తెలంగాణ

telangana

కళాతపస్వి కన్నుమూత.. వెండితెరకి ఇకపై దొరకునా అటువంటి సేవ !

By

Published : Feb 3, 2023, 9:31 AM IST

Political Leaders Condolence on K Viswanath Demise : దిగ్గజ దర్శకుడు​, కళాతపస్వి కె. విశ్వనాథ్ మృతిపై పలువురు రాజకీయ నేతలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెలుగు సినిమా స్థాయిని విశ్వవ్యాప్తం చేసిన ఘనత విశ్వనాథ్​ది అని కొనియాడారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

K Viswanath
K Viswanath

Political Leaders Condolence on K Viswanath Demise: లెజండరీ డైరెక్టర్​, కళాతపస్వి కె. విశ్వనాథ్ మృతిపై పలువురు నేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వెండితెరపై ఆయన లిఖించిన చరిత్ర పుటాలను గుర్తు చేసుకున్నారు. వారి కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

భారతీయ సినిమా జీనియస్‌ను కోల్పోయింది:గవర్నర్‌ తమిళిసై

కళాతపస్వి విశ్వనాథ్‌ మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ అన్నారు. ఈ మేరకు ఆమె ట్వీట్‌ చేశారు. భారతీయ సినిమా జీనియస్‌ను కోల్పోయిందని తమిళిసై పేర్కొన్నారు. విశ్వనాథ్‌ దర్శకత్వంలో వచ్చిన శంకరాభరణం, స్వాతిముత్యం, సాగర సంగమం వంటి క్లాసిక్‌ చిత్రాలు రానున్న తరాలకు స్ఫూర్తిగా నిలుస్తాయన్నారు.

తెలుగు సినిమా ఉన్నన్ని రోజులు కె.విశ్వనాథ్ పేరు నిలిచి ఉంటుంది: కేసీఆర్‌

ప్రముఖ దర్శకుడు కళాతపస్వి, పద్మశ్రీ కె.విశ్వనాథ్ మరణం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌ రావు సంతాపం తెలిపారు. అతి సామాన్యమైన కథను ఎంచుకొని తన అద్భుతమైన ప్రతిభతో.. వెండి తెర దృశ్య కావ్యంగా మలిచిన అరుదైన దర్శకుడు కె.విశ్వనాథ్ అని సీఎం కేసీఆర్‌ కొనియాడారు. గతంలో కె.విశ్వనాథ్ గారి ఆరోగ్యం బాగాలేనప్పుడు వారి ఇంటికి వెళ్లి పరామర్శించానని, ఆ సమయంలో సినిమాలు, సంగీతం, సాహిత్యంపై తమ మధ్య జరిగిన చర్చను సీఎం గుర్తు చేసుకున్నారు. భారతీయ సామాజిక సంస్కృతీ సంప్రదాయ విలువలకు తన సినిమాలో పెద్ద పీట వేశారని ఆయన కేసీఆర్‌ కొనియాడారు.

సృజనాత్మక దృష్టితో తెలుగు సినిమాపై చెరగని ముద్ర: కిషన్‌రెడ్డి

దిగ్గజ దర్శకుడు కె.విశ్వనాథ్‌ మరణం పట్ల కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ‘‘అద్భుత కథనం, సృజనాత్మక దృష్టితో లెజండరీ డైరెక్టర్‌ కె.విశ్వనాథ్‌ తెలుగు సినిమాపై చెరగని ముద్రవేశారు. భారత చిత్ర పరిశ్రమకు చేసిన ఆయన సేవలకు ఎన్నో అవార్డులు, ప్రశంసలు గెలుచుకున్నారు. ఈ సమయంలో నా ప్రార్థనలు, ఆలోచనలు ఆయన కుటుంబంపైనే ఉన్నాయి’’ అని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.

ఏపీ సీఎం జగన్​ దిగ్భ్రాంతి: ప్రముఖ దర్శకుడు కె.విశ్వనాథ్‌ మృతిపై సీఎం జగన్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెలుగు సినీదర్శకుల్లో విశ్వనాథ్‌ అగ్రగణ్యుడని పేర్కొన్నారు. తెలుగు సంస్కృతి, భారతీయ కళలకు విశ్వనాథ్‌ గుర్తింపు తెచ్చారని కొనియాడారు. తెలుగు చలనచిత్ర రంగానికి విశ్వనాథ్ ఎనలేని కృషిచేశారని తెలిపారు. విశ్వనాథ్‌ మృతి తెలుగు సినీరంగానికి లోటన్నారు. విశ్వనాథ్‌ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.

