తెలంగాణ

telangana

ST STUDENTS: 10కి ముందే బడికి స్వస్తి పలుకుతున్న ఎస్టీ విద్యార్థులు

By

Published : Aug 17, 2021, 7:54 AM IST

రాష్ట్రంలో ఎస్టీ విద్యార్థుల అర్ధంతరంగా చదువుకు స్వస్తి పలుకుతున్నారు. పదో తరగతి పూర్తి కాకముందే 57 శాతం మంది విద్యార్థులు బడి మానేస్తున్నారు. అయితే ఇందులో 5వ తరగతిలోపు 28% మంది ఉన్నట్లు యూడైస్‌ గణాంకాలు చెబుతున్నాయి.

st-students-retiring-from-school-before-10th-class
10కి ముందే బడికి స్వస్తి పలుకుతున్న ఎస్టీ విద్యార్థులు

రాష్ట్రంలో ఎస్టీ విద్యార్థులు అర్ధంతరంగా చదువు మానేయడం ఆందోళన కలిగిస్తోంది. పదో తరగతి పూర్తయ్యేలోపే ఏకంగా 57 శాతం మంది మధ్యలోనే బడికి దూరమవుతున్నారు. అయిదో తరగతి పూర్తిలోపే వందకు 28 మంది పుస్తకాలను వదిలేస్తున్నారు. ఏకీకృత జిల్లా విద్యా సమాచార వ్యవస్థ (యూడైస్‌) 2019-20 గణాంకాలు ఈ విషయాన్ని వెల్లడిస్తున్నాయి. పాఠశాల విద్యాశాఖ సోమవారం యూడైస్‌ గణాంకాలను మీడియాకు విడుదల చేసింది.

2010-11లో ఒకటో తరగతిలో 1,27,859 మంది చేరగా...2019-20లో పదో తరగతిలోకి వచ్చే సరికి ఆ సంఖ్య 55,039కి పడిపోయింది. అంటే ఏకంగా 56.95 శాతం మంది తగ్గిపోయారు. డ్రాపౌట్‌ శాతం ఎస్సీల్లో 32.61 శాతం ఉండగా...అన్ని వర్గాలను పరిగణనలోకి తీసుకుంటే 31.14 శాతం ఉన్నట్లు తేలింది. 2015-16లో ఒకటో తరగతిలో 94,247 మంది ఎస్టీ విద్యార్థులు చేరగా 2019-20లో అయిదో తరగతిలోకి వచ్చే సరికి వారి సంఖ్య 67,538కి తగ్గిపోయింది. అంటే 28.34 శాతం మంది బడికి దూరమయ్యారు. అదే ఎస్సీ విద్యార్థుల్లో 14.61 శాతంగా ఉంది.

పూర్వ ప్రాథమిక తరగతుల్లో 2.72 లక్షలు...

  • రాష్ట్రంలో పూర్వ ప్రాథమిక తరగతుల్లో మొత్తం 2,72,165 మంది విద్యార్థులున్నారు.
  • రాష్ట్రవ్యాప్తంగా 40,898 బడులు ఉండగా అతి తక్కువగా జయశంకర్‌ భూపాలపల్లిలో 537 ఉన్నాయి.
  • 11,357 మంది ఆంగ్ల మాధ్యమంలో బోధించే ఉపాధ్యాయులు ఉండగా వీరిలో దాదాపు 3 వేల మంది ఆదర్శ పాఠశాలల్లో (మోడల్‌ స్కూళ్లు) ఉన్నారు.
  • ప్రభుత్వ, స్థానిక సంస్థల పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు 1,17,292 మంది.
    - 2014-15లో ప్రాథమిక పాఠశాలల్లో ప్రతి 28 మంది పిల్లలకు ఒక ఉపాధ్యాయుడు ఉండగా...2018-19కి ప్రతి 22 మందికి ఒకరు పనిచేస్తున్నారు.
  • ప్రాథమికోన్నత పాఠశాలల్లో ప్రతి 19 మంది విద్యార్థులకు ఒక టీచర్‌ ఉన్నారు.
    (విద్యా హక్కు చట్టం ప్రకారం ప్రాథమిక బడుల్లో ప్రతి 30 మందికి ఒక ఉపాధ్యాయుడు ఉండాలి)

ఇదీ చూడండి:ఆన్​లైన్ విద్యతో.. మసకబారుతున్న సృజన!

ABOUT THE AUTHOR

...view details