తెలంగాణ

telangana

Road accidents in hyderabad: పెరుగుతున్న ప్రమాదాలు.. ఐదు నెల‌ల్లోనే 356 మంది దుర్మరణం

By

Published : Jun 13, 2022, 4:31 PM IST

Road accidents in hyderabad: హైదరాబాద్‌లో తరచుగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. జ‌నంతో పోటీ ప‌డుతూ పెరుగుతున్న వాహనాల సంఖ్యతో పాటు ప్రమాదాలు సైతం అదే స్థాయిలో చోటుచేసుకుంటున్నాయి. సైబ‌రాబాద్ పోలీసు క‌మిష‌న‌రేట్ ప‌రిధిలో 5 నెల‌ల్లోనే 356 మంది రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోవటం పరిస్థితికి అద్దం పడుతోంది.

Road accidents in hyderabad
రోజురోజుకు పెరుగుతున్న ప్రమాదాలు

రోజురోజుకు పెరుగుతున్న ప్రమాదాలు.. ఐదు నెల‌ల్లోనే 356 మంది దుర్మరణం

Road accidents in hyderabad: ఇంటి నుంచి బయటికి వెళ్లిన వారు తిరిగి వచ్చే దాకా భయాందోళనే. కొందరు నిర్లక్ష్యం మరికొందరి పాలిట శాపంగా మారుతుండగా అమాయకులు అనాథలుగా మారుతున్నారు. అతివేగం, నిర్లక్ష్యం, మద్యం మత్తులో వాహనాలు నడపటం... ఇలా అడుగడుగునా ట్రాఫిక్‌ నిబంధనల ఉల్లంఘనలతో అమాయకుల ప్రాణాలను బలితీసుకుంటున్నాయి. సైబరాబాద్‌ పోలీసు కమిషరేట్‌ పరిధిలో 5'నెలల వ్యవధిలో 1,493 రోడ్డు ప్రమాదాలుల జరిగాయి. ఈ ఘటనల్లో 356 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 1,403 మంది గాయాలపాలయ్యారు. రోడ్డు ప్రమాదాలు అధికంగా జరుగుతున్న 10 బ్లాక్‌ స్పాట్‌లను గతేడాది గుర్తించిన పోలీసులు నియంత్రణకు చర్యలు చేపట్టారు. ఈ ఏడాది కొత్తగా మరో 15 ప్రాంతాలు ప్రమాదకరమైనవిగా నిర్దారించారు. ఎన్ని చర్యలు చేపట్టినా ప్రమాదాలకు అడ్డుకట్ట వేయటం పోలీసు యంత్రాంగానికి సవాల్‌గా మారుతోంది.


గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో 78 లక్షలు వాహనాలుంటే వీటిలో 50 లక్షల వరకు ద్విచక్రవావాహనాలే ఉంటాయని అంచనా. ఉద్యోగ, ఉపాధి కోసం మోటార్‌ సైకిల్‌ అవసరంగా మారింది. ఇంజినీరింగ్, మెడిసిన్, డిగ్రీ చదివే విద్యార్థులు బైక్‌ లేకుండా కళాశాలకు వెళ్లేందుకు మొండికేసే పరిస్థితి. వాయిదాల పద్ధతిన సులభంగా యువత చేతికి వాహనాలు అందుతున్నాయి. పోలీసులకు పట్టుబడకుండా నెంబరు ప్లేట్లను తొలగించటంతో పాటు ఏదైనా అడ్డుగా ఉంచి, చలాన్‌ల నుంచి తాత్కాలికంగా తప్పించుకుంటున్నా... ప్రాణాల మీదికొచ్చే వరకు మాత్రం గుర్తించలేకపోతున్నారు. గత 4 నెలల వ్యవధిలో ద్విచక్రవాహనం నడుపుతూ ప్రమాదానికి గురై.... 161 మంది మరణించారు. వీరిలో హెల్మెట్‌ ధరించని వారు 143 మంది ఉన్నారు. పోలీసులు నమోదు చేస్తున్న ఎంవీ చట్టం కేసుల్లో అధికశాతం హెల్మెట్‌ ధరించనివారే ఉంటున్నారు.


హైదరాబాద్‌ రాయదుర్గం, షేక్‌పేట్, శేరిలింగంపల్లి, మియాపూర్, చందానగర్, మాదాపూర్, గచ్చిబౌలి, కూకట్‌పల్లి, మూసాపేట, మాదాపూర్, నిజాంపేట, బాచుపల్లి తదితర ప్రాంతాల్లో ప్రమాదాలు తరచుగా చోటుచేసుకుంటున్నాయి. లక్షలాది వాహనాలు ప్రయాణించే ఈ మార్గాలకు ఇరువైపులా ఉన్న దుకాణాలు, హోటళ్లు రహదారులను ఆక్రమించాయి. యదేచ్ఛగా రోడ్లపైకి చేరుతున్న తోపుడుబండ్లు ప్రమాదాలకు మరింత కారణమవుతున్నారు. నిబంధనలు పాటించని వాహనదారులపై కేసులు, జరిమానాలు, జైలు శిక్షలు, డ్రైవింగ్‌ లైసెన్స్‌లు రద్దు చేస్తున్నా... వీరి ఆగడాలకు మాత్రం అడ్డుకట్ట పడటంలేదు. డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసుల్లో నిత్యం వేలాది మంది పట్టుబడుతూనే ఉన్నారు. సైబరాబాద్‌ పోలీసులు 5 నెలల్లో 18 వేల 662 మందిపై డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసులు నమోదు చేశారు. గతేడాది 215 మంది డైవింగ్‌ లైసెన్స్‌ను సస్పెండ్‌ చేశారు. రోడ్డు ప్రమాదాలను అరికట్టడంలో పోలీసులు సైతం విఫలమవుతున్నట్లు విమర్శలు వస్తున్నాయి. ట్రాఫిక్‌ నియంత్రించాల్సిన పోలీసులు కెమెరాలతో ఫొటోలు, చలాన్‌లకే పరిమితం కాకుండా... ప్రమాదాల నివారణపై దృష్టిసారించాల్సిన అవసరముందని ప్రజలు కోరుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details