తెలంగాణ

telangana

విషమంగా పీజీ వైద్యవిద్యార్థిని ఆరోగ్య పరిస్థితి.. కన్నీరుమున్నీరవుతున్న తల్లిదండ్రులు

By

Published : Feb 22, 2023, 10:42 PM IST

PG Medical Student Attempt to Suicide Update: వరంగల్ ఎంజీఎంలో హానికరమైన ఇంజెక్షన్ తీసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన వైద్య విద్యార్ధిని ప్రస్తుతం నిమ్స్​లో చికిత్స పొందుతోంది. ఎంజీఎం ఆస్పత్రి నుంచి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ నిమ్స్​కు తీసుకొచ్చారు. రెస్పిరేటరీ ఇంటర్మీడియట్‌ కేర్‌ యూనిట్​లో వెంటిలేటర్​పై ఉంచి చికిత్స అందిస్తున్నారు. మరో వైపు ఇందుకు కారణమైన సీనియర్​పై కఠిన చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.

PG Medical Student
PG Medical Student

PG Medical Student Attempt to Suicide Update: వరంగల్ ఎంజీఎంలో సీనియర్ విద్యార్థి వేధింపులు తాళలేక పీజీ వైద్య విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆమె హైదరాబాద్​లోని నిమ్స్​లో చికిత్స పొందుతోంది. పరిస్థితి విషమంగా ఉండడంతో రెస్పిరేటరీ ఇంటర్మీడియట్‌ కేర్‌ యూనిట్​లో వెంటిలేటర్​పై ఉంచి చికిత్స అందిస్తున్నారు. 5 గంటలు గడిస్తే కానీ వైద్య విద్యార్థిని ప్రీతి పరిస్థితి చెప్పలేమని వైద్యులు తెలిపారు. దాంతో వైద్య విద్యార్థిని ప్రీతి కుటుంబ సభ్యులు, బంధువులు ఆస్పత్రి వద్దకు చేరుకుని కన్నీరు మున్నీరు అవుతున్నారు. తన బిడ్డ పరిస్థితి విషమంగా ఉందని ప్రీతి తండ్రి నరేంద్ర తెలిపారు. ఆసుపత్రి వద్ద మీడియాతో మాట్లాడిన ఆయన కన్నీటి పర్యంతమయ్యారు. కళాశాల యాజమాన్యం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావు స్పందించారు. సీపీతో మాట్లాడి విచారణకు ఆదేశిస్తామన్న ఆయన.. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు.

హైదరాబాద్ బోడుప్పల్​కు చెందిన ప్రీతి ఎంబీబీఎస్‌ పూర్తి చేసి వరంగల్‌ కేఎంసీలో ఎనస్తీషియా విభాగంలో పీజీ మొదటి సంవత్సరం చదువుతోంది. మూడు నెలల క్రితమే కళాశాలలో చేరింది. అప్పటి నుంచి సీనియర్ విద్యార్ధి సైఫ్‌ తనని వేధిస్తున్నాడని... ఈ విషయం కొద్ది రోజుల క్రితం తమకు తెలిపిందని తల్లిదండ్రులు చెబుతున్నారు. సీనియర్లకు ఎదురు తిరిగితే ఇబ్బందులు ఎదురవుతాయని ప్రీతి ఓర్చుకుందని తెలిపారు. వార్డుల్లో విధులు నిర్వర్తించే సమయంలో సహచరుల ముందు, రోగుల ముందు కించపరిచేలా మాట్లాడాడని తెలిపారు.

ఇదే అంశంపై కేఎంసీ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని తండ్రి నరేంద్ర వాపోయారు. తన కుమర్తె తెల్లవారుజామున ఆత్మహత్యాయత్నానికి పాల్పడితే ఇప్పటి వరకు కాలేజీ యాజమాన్యం మాకు ఫోన్ కూడా చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ర్యాగింగ్​ను ప్రీతి వ్యతిరేకించిందని... తనకు మద్దతు పలకాలని తోటి విద్యార్థులను కోరగా రెండు సంవత్సరాలు ఇక్కడే పనిచేయాలి కాబట్టి తమను కూడా వేధిస్తారని తోటి విద్యార్థులు వెనుకడుగు వేశారని ఆయన తెలిపారు. ర్యాగింగ్​కు పాల్పడిన విద్యార్థిపై, అలాగే కాలేజీ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

ఇవాళ ఉదయం ప్రీతి తన చేతికి ఏదో ఇంజెక్షన్‌ తీసుకుందని... ఆమె గదిలో సిరంజి దొరికిందని స్వీపర్ అధికారులకు తెలిపిందని ఆమె సోదరుడు తెలిపారు. ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లడానికి ఏదో హానికారక ఇంజెక్షన్​ను తీసుకున్నట్లు వైద్యులు భావిస్తున్నారన్నారు. అయితే ఆమె ఏ ఇంజెక్షన్ తీసుకుందో తెలుసుకునేందుకు రక్త నమూనాలను ల్యాబ్‌కు పంపారు. నిమ్స్‌ వైద్యులు సోదరి ప్రాణాలు కాపాడేందుకు సాయశక్తులా ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు. బీపీ, షుగర్‌ లెవల్స్ బాగా పడిపోయాయ.. మరికొన్ని గంటలు గడిస్తే తప్ప వైద్యులు ఏం చెప్పలేమన్నారని సోదరుడు పృధ్వి వెల్లడించారు.

ప్రీతి తండ్రి నరేంద్ర ఆర్పీఎఫ్ వరంగల్​లో ఏఎస్సైగా పనిచేస్తున్నారు. ఆయన కుటుంబం హైదరాబాద్​లోని బొడుప్పల్​లో వెస్ట్ బాలాజీ హిల్స్ లో నివాసం ఉంటోంది. నరేంద్ర దంపతులకు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు కాగా... ప్రీతి వీరికి మూడో కుమార్తె. విధుల్లో భాగంగా నరేంద్ర హైదరబాద్ నుంచి వరంగల్ వెళ్లి వస్తుంటారు. తరచూ హాస్టల్​లో ఉంటున్న తన కుమార్తె వద్దకు వెళ్లి బాగోగులు తెలుసుకుంటూ ఉంటారు. ఇదే క్రమంలో వేధింపుల విషయాన్ని తనకు చెప్పినట్లు తండ్రి నరేంద్ర తెలిపారు. మంగళవారం రాత్రి చివరి సారిగా ప్రీతి తన సోదరుడితో మాట్లాడినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. మరో వైపు వరంగల్ పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details