఇవ్వకపోవడం వివక్ష అవుతుందని... వెంటనే రాజ్యాంగం ప్రకారం అప్పులు తెచ్చుకునేందుకు అనుమతి ఇవ్వాలని కేంద్ర ఆర్థిక శాఖను కోరింది.

State VS central: అన్ని రాష్ట్రాల ఆర్థికశాఖ అధికారులతో కేంద్ర ఆర్థికశాఖ కార్యదర్శి సోమనాథన్, ఇతర ఉన్నతాధికారులు దృశ్యమాధ్యమ సమీక్ష నిర్వహించారు. మూలధన వ్యయం కోసం రాష్ట్రాలకు ప్రత్యేక సాయం, ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి రాష్ట్రాలు రుణాలు తీసుకునే మార్గదర్శకాలు, కేంద్ర ప్రాయోజిత పథకాలకు నిధుల విడుదల కోసం ఒకే నోడల్ ఏజెన్సీ నమూనా తదితర అంశాలపై చర్చించారు. రాష్ట్ర ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ప్రభుత్వ సలహాదారు జీఆర్ రెడ్డి బీఆర్కే భవన్ నుంచి సమీక్షకు హాజరయ్యారు.

ఎఫ్​ఆర్​బీఎఫ్​ పరిమితులకు అదనంగా రాష్ట్ర ప్రభుత్వాలు కార్పోరేషన్ల ద్వారా అప్పులు తీసుకొని రాష్ట్రాల నిధుల నుంచి చెల్లిస్తున్నాయని కేంద్ర ఆర్థికశాఖ కార్యదర్శి సోమనాథన్ అన్నారు. దీంతో అటువంటి రుణాలను కూడా రాష్ట్రాల అప్పులుగానే భావిస్తామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనలపై రాష్ట్ర ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు అభ్యంతరం వ్యక్తం చేశారు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు రుణాలు తీసుకునేందుకు తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం అనుమతి ఇవ్వకపోవడంపై నిరసన వ్యక్తం చేశారు. మూలధన వ్యయం కోసం 2020-21 నుంచి కేంద్రం రాష్ట్రాలకు రుణాల రూపంలో ఇస్తున్న మొత్తం కూడా ఎఫ్​ఆర్​బీఎమ్ పరిధిలోకి రాదని కేంద్రం తెలిపిందని గుర్తు చేశారు.

'అప్పుల రాష్ట్రంగా పరిగణించడం కక్షపూరిత చర్య'

తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన హామీలు మూలధన వ్యయానికి సంబంధించినవన్న ఆయన... కాళేశ్వరం, మిషన్ భగీరథ, జలవనరుల సదుపాయాల అభివృద్ధి కార్పోరేషన్లు అందులో ప్రధానంగా ఉన్నాయని అన్నారు. ప్రస్తుతం వివిధ దశల్లో ఉన్న ఈ ప్రాజెక్టులు పూర్తైతే తప్ప రుణాలను తిరిగి చెల్లించే స్థితికి ఆయా కార్పోరేషన్లు రావని వివరించారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలైన హడ్కో, ఎన్​సీడీసీ రుణాలను రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తున్నప్పటికీ వాటిని రాష్ట్రాల అప్పుల పరిధిలోకి తీసుకురాలేదని తెలిపారు. కొన్ని అప్పులను ఎఫ్​ఆర్​బీఎమ్​ పరిధిలో చూపడం, మరికొన్నింటిని చూపకపోవడం లాంటి వివక్షాపూరిత చర్యలు తగవని రామకృష్ణారావు అన్నారు. కొత్త రాష్ట్రంలో ప్రజా ఆకాంక్షలు నెరవేర్చేందుకు కార్పోరేషన్ల ద్వారా నిధులు సమీకరించుకున్న తెలంగాణ కొద్దికాలంలోనే అభివృద్ధి, సంక్షేమంలో మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిందని కేంద్రానికి వివరించారు.

మూలధన వ్యయంతో తెలంగాణ దేశంలోనే అగ్రగామిగా నిలిచిందని అన్నారు. 15వ ఆర్థిక సంఘం ఎలాంటి సిఫారసులు చేయనప్పటికీ కేంద్రం అకస్మాత్తుగా బడ్జెట్ వెలుపలి అప్పులను రాష్ట్రాల అప్పులుగా తీసుకోవడం అత్యంత కక్షపూరిత చర్య అని పేర్కొన్నారు. నిబంధనల పేరిట అప్పుల కోసం బంధనాలు వేయడం తెలంగాణ రాష్ట్రంపై కేంద్రం చూపే వివక్షగా భావించాల్సి ఉంటుందని రామకృష్ణారావు అన్నారు. కేంద్ర నిర్ణయం వివిధ అభివృద్ధి పనులపై తీవ్ర ప్రభావం చూపుతుందని, కరోనా అనంతర పరిస్థితుల్లో గాడిలో పడుతున్న తెలంగాణ ఆర్థిక వనరులను దెబ్బతీసేలా ఉందని అన్నారు. 15వ ఆర్థిక సంఘం నివేదికలో పేర్కొనని విషయాలను దాని పేరిట అమలు చేయడం తెలంగాణపై కక్షసాధింపు చర్య, వివక్షాపూరిత చర్యగా భావించాల్సి ఉంటుందని తెలిపారు.

కొత్త నిబంధనలను అమలు చేయాల్సి వస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నుంచి అమలు చేయాలి కానీ, 2020-21 నుంచి అమలు చేయడం అత్యంత వివక్షాపూరిత చర్య అని అన్నారు. రాజ్యాంగం ప్రకారం అప్పు తీసుకునేందుకు తెలంగాణ ప్రభుత్వానికి వెంటనే అనుమతులు ఇవ్వాలని కోరిన రామకృష్ణారావు... అప్పులకు కేంద్రం అనుమతి ఇవ్వకపోతే తెలంగాణ అభివృద్ధికి ప్రతిబంధకంగా మారే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రం పాటిస్తున్న నిబంధనలనే తెలంగాణ కూడా పాటిస్తోంది, అయినా వివక్ష చూపడం సరికాదని పేర్కొన్నారు. ఎలాంటి వివక్ష లేకుండా రాజ్యాంగం ప్రకారం అప్పులు తెచ్చుకునేందుకు తెలంగాణ ప్రభుత్వానికి అనుమతి ఇవ్వాలని కేంద్ర ఆర్థిక శాఖకు రామకృష్ణారావు విజ్ఞప్తి చేశారు.

ఇవీ చూడండి:రూ.3 వేల కోట్ల బకాయిల వసూలుకు ఓటీఎస్ పథకం తెచ్చిన ప్రభుత్వం

పోలీస్ ఇంటెలిజెన్స్‌ ఆఫీసులో బాంబు పేలుడు.. వారి పనేనా?

Last Updated :May 10, 2022, 6:24 AM IST

ABOUT THE AUTHOR

...view details