తెలంగాణ

telangana

RAIN IN HYDERABAD: హైదరాబాద్‌లో కుంభవృష్టి.. ఏరులను తలపిస్తున్న కాలనీలు

By

Published : Oct 8, 2021, 5:08 PM IST

Updated : Oct 8, 2021, 10:37 PM IST

నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాల్లో కుండపోత వర్షం పడుతోంది. భారీ వర్షానికి రహదారులు జలమయమయ్యాయి. వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. నగరంలో కుండపోత వర్షానికి లోతట్టు ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.

RAIN IN HYDERABAD
RAIN IN HYDERABAD

హైదరాబాద్‌లో కుండపోత వర్షం

భారీ వర్షం హైదరాబాద్‌ను ముంచెత్తింది. నగరంలో కుండపోత వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయయ్యాయి. వివిధ చోట్ల రహదారులపై నీరు నిలిచి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. హయత్‌నగర్ నుంచి ఎల్బీ నగర్ మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వర్షపు నీటిలో చాలాసేపు వాహనాలు నిలిచిపోయాయి. సుష్మా, పనామా, చింతల్‌కుంట కూడళ్లు సహా జాతీయ రహదారిపై భారీగా వర్షపునీరు నిలిచింది. చింతల్‌కుంట నుంచి ఎల్బీనగర్ వైపు రాకపోకలు నిలిచిపోయాయి. కూకట్​పల్లి పరిసర ప్రాంతాల్లో కురిసిన వర్షానికి వాహనదారులు ఇబ్బందులకు గురయ్యారు. వనస్థలిపురం, బీఎన్‌రెడ్డి నగర్‌, అబ్దుల్లాపూర్‌మెట్‌, పెద్దఅంబర్​పేట, అనాజ్‌పూర్​లో కూడా వర్షం పడింది. దిల్‌సుఖ్‌నగర్‌, సరూర్‌నగర్‌, సైదాబాద్‌, చంపాపేట్‌లో కురిసిన వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. పాతబస్తీ, గోల్కొండ పరిసర ప్రాంతాల్లో కూడా వర్షం పడింది.హబ్సీగూడ, నాగోల్, రామంతపూర్‌, కాచిగూడ, ఎల్బీనగర్‌, మన్సూరాబాద్, మీర్‌పేట్, తుర్కయంజాల్‌, శంషాబాద్, రాజేంద్రనగర్, కిస్మత్‌పూర్‌, రాంనగర్​ ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది.

దారి కనిపించక కింద పడుతున్న వాహనదారులు..

హైదరాబాద్‌లో భారీ వర్షంతో వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. చైతన్యపురిలోని వరదనీటిలో రహదారి కనిపించక... బైకుపై వెళ్తున్న వ్యక్తి కిందపడిపోయాడు. భారీగా కురిసిన వర్షానికి రోడ్లపై వరద ప్రవహిస్తోంది. నాచారం, హబ్సీగూడ, తార్నాక, ఓయూ క్యాంపస్, లాలాగూడ ప్రాంతాల్లో భారీ వర్షానికి ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.

జలదిగ్బంధం

భారీ వర్షం వల్ల కొత్తపేట జలదిగ్బంధమైంది. రోడ్లపై భారీగా నీరు చేరింది. వాహనదారులు నెమ్మదిగా ప్రయాణాలు సాగిస్తున్నారు.ముషీరాబా‌ద్‌లోని కాలనీల్లో వరద ప్రవహించింది. వరదనీటిలో స్థానికుల వస్తువులు కొట్టుకుపోయాయి.హైదరాబాద్‌ శివారు అబ్దుల్లాపూర్‌మెట్‌లో వర్షంతో విద్యుత్‌కు అంతరాయం ఏర్పడింది. విజయవాడ జాతీయ రహదారిపై వర్షపు నీరు పారుతోంది. ద్విచక్రవాహనదారులు వర్షంలో ఎక్కడికక్కడే వాహనాలు నిలిపేశారు. వనస్థలిపురంలోని పనామా కూడలి వద్ద భారీగా వర్షపు నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు, మోకాలు లోతు వరద నీరు చేరడంతో విజయవాడ రహదారిపై ట్రాఫిక్ స్తంభించింది. దీంతో ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్​ను నియంత్రిస్తున్నారు. మరోవైపు చింతలకుంట వద్ద నడుములోతు నీరు చేరడంతో.. విజయవాడ వెళ్లే బస్సులు నిలిపివేశారు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు.

అధికారులను అప్రమత్తం చేసిన మేయర్​

హైదరాబాద్‌లో భారీ వర్షాలపై అధికారులను మేయర్​ విజయలక్ష్మి అప్రమత్తం చేశారు. నగరవాసులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని.. రోడ్లపై వర్షపు నీరు సాఫీగా వెళ్లేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. మాన్సూన్ సిబ్బంది పనిలో ఉండేలా చూడాలన్న మేయర్‌.. డీఆర్‌ఎఫ్ బృందాలు అప్రమత్తంగా ఉండాలన్నారు.లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు. సమస్యలపై ఫిర్యాదు చేసేందుకు కాల్ సెంటర్ ఏర్పాటు చేశారు. ఏదైనా ఆపద వాటిల్లితే 040 2111 1111 నంబర్​కు ఫోన్​ చేయాలన్నారు.

రాగల మూడు రోజులు వర్షాలు

రాష్ట్రంలో రాగల మూడు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఈ రోజు క్రింది స్థాయి గాలులు తూర్పు, ఈశాన్య దిశల నుంచి తెలంగాణ రాష్ట్రంలోకి వస్తున్నట్లు తెలిపింది. తూర్పు మధ్య అరేబియా సముద్రం నుంచి రాయలసీమ, ఆంధ్రప్రదేశ్ తీరం మీదుగా పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు ఉన్న ఉపరితల ఆవర్తనం ఇవాళ బలహీన పడినట్లు పేర్కొంది. ఈ నెల 10న ఉత్తర అండమాన్ సముద్రంలో అల్పపీడనం ఏర్పడే అవకాశాలు ఉన్నాయని వెల్లడించింది.

ఈ అల్పపీడనం మరింత బలపడి పశ్చిమ, వాయవ్య దిశగా ప్రయాణించి తదుపరి నాలుగైదు రోజుల్లో దక్షిణ ఒడిశా- ఉత్తర కోస్తా ఆంధ్రా తీరానికి చేరుకునే అవకాశం ఉందని తెలిపింది. నైరుతి రుతుపవనాలు ఉత్తర భారతదేశంలోని కొన్ని భాగాల నుంచి విరమించాయని.. రాగల 2 రోజుల్లో గుజరాత్, మధ్యప్రదేశ్, ఉత్తర ప్రదేశ్​లలో మరికొన్ని భాగాల నుంచి విరమించే అవకాశాలు ఉన్నట్లు ప్రకటించింది.

ఇదీ చదవండి: KTR on Urban Development: హైదరాబాద్​లో మరో భారీ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టబోతున్నాం: కేటీఆర్

Last Updated : Oct 8, 2021, 10:37 PM IST

ABOUT THE AUTHOR

...view details