చంద్రబాబు దిగ్భ్రాంతి:కళాతపస్వి మృతి పై తెలుగుదేశం అధినేత చంద్రబాబు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. కళాఖండాలుగా నిలిచిన అనేక చిత్రాలను అందించిన విశ్వనాథ్ మృతి తనను తీవ్రంగా కలచివేసిందని విచారం వ్యక్తం చేశారు. ఆయన మృతి సినీ ప్రపంచానికి తీరని లోటని చంద్రబాబు అన్నారు. విశ్వనాథ్ ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

వెంకయ్యనాయుడు​ దిగ్భ్రాంతి:డైరెక్టర్​ విశ్వనాథ్‌ మృతి పట్ల మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సంతాపం తెలిపారు. తెలుగు సినిమా స్థాయిని విశ్వనాథ్‌ పెంచారన్న వెంకయ్య.. మన ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేశారని కొనియాడారు. విశ్వనాథ్‌ ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. విశ్వనాథ్‌ కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

లోకేశ్​ దిగ్భ్రాంతి:ప్రముఖ దర్శకుడు కళాతపస్వి కె. విశ్వనాథ్ మృతి తెలుగు చ‌ల‌న‌చిత్ర ప‌రిశ్ర‌మ‌కి తీర‌ని లోటని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్​ అన్నారు. ఆయన మృతి పట్ల సంతాపం ప్రకటించారు. అత్య‌ద్భుత చిత్రాలని తెర‌కెక్కించి, తెలుగు చ‌ల‌న‌చిత్ర ప‌రిశ్ర‌మ‌కే వ‌న్నెతెచ్చిన దిగ్గజ దర్శకుడు దివంగ‌తులవ‌డం చాలా బాధాక‌రమని ఆవేదన వ్యక్తం చేశారు. క‌ళాత‌ప‌స్వి ఆత్మ‌కి శాంతి క‌ల‌గాల‌ని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నానన్నారు. వారి కుటుంబ‌స‌భ్యుల‌కు తన ప్ర‌గాఢ సానుభూతి తెలిపారు.

సోము వీర్రాజు దిగ్భ్రాంతి:విశ్వనాథ్‌ మృతి పట్ల సోము వీర్రాజు సంతాపం వ్యక్తం చేశారు. విశ్వనాథ్‌ మరణం కళాభిమానులకు తీరని లోటన్నారు. విశ్వనాథ్‌ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.

గురువారం రాత్రి తుదిశ్వాస:తెలుగు చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. ఎన్నో అపురూప చిత్రాలను అందించిన దిగ్గజ దర్శకుడు, కళాతపస్విగా పేరొందిన కాశీనాథుని విశ్వనాథ్‌(92) కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన గురువారం రాత్రి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కుటుంబసభ్యులు జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. 5 దశాబ్దాల పాటు తెలుగు చిత్రసీమలో తనదైన ముద్రవేసిన విశ్వనాథ్‌ ఈ లోకాన్ని విడిచి వెళ్లడంతో చిత్ర పరిశ్రమ శోకసంద్రంలో మునిగింది.

విద్యాభ్యాసం మొత్తం గుంటూరులోనే:కె.విశ్వనాథ్‌ స్వస్థలం బాపట్ల జిల్లా రేపల్లెలోని పెద పులివర్రు గ్రామం. 1930 ఫిబ్రవరి 19న కాశీనాథుని సుబ్రహ్మణ్యం, సరస్వతమ్మ దంపతులకు విశ్వనాథ్‌ జన్మించారు. గుంటూరు హిందూ కళాశాలలో ఇంటర్మీడియట్‌, ఆంధ్రా క్రిస్టియన్‌ కళాశాలలో బీఎస్సీ పూర్తి చేశారు. ఆయన తండ్రి చెన్నైలోని విజయవాహినీ స్టూడియోలో పనిచేసేవారు. దీంతో విశ్వనాథ్‌ డిగ్రీ పూర్తవగానే అదే స్టూడియోలో సౌండ్‌ రికార్డిస్ట్‌గా సినీజీవితాన్ని ప్రారంభించారు. తొలిసారి పాతాళభైరవి సినిమాకు అసిస్టెంట్‌ రికార్డిస్ట్‌గా పనిచేశారు. 1965లో 'ఆత్మగౌరవం' సినిమాకు దర్శకుడిగా అవకాశం లభించింది. తొలి చిత్రానికే ఆయనకు నంది అవార్డు అందుకున్నారు. తెలుగు చిత్రపరిశ్రమకు ఎనలేని గౌరవాన్ని తీసుకొచ్చిన ఆయన 50కి పైగా చిత్రాలకు దర్శకత్వం వహించారు. టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌లోనూ 9 చిత్రాలకు విశ్వనాథ్‌ దర్శకత్వ బాధ్యతలు వహించారు. ఎన్నో చిత్రాల్లో కీలక పాత్రలు పోషించారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details