తెలంగాణ

telangana

బండి సంజయ్‌పై అర్వింద్ వ్యాఖ్యలను ఖండించిన ఎమ్మెల్యే రాజాసింగ్

By

Published : Mar 13, 2023, 9:17 PM IST

Updated : Mar 13, 2023, 10:08 PM IST

Rajasingh Denied MP Aravind Comments: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​పై ఆ పార్టీ ఎంపీ అర్వింద్ చేసిన వ్యాఖ్యలను ఎమ్మెల్యే రాజాసింగ్ ఖండించారు. అర్వింద్‌కు సంజయ్‌తో ఇబ్బంది ఉంటే నేరుగా మాట్లాడాలన్న రాజాసింగ్.. తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

Rajasingh
Rajasingh

Rajasingh Denied MP Aravind Comments : తెలంగాణ రాజకీయాల్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ బీఆర్​ఎస్ ఎమ్మెల్సీ కవితపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. దిల్లీ మద్యం కుంభకోణం కేసులో కవిత ఈడీ నోటీసుల సందర్భంగా బండి చేసిన అనుచిత వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఇదే అంశంపై బండి సంజయ్​కు రాష్ట్ర మహిళా కమిషన్ ఇప్పటికే నోటీసులు జారీ చేసింది. ఆయన వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన కమిషన్ సుమోటోగా స్వీకరించింది. ఈ నెల 15న ఉదయం 11 గంటలకు విచారణకు హాజరు కావాలని ఆదేశించింది.

ఇదిలా ఉంటే బండి సంజయ్ వ్యాఖ్యలు ఆ పార్టీలోని నాయకుల మధ్యే అగ్గిరాజేస్తున్నాయి. ఆదివారం దిల్లీలో మీడియాతో మాట్లాడిన నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాజాగా బండి సంజయ్​పై అర్వింద్ చేసిన వ్యాఖ్యలను ఆ పార్టీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఖండించారు. సంజయ్‌ చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతం కాదన్నారు. బండి సంజయ్‌ రాష్ట్రానికి పార్టీ అధ్యక్షుడని పేర్కొన్న రాజాసింగ్... ఏది మాట్లాడాలి, ఏది మాట్లాడకూడదనే నాలెడ్జ్‌ అతనికి ఉందని చెప్పారు.

ఇద్దరు పార్లమెంట్‌ సభ్యులేనని దిల్లీలో కలుస్తూనే ఉంటారన్న ఎమ్మెల్యే రాజాసింగ్... అర్వింద్​కి ఏదైనా ఇబ్బంది ఉంటే నేరుగా సంజయ్‌తో మాట్లాడాలే తప్ప మీడియా ముందుకు వచ్చి కామెంట్లు చేయడం తప్పు అని పేర్కొన్నారు. రాష్ట్రంలో బీజేపీకి మంచి స్పందన ఉందని... వచ్చేది బీజేపీ ప్రభుత్వమేనన్నారు. ఎంపీ అర్విద్ చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

బండి సంజయ్‌పై అర్వింద్ వ్యాఖ్యలను ఖండించిన ఎమ్మెల్యే రాజాసింగ్

'సంజయ్ వ్యాఖ్యలు వ్యక్తిగతం కాదు. బండి సంజయ్‌ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు. ఏం మాట్లాడాలి, ఏది మాట్లాడ కూడదో సంజయ్‌కు తెలుసు. ఎంపీ అర్వింద్‌ ఆలోచించి మాట్లాడి ఉంటే బాగుండేది. అర్వింద్‌కు సంజయ్‌తో ఇబ్బంది ఉంటే నేరుగా మాట్లాడాలి. ఇద్దరు ఎంపీలే కదా.. దిల్లీలో కలిసి మాట్లాడుకోవాలి. మీడియా ముందుకు వచ్చి కామెంట్లు చేయటం తప్పు. అర్వింద్‌ తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని నా విజ్ఞప్తి.'-రాజాసింగ్‌, ఎమ్మెల్యే

ఇంతకీ అర్వింద్ ఏం వ్యాఖ్యలు చేశారంటే :బీఆర్​ఎస్​ ఎమ్మెల్సీ కవిత పట్ల బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను సమర్ధించబోనని ఎంపీ అర్వింద్ పేర్కొన్నారు. ఆయన తన వ్యాఖ్యలు ఉపసంహరించుకుంటే మంచిదని హితవు పలికారు. బండి సంజయ్ వ్యాఖ్యలు బీఆర్​ఎస్​ పార్టీకి ఒక ఆయుధంగా మారాయని వ్యాఖ్యానించారు. మాట్లాడేటప్పుడు సామెతలను జాగ్రత్తగా వినియోగించాలని సూచించారు. ఆయన వ్యాఖ్యలతో పార్టీకి ఏం సంబంధం లేదన్నారు. ఆ వ్యాఖ్యలు బండి సంజయ్ వ్యక్తిగతమన్న అర్వింద్.. వాటికి ఆయనే సమాధానం చెప్పాలన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి అంటే హోదా.. పవర్ సెంటర్​ కాదని ధ్వజమెత్తారు. ఇదిలా ఉంటే బండి వ్యాఖ్యలపై ఇప్పటికే పెద్ద ఎత్తున ఆందోళనలు చేసిన బీఆర్​ఎస్ శ్రేణులు... వివిధ పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేశారు.

ఇవీ చదవండి:

Last Updated :Mar 13, 2023, 10:08 PM IST

ABOUT THE AUTHOR

...view